
పూర్వం దమనుడు అనే రాజుకు రాజవర్ధనుడు అనే కొడుకు ఉండేవాడు. తండ్రి తదనంతరం రాజవర్ధనుడు పట్టాభిషిక్తుడై, రాజ్యభారాన్ని చేపట్టాడు. ప్రజలకు చోరభయం, దుష్టమృగ భయం, శత్రుభయం, క్షామం, దారిద్య్రం లేకుండా రాజ్యాన్ని ధర్మమార్గంలో సుభిక్షంగా పాలించసాగాడు. పొరుగు రాజ్యాన్ని పాలించే విధూరథుడికి రాజవర్ధనుడి పాలనాదక్షత గురించి తెలిసింది. విధూరథుడికి మానిని అనే కుమార్తె ఉంది.
రాజవర్ధనుడు తన కుమార్తెకు తగిన వరుడని తలచి, అతడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు. మానిని ద్వారా రాజవర్ధనుడికి అనేకమంది కుమారులు కలిగారు. భార్యతో హాయిగా సంసారయాత్ర సాగిస్తూ, రాజవర్ధనుడు రాజ్యాన్ని సుభిక్షంగా, ప్రశాంతంగా పాలించసాగాడు. అలా ఏడువేల సంవత్సరాలు గడిచిపోయాయి.ఒకనాడు రాజవర్ధనుడికి భార్య మానిని స్వయంగా తలంటు పోయసాగింది. తలంటు పోస్తుండగా, ఆమె కన్నీటి బిందువులు వెచ్చగా రాజవర్ధనుడి నుదుటిపై పడ్డాయి. ఈ పరిణామానికి రాజవర్ధనుడు ఆందోళన చెందాడు. ‘మహారాణీ! ఏమైంది? ఎందుకు దుఃఖిస్తున్నావు?’ అని ప్రశ్నించాడు.
‘మహారాజా! మీ తలవెంట్రుకలు తెల్లబడుతున్నాయి. అందువల్లనే నాకు తీరని విచారంగా ఉంది’ అని ఆమె బదులిచ్చింది.‘మహారాణీ! ప్రకృతి సహజమైన పరిణామానికి విచారిస్తావెందుకు? ఏడువేల సంవత్సరాలు సుఖాలను అనుభవించాం. సద్గుణ సంపన్నులు, పాలనాదక్షులు అయిన సుపుత్రులను పొందాం. మానవులకు జరామరణాలు తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. వార్ధక్యం మరింతగా మీద పడకముందే, రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి, మనం తపోవనాలకు వెళ్లిపోదాం’ అని చెప్పాడు రాజవర్ధనుడు.
రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి, రాజవర్ధనుడు భార్యాసమేతంగా తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోవాలని నిర్ణయించు కున్నట్లు తెలిసి, మంత్రి పురోహితులు విచారించారు. ఈ సంగతి తెలిసి పౌరులు మరింతగా ఆందోళన చెందారు. ‘ఇన్నాళ్లూ మనల్ని కన్నబిడ్డల్లా పరిపాలించిన రాజు రాజ్యాన్ని విడిచి వెళ్లిపోతే, ఇక బతకడం దండగ’ అనుకుని, ప్రజలు బాధపడసాగారు. రాజుకు మరో పదివేల సంవత్సరాల ఆయుర్దాయం కలిగించాలని భావించిన మంత్రులు, ఇందుకు సమర్థులైన పురోహితులను తపోవనాలకు పంపారు. ఇదంతా రాజుకు తెలియకుండానే చేశారు.
పురోహితులు సూర్యభగవానుడి గురించి ఘోరతపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన సూర్యుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. వారి కోరిక మేరకు రాజవర్ధనుడికి మరో పదివేల సంవత్సరాల ఆయుర్దాయాన్ని వరంగా ప్రసాదించాడు. వారు సంతోషంగా రాజధానికి చేరుకుని, మంత్రులకు సూర్యుడు వరమిచ్చిన సంగతి చెప్పి, ఇళ్లకు వెళ్లిపోయారు. సూర్యభగవానుడి వరప్రభావం వల్ల రాజు మరో పదివేల ఏళ్లు తమను పరిపాలించబోతున్నాడని తెలిసి ప్రజలు ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఒకవైపు రాజ్యంలో ప్రజలంతా ఆనందంతో సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు రాజవర్ధనుడు అంతఃపురంలో విచారగ్రస్తుడై కూర్చుండిపోయాడు.
అతడి తీరును గమనించిన మహారాణి మానిని, ‘మహారాజా! ప్రజలంతా సంతోషంగా ఉంటే, మీరు ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు?’ అని అడిగింది.
‘మహారాణీ! మీరంతా ఉండగా, నాకొక్కడికే పదివేల ఏళ్ల ఆయుర్దాయం కలగడం మంచిది కాదు. మంత్రి పురోహితాదులు, ఆప్తులు అందరూ మరణించిన తర్వాత నేను బతికి ఉన్నా, దానివల్ల ప్రయోజనం ఏముంది?’ అన్నాడు రాజవర్ధనుడు.‘మహారాజా! మీరు చెప్పిన మాటలు సమంజసంగానే ఉన్నాయి. దీనికి తరుణోపాయం ఏమిటి?’ అని అడిగింది మానిని. ‘రేపటి వేకువనే మనం తపోవనాలకు బయలుదేరుతున్నాం’ అన్నాడు రాజవర్ధనుడు.మర్నాటి వేకువనే రాజదంపతులు తపోవనాలకు చేరుకున్నారు. రాజవర్ధనుడు సూర్యుడి గురించి తపస్సు చేశాడు.
సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ‘మహాత్మా! నాకొక్కడికే పదివేల సంవత్సరాల ఆయుర్దాయం ఇవ్వడం న్యాయమేనా? నా భార్యా పుత్రులకు, మంత్రి పురోహితులకు, నా రాజ్య పౌరులకు కూడా అంతే ఆయుర్దాయాన్ని అనుగ్రహించు’ అని వరం కోరుకున్నాడు రాజవర్ధనుడు.సూర్యభగవానుడు అతడి ప్రజానురాగానికి సంతోషించి, ‘తథాస్తు’ అని అనుగ్రహించాడు.రాజవర్ధనుడు భార్యాసమేతంగా తిరిగి రాజధానిలోకి అడుగుపెట్టాడు.పురజనులను సమావేశపరచి, సూర్యభగవానుడు అనుగ్రహించిన వరం గురించి చెప్పాడు. ప్రజలందరూ రాజవర్ధనుడికి జయజయధ్వానాలు పలుకుతూ సంతోషం వ్యక్తం చేశారు.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment