కోల్‌కతాలో హత్యాచార ఘటన జరిగాక స్కూలుకెళ్లే ఆడపిల్లల తల్లిదండ్రులు... ఉద్యోగం కోసం, ఇంటి పనుల కోసం బయటకు వెళ్లే ఆడపిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లల క్షేమం గురించి ఆందోళన పెంచుకున్నారు. గంట గంటకూ ఫోన్ చేసి ‘ఎక్కడున్నావ్’ అంటున్నారు. సాయంత్రం ట్యూషన్లు మాన్పిస్తున్నారు. కాని అంత భయపడాల్సిన అవసరం భయపెట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చెప్తే చాలు.
ఒక పెద్ద ఘటన జరిగినప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం గాయపడుతుంది. గాయం తీవ్రంగా ఉన్నప్పుడు అయోమయం, ఆందోళన, భయం, అభద్రత అన్నీ చుట్టుముడతాయి. ఇవన్నీ పిల్లల గురించి, ఆడపిల్లల గురించి అయినప్పుడు ఆ ఆందోళనకు అంతు ఉండదు. ఇప్పుడు కోల్‌కతాలోని స్కూళ్లు చైల్డ్ సైకాలజిస్ట్‌లు, కౌన్సెలర్లతో కిటకిటలాడుతున్నాయి.
అక్కడ ఏం జరిగింది?
పిల్లలకు సహజంగానే కుతూహలం అధికం. కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై దారుణకాండ జరిగిన సంగతి దేశాన్ని కుదిపేస్తే కోల్‌కతా హోరెత్తింది. ఇంటా బయట ఆ సంఘటన గురించే చర్చలు. పిల్లల చెవుల్లో ఆ మాటలు పడనే పడతాయి. అదొక్కటే కాదు... వారికి ఆ సంఘటన గురించి దాచి పెట్టాల్సిన అవసరం కూడా లేదు.
స్కూళ్లు కొన్ని తన విద్యార్థులతో స్వచ్ఛందంగా నిరసనల్లో పాల్గొని ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్నాయి కూడా. వీటన్నింటి దరిమిలా పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ప్రశ్నలతో ముంచెత్తసాగారు టీచర్లని, తల్లిదండ్రులను. డాక్టర్‌కు ఏం జరిగింది? ఆమె ఎలా చనిపోయింది? చేసిన వారిని పట్టుకున్నారా? అలాంటివి మాక్కూడా జరుగుతాయా?... ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక టీచర్లు అవస్థ పడి కౌన్సెలర్లను స్కూళ్లకు పిలుస్తున్నారు.
రెండు విధాలా...
ఇప్పుడు స్కూలు పిల్లలు, ఇంటర్ స్థాయి పిల్లలకు బయట దారుణమైన మనుషులు ఉంటారనే భయంతో వేగడం ఒక సమస్య అయితే అంత వరకూ కొద్దో గొ΄్పో స్వేచ్ఛ ఇస్తూ వచ్చిన తల్లిదండ్రులు స్కూల్ నుంచి లేట్‌గా వచ్చినా, ట్యూషన్‌కు వెళ్లినా, ఇంటి పనుల కోసం బయటకు వెళ్లినా పదే పదే ఫోన్లు చేసి వెంటపడటం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొందరు తల్లిదండ్రులు పెప్పర్ స్ప్రేలు కొనిస్తుండటంతో పిల్లలు మరింత బెంబేలు పడుతున్నారు.
పిల్లలకు ధైర్యం చెప్పాలి
ఇప్పుడు జరగాల్సినది... పిల్లలకు ధైర్యం చెప్పడమే కాకుండా రక్షణ గురించి తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించుకోవాలి. నిర్లక్ష్యం అసలు పనికిరాదని కోల్‌కతా ఘటన తెలియచేస్తోంది. ఎవరూ లేని హాల్లో ఒంటరిగా నిద్రపోవడం ఎంత సురక్షితమో ఆ డాక్టర్ అంచనా వేసుకోలేకపోయింది. తల్లిదండ్రులు కూడా నైట్ డ్యూటీ సమయంలో వీడియో కాల్స్ చేసి ఆమె తిరుగాడక తప్పని పరిసరాలను గమనించి ఉంటే తగిన సూచనలు చేసి ఉండేవారు. అందుకే తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
⇒ పిల్లల రాకపోకల సమయాలను నిర్దిష్టంగా తల్లిదండ్రులు తెలుసుకుని ఉండాలి
⇒ స్కూల్‌కు వెళ్లే సమయం వచ్చే సమయం వారు వచ్చి వెళ్లే దారి, రవాణ వ్యవస్థ, ఎవరైనా కొత్త మనుషులు కలుస్తున్నారా... వంటివి ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి
⇒ ర్యాపిడో వంటి వాహనాలు ఎక్కి రావాల్సి ఉంటే ఎక్కే ముందు ఆ డ్రైవర్‌తో మాట కలిపించి, అతని నంబర్ తీసుకోవాలి లేదా తల్లిదండ్రులే ఫోన్‌పే చేస్తే అతని నంబర్ వచ్చేసినట్టే.
⇒ కొత్త ్రపాంతాలకు వెళ్లేటప్పుడు అవి ఏ మేరకు సురక్షితమో తెలుసుకుని పంపాలి.
⇒ పిల్లలు బయట ఉన్నప్పుడు తప్పకుండా ఫోన్ ఉండేలా చూసుకోవాలి. అది సైలెంట్ మోడ్‌లో లేకుండా పెట్టమని చెప్పాలి.
⇒ పిల్లలను ఊరికే కాల్ చేసి విసిగించకుండా ప్రతి గంటకూ ఒకసారి మెసేజ్ పెడితే చాలని చెప్పాలి.
⇒ పోలీసులకు కాల్ చేయడానికి భయపడకూడదని తెలియజేయాలి.
⇒ ఇంటి బయట, స్కూల్ దగ్గర, బంధువులుగాని, స్కూలు సిబ్బందిగాని ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంటే వెంటనే తమకు చెప్పాలని భయపడకూడదని తెలియజేయాలి.
⇒ చట్టం చాలా శక్తిమంతమైనా, ఆపదలో చిక్కుకున్నప్పుడు దూసుకొచ్చే సాటి మనుషులు ఉంటారని, గట్టిగా సాయం కోరితే అందరూ కాపాడతారని పిల్లలకు చెబుతుండాలి.
⇒ అపరిచిత కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని ఊరికే భయపెట్టే విషయాలను ఆలోచిస్తూ కూచోవద్దని చెప్పాలి.
⇒ ధ్యాస మళ్లించే మంచి స్నేహాలలో ఉండేలా చూసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment