ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు వద్ద గోదావరిలో మునిగిన పిల్లలు.. రోదిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు
సాక్షిప్రతినిధి, వరంగల్: ఈ నెల 2న ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు వద్ద గోదారిలో ఉగాది రోజున పుణ్యస్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతై మరుసటి రోజు శవాలై తేలారు. మృతుల్లో ఆకుదారి సాయివర్దన్(17), డొంగిరి సందీప్(13), బెడిక సతీష్(16) ఉన్నారు. తాజాగా.. జనగామ సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థి రంజిత్ (14) గురువారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి యశ్వంతాపూర్ వాగు సమీప ఓడల బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. బావిలో దూకిన తర్వాత అపస్మారకస్థితిలోకి వెళ్లి చనిపోయాడు.
...ఇలా ఈత సరదా విద్యార్థులు, యువకుల ప్రాణాలను హరిస్తోంది. ఉమ్మడి వరంగల్‌లోనే నీటి ప్రమాదాల కారణంగా మూడేళ్లలో సగటున ఏటా 69 మంది చనిపోతుండగా.. ఈ ఏడాది ఏడు ప్రమాదాల్లో 22 మంది గోదావరి, చెరువుల్లోకి ఈతకు వెళ్లి మృతి చెందారు. ఈసారి కూడా గతేడాదికి ఏమాత్రం తీసిపోకుండా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సీజన్‌లో మొదటిసారి ఈరెండు రోజుల్లో 40 డిగ్రీలు దాటింది. వేసవిలో చిన్నారులు ఈత కొట్టేందుకు ఆసక్తి చూపుతారు. పెద్దలు సైతం వీలు చూసుకుని ఈత కొలనులు, బావులు, వంకకు వెళతారు. ఈత మంచి వ్యాయామం. ఆరోగ్యకరం. కానీ.. ఈత నేర్చుకోకుండా నీటిలో దిగడం ప్రమాదకరం. ఫలితంగా అనేక మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
మచ్చుకు కొన్ని..
► ములుగు జిల్లాలో గతనెల 15న హోలీ పండుగ రోజు మంగపేట మండలం మల్లూరులోని సమీపంలో రావుల కార్తీక్(23) అనే యువకుడు మృత్యువాతపడ్డారు. శివరాత్రి రోజున భూక్య సాయి(19) కుటుంబ సభ్యులతో కలిసి మంగపేట మండలం కమలాపూర్ తీరంలో స్నానానికి వెళ్లి మృతి చెందాడు.
► జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూర్ రిజర్వాయర్‌లో గతేడాది సరదాగా నీటిలోకి దిగిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. రఘునాథపల్లి మండలం మేకలగట్టుకు చెందిన లకావత్ సుమలత, లకావత్ సంగీత, అవినాష్ బొమ్మకూర్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు. సరదాగా నీటిలోకి దిగారు. ఒక్కసారిగా లోతులోకి వెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు.
నిఘాలేదు.. పర్యవేక్షణ లేదు..
నీటి కుంటలు, బావుల వల్ల పొంచి ఉన్న ప్రమాదాల గురించి చిన్నారులను హెచ్చరించాలి. నిపుణులైన శిక్షకుల పర్యవేక్షణలో ఈత నేర్పించాలి. నీట మునిగేవారిని కాపాడే ప్రయత్నంలోనూ కొందరు ఈత వచ్చినవారే ప్రాణాలు కోల్పోతున్నారు. అగ్నిమాపక, పోలీస్‌శాఖ, గజ ఈతగాళ్ల సహకారంతో, రక్షించే మెళకువలపై అవగాహన కల్పించాలి. అప్పుడే.. ఈత సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. నీట మునిగితే ప్రాణాలతో బయట పడటం చాలా కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తలు పాటిస్తేనే నిరోధించవచ్చు
వేసవి సెలవుల్లో విద్యార్థులు గ్రామాల్లోని చెరువులు, బావులు, పంట కాలువలు, కెనాల్స్‌లో ఈత వెళ్లి మృత్యువాతపడుతున్నారు. పిల్లలకు తల్లిదండ్రులు డ్రైవింగ్ నేర్పించిన విధంగా ఈత నేర్పిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు. ప్రస్తుతం కాళేశ్వరం, ఇతరత్రా ప్రాజెక్టుల వల్ల గ్రామాల్లో చెరువులు, కాలువలు, కెనాల్స్ నిండుగా ప్రవహిస్తున్నాయి. వీటిల్లో ఈతకు వెళ్లేందుకు పిల్లలను అనుమతించొద్దు.
గ్రామాల్లోని చెరువుల్లో పూడికతీత సమయంలో గుంతలు ఏర్పడ్డాయి. ఇలాంటి చెరువుల్లోకి దిగితే లోతు తెలవకుండా మునిగిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. చెరువుల వద్ద, కెనాల్స్‌పై పోలీసులు హెచ్చరిక బోర్డులు.. పెట్టించడం తరచుగా పెట్రోలింగ్ నిర్వహిస్తే కొంత మేరకు ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించవచ్చు.
-భగవాన్‌రెడ్డి, డివిజనల్ ఫైర్ ఆఫీసర్ వరంగల్
Comments
Please login to add a commentAdd a comment