Health: నెక్‌ పెయిన్‌కు.. కొన్ని లైఫ్‌స్టైల్‌ అలవాట్లే కారణాలని తెలుసా! | Precautions To Be Taken On Neck Pain And Back Pain Problems In Middle Age | Sakshi
Sakshi News home page

Health: నెక్‌ పెయిన్‌కు.. కొన్ని లైఫ్‌స్టైల్‌ అలవాట్లే కారణాలని తెలుసా!

Published Tue, Sep 3 2024 1:25 PM | Last Updated on Tue, Sep 3 2024 1:25 PM

Precautions To Be Taken On Neck Pain And Back Pain Problems In Middle Age

సాధారణంగా మధ్యవయస్కుల్లో కనిపించే మెడనొప్పి, నడుమునొప్పి వంటి సమస్యలు టీనేజర్లలో అంతగా కనిపించకపోవచ్చు. కానీ వాళ్లలోనూ అవి కనిపించేందుకు అవకాశం లేకపోలేదు. ఇటీవల మాత్రం టీనేజర్లలో మెడనొప్పి కేసులు చాలా ఎక్కువే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెడ ఒంచి మొబైల్‌ చూస్తూ ఉండటం, అదే కాకుండా ఆ వయసులోని పోష్చర్‌కు సంబంధించిన లైఫ్‌స్టైల్‌ అలవాట్లూ ఇందుకు కారణం. ఉదాహరణకు... స్కూళ్లూ / కాలేజీలలో చాలాసేపు మెడవంటి రాసుకుంటూ, చదువుకుంటూ కూర్చునే ఉండటం, సరైన భంగిమ(పోష్చర్‌)లో కూర్చోకపోవడం, బల్ల మీద ఉన్న కంప్యూటర్‌కూ, కుర్చీకీ మధ్య సరైన సమన్వయం లేకపోవడం లాంటి ఎన్నో అంశాలు వాళ్లలో మెడనొప్పికి  కారణమవుతుంటాయి. ఆ సమస్యలనుంచి విముక్తి ఎలాగో తెలుసుకుందాం.

కేవలం కూర్చునే పోష్చర్‌ లాంటి అలవాట్లే కాకుండా... కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా మెడనొప్పి రావచ్చు. ఉదాహరణకు చిన్నతనంలో వచ్చే (టైప్‌–1) డయాబెటిస్, విటమిన్‌ లోపాలు, జీవక్రియల్లో లోపాల వల్ల కూడా టీనేజర్లలో మెడనొప్పి వచ్చే అవకాశముంది.

నివారణ కోసం...

  • – స్కూల్‌ / కాలేజీలో కూర్చునే చోట... డెస్క్‌ తమ ఎత్తుకు తగినట్లుగా ఉందో లేదో / తమ ఎత్తుకు తగినట్లుగా పోష్చర్‌ ఉందో లేదో పరిశీలించుకోవాలి.

  • కంప్యూటర్ల వాడకం లేదా వీడియో గేమ్స్‌లో పోష్చర్‌ సరిగా లేకుండా కూర్చున్నప్పుడు వెన్నుతో పాటు, దేహంలోని కండరాలపై ఒత్తిడి సరిగా పడాల్సిన విధంగా కాకుండా... ఒక్కోచోట ఎక్కువ ఒత్తిడి పడటం, మరికొన్ని చోట్ల సరిగా పడకపోవడం వంటి సమస్యలతో మెడనొప్పి, వెన్నునొప్పి రావచ్చు. అందుకే స్కూల్లో/కాలేజీలో లేదా ఇంట్లో చదువుల బల్ల / కంప్యూటర్‌ టేబుల్‌ వద్ద సరిగా (సరైన పోష్చర్‌లో) కూర్చుండేలా చూడాలి. వెన్నుపై సమాన భారం పడేలా నిటారుగా ఉండాలి. ఏదో ఒక వైపునకు ఒంగిపోకూడదు.

  • స్థూలకాయం ఉన్న టీనేజీ పిల్లల్లో మెడనొప్పి సమస్య ఎక్కువ. టీనేజర్లలో ఒబేసిటీ తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ఒబేసిటీ పెంచే జంక్‌ఫుడ్‌ /బేకరీ ఐటమ్స్‌ లాంటివి కాకుండా టీనేజర్లకు అన్ని పోషకాలూ, విటమిన్లు అందేలా సమతులాహారం ఇవ్వాలి.

  • ఒకప్పుడు టీనేజీ పిల్లలు ఆరుబయట ఒళ్లు అలిసిపోయేలా ఆటలాడేవారు. కానీ ఇటీవల  ఆటలాడటం తగ్గిపోయింది. దాంతో వెన్ను, దాని ఇతర ఎముకలకు తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల కూడా మెడనొప్పి రావడం పెరిగింది. తగినంత వ్యాయామం లేని టీనేజర్లు తమ వర్కవుట్స్‌తో సామర్థ్యం  (స్టామినా) పెంచుకోకపోవడం వల్ల త్వరగా అలసిపోతుంటారు. తగినంత వ్యాయామం చేయడం లేదా బాగా ఆటలాడటం ద్వారా స్టామినా పెంచుకుంటే మెడనొప్పి వంటి సమస్యలూ తగ్గిపోతాయి.

  • పిల్లల్లో విటమిన్‌ డి లోపం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. అంతేకాదు... దాంతో వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల వ్యాధుల రిస్క్‌ కూడా పెరుగుతుంది. అందుకే టీనేజీ పిల్లలకు లేత ఎండ తగిలేందుకు ఆరుబయట ఆటలాడేలా తల్లిదండ్రులు చూడాలి. పోష్చర్‌ సరిచేసుకోవడం, ఆటలాడటం / వ్యాయామం తర్వాత కూడా మెడనొప్పి వస్తుంటే ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకోడానికి ఒకసారి  డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించడం మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement