పార్వతీపురం టౌన్: గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన కమటాన చిరంజీవి బుధవారం పొలం పనికి వెళ్లాడు. కాలుకి ఏదో విష పురుగు కరిచిందని గుర్తించాడు. నడుచుకుంటూ గ్రామానికి వెళ్లాడు. గ్రామానికి వెళ్లిన ఐదు నిమిషాల్లో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే గమనించిన స్థానికులు ఆయనకు కరిచింది విషపురుగు కాదని, చంద్రపొడి (రెసెల్స్‌వైపర్) జాతికి చెందిన విష సర్పం కాటువేసిందని గమనించి పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి 108 వాహనంలో తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు విడిచాడు. కేవలం అవగాహన లోపంవల్ల రైతు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.
కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన కొండగొర్రి రామకృష్ణ మంగళవారం పొలంపని నిమిత్తం తన పత్తి పంటను చూసేందుకు వెళ్లగా ఉల్లిపాము కరిచింది. ఆయన తక్షణమే ఎటువంటి భయానికి గురికాకుండా తన దగ్గరలోవున్న పీహెచ్‌సీకి వెళ్లి స్నేక్‌యాంటీ వీనం వ్యాక్సిన్‌ను చేయించుకున్నాడు. మెరుగైన చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు చికిత్సను అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది. ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డాడు.
పార్వతీపురం మన్యం జిల్లాలో రెండేళ్లలో 493 మంది పాముకాటుకు గురయ్యారు. చాలామంది సకాలంలో ఆస్పత్రికి చేరడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కేవలం ముగ్గురు మాత్రమే మృతిచెందారు. అవగాహన ఉంటే పాముకరిచినా ప్రమాదం కాదని, సకాలంలో వైద్యసేవలు అందితే ప్రాణాపాయ స్థితినుంచి బయట పడవచ్చని వైద్యులు చెబుతున్నారు.
అప్రమత్తతే ప్రధానం..
వర్షా కాలం ఎక్కువగా పాములు సంచరించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు తప్పనిసరిగా చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత వర్షాకాలంలో పాములు తల దాచుకో వటానికి అనేక ప్రాంతాలను నివాస స్థలాలుగా ఎంపిక చేసుకొంటాయి. పొలం గట్ల మీద, చెట్లు ఉన్న ప్రాంతాల కింద నక్కి ఉంటాయి. దీనికి తోడు అవి జనావాసాల్లోకి కూడా వస్తుంటాయి. పొలాల పక్కనే ఉన్న ఇళ్లతోపాటు ఇళ్లలో చిందరవందరగా సామాన్లు పడేసిన గదుల్లో తలదాచుకుంటాయి. కావున అప్రమత్తంగా ఉండి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవడంతోపాటు మురుగు లేకుండా చూసుకోవటం, రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు కర్ర చేతిలో ఉంచుకోవడం, వినికిడి శబ్దాలు చేసే పరికరాలు దగ్గర ఉంచుకోవటం చేయాలి.
తల్లితండ్రులు తమ పిల్లల్ని కూడా గుట్టలు, పుట్టలు దగ్గర ఆటలాడనివ్వకుండా జాగ్రత్త వహించాలి. రైతులు పశువులను పాకల్లో కట్టేసి ఉంచినప్పుడు అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాముల్లో అన్నీ ప్రమాదకరమైనవి కావు. విషపూరితమైన నాగుపాము, కట్లపాడు, రక్తపింజరి, చంద్రపొడి వంటి పాములతో జాగ్రత్తగా ఉండాలి. పాము కరిచిన వెంటనే స్నేక్ యాంటీ వీనమ్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
పాము కాటు లక్షణాలు, చికిత్స..
► పాము కాటుకు గురైన వెంటనే మనిషి శరీరం చల్లగా మారిపోతుంది. ఛాతిలో విపరీతమైన నొప్పి రావడంతోపాటు ఆయాసం వస్తుంది. నోటి నుంచి నురగలు వస్తాయి.
► పాము కాటుకు గురైన వ్యక్తిని కంగారుపెట్టరాదు. ఆందోళనకు గురయితే విషం వేగంగా శరీరం అంతా వ్యాప్తిచెందే అవకాశంఉంటుంది.
► పొడిగా, వదులుగా ఉన్న పట్టీతో లేదా వస్త్రంతో కాటును కప్పాలి.
► వేగంగా యాంటీ వీనమ్‌ను అందించగల ఆరోగ్య కేంద్రానికి వ్యక్తిని తీసుకెళ్లాలి.
► కాటుకు దగ్గరగా గుడ్డను/వస్త్రాన్ని గట్టిగా కట్టరాదు, ఇది ప్రసరణను తగ్గిస్తుంది.
► గాయం కడగరాదు. గాయం మీద ఐస్‌ను పెట్టరాదు.
► గాయం నుంచి విషాన్ని బయటకు పీల్చడానికి ప్రత్నించరాదు.
మెరుగైన వైద్యం
పాముకాటు బారిన పడి న వ్యక్తికి పీహెచ్‌సీలలో చికిత్స అందుబాటులో ఉంది. వారికి కావాల్సిన యాంటీ స్నేక్ వీనం ఇంజక్షన్లు సిద్ధం చేశాం. పాముకాటుకు గురైన వెంటనే దగ్గరలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స తీసుకోవాలి. గాయాన్నిబట్టి రెండుసార్లు స్నేక్‌వీనం డోస్ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రధానంగా భయపడకుండా నిర్భయంగా ఉండాలి.
– డాక్టర్ బి.వాగ్దేవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, పార్వతీపురం మన్యం
Comments
Please login to add a commentAdd a comment