మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో తుకారాం
ఆసిఫాబాద్‌అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి తుకారాం సూచించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, సబ్ సెంటర్‌లలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో ఉన్న సందేహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వూలో వివరించారు.
సాక్షి: సీజనల్ వ్యాధులపై ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు?
డీఎంహెచ్‌వో: డిస్ట్రిక్ కోఆర్డినేషన్ కమిటీ (డీసీసీ) ద్వారా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యాధులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ యూనిట్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. 20 మంది మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నాం. ప్రతీ కుటుంబానికి దోమతెరలు అందించాం. ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఎంపీడీవోల సహకారంతో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఐదేళ్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం.
సాక్షి: వ్యాధుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి?
డీఎంహెచ్‌వో: ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నీటిని వేడిచేసి చల్లార్చి వడబోసిన తర్వాత మాత్రమే తాగాలి. ఆహారం వేడిగా ఉండగానే భుజించాలి. అన్ని పీహెచ్‌సీల్లో వ్యాధుల నివారణ మందులు అందుబాటులో ఉంచాం.
సాక్షి: డెంగీ, టైఫాయిడ్ నిర్ధారణ ఎలా?
డీఎంహెచ్‌వో: జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో సీబీపీ (బ్లడ్ పిక్చర్, ప్లేట్‌లెట్స్, కౌంటింగ్) యంత్రాలు ఉన్నాయి. ప్రజలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు అందుతున్నాయి. జిల్లా కేంద్రంలోని టీహబ్ ద్వారా 53 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది. డెంగీ ఎలిజ టెస్టు ద్వారానే కచ్చితమైన ఫలితం వస్తుంది.
సాక్షి: వైద్యశాఖ అందించే చికిత్సలు ఏమిటి?
డీఎంహెచ్‌వో: అన్ని పీహెచ్‌సీల్లో యాంటిబయాటిక్స్, క్లోరోక్విన్, ప్రైమ్ ఆక్సిజన్, ఆర్టిపీసీటి, అన్ని రకాల విటమిన్స్, నొప్పులు, సిప్రోప్లోక్సిన్, మెట్రోజిల్, ప్లురోక్సిన్, స్పోర్‌లాక్, సీసీఎం, డెరిఫిల్లిన్, దగ్గు మందులు, మాత్రలు, ఐవీ ప్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని 20 పీహెచ్‌సీలు, 2 అర్బన్ సెంటర్‌లు, 118 సబ్ సెంటర్‌ల ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాం.
సాక్షి: గ్రామీణులకు అత్యవసర వైద్యం అందేదెలా?
డీఎంహెచ్‌వో: రోగిని ఇంటి నుంచి ఆస్పత్రులకు తీసుకువచ్చేందుకు 8 అవ్వాల్, 12 (108) వాహనాలు, 15 (102) వాహనాలు, 1 ఎఫ్‌హెచ్‌ఎస్ వాహనం అందుబాటులో ఉంచాం.
సాక్షి: సీజనల్ వ్యాధుల వివరాలు తెలపండి?
డీఎంహెచ్‌వో: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో డెంగీ–81, మలేరియా–69, టైఫాయిడ్–231 కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment