వణికిస్తున్న వ్యాధులు
♦ ఫీవర్ ఆస్పత్రిలో రోగులు బారులు తీరుతున్నారు.
♦ చలిజ్వరాల బాధితులతో బుధవారం ఆస్పత్రి కిక్కిరిసింది.
♦ చాలీచాలని వసతులతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నల్లకుంట: సీజనల్ వ్యాధుల కారణంగా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరడంతో ఓపీ విభాగాన్ని బుధవారం నుంచి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పొడిగించారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఓపీ నిర్వహిస్తారు.
అయితే గత కొద్ది రోజులుగా రోగుల సంఖ్య పెరగడంతో ఓపీ సమయాన్ని పొడిగించినట్లు ఆస్పత్రి డీఎంఓ డాక్టర్ శ్రీకాంత్ భట్ తెలిపారు. రోగులకు సేవలందించేందుకు ఉస్మానియా ఆస్పత్రి నుంచి ఇద్దరు సీనియర్ వైద్యులు , గాంధీ నుంచి ముగ్గురు పీజీలు డిప్యూటేషన్‌పై నియమించినట్లు తెలిపారు. ఫార్మసీలో సాయంత్రం 4 గంటల వరకు మందులు అందజేస్తారన్నారు.
కానరాని ఉస్మానియా వైద్యులు
ఫీవర్‌లో ఓపీ సమయాన్ని పొడిగించినప్పటికీ ఉస్మానియా నుంచి డిప్యుటేషన్‌పై నియమితులైన ఇద్దరు వైద్యులు మొదటి రోజే విధులకు డుమ్మాకొట్టారు. గాంధీ ఆస్పత్రి నుంచి వచ్చిన ఇద్దరు పీజీలు విధులు నిర్వహించారు. వైద్యులు, ఫార్మసీ సిబ్బందిపై అదనపు పనిభారం పడటంతో వారు అసహనం వ్యక్తం చేశారు.
కాగా ఓపీ సమయం పొడిగింపుపై ఉద్యోగులతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆస్పత్రి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపీ పనివేళలు పొడిగించినప్పటికీ రోగుల రద్ధీ కనుగుణంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.