బీఎఫ్.7.. కరోనా ఒమిక్రాన్‌లో సబ్‌వేరియెంట్. ప్రస్తుతం చైనా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. విస్తృతంగా వ్యాప్తి చెందే ఈ వేరియెంట్ ప్రపంచ దేశాలకు కొత్తేం కాదు. అక్టోబర్‌లోనే బిఎఫ్.7 కేసులు అమెరికా, కొన్ని యూరప్ దేశాల్లో వెలుగులోకి వచ్చాయి. ఈ సబ్ వేరియెంట్ అత్యంత బలమైనది. కరోనా సోకి యాంటీబాడీలు వచ్చిననవారు, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తిని ఎదిరించి మరీ ఇది శరీరంలో తిష్టవేసుకొని కూర్చుంటుంది. అందుకే ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని అంటువ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు.
భారత్‌లో జనవరిలో థర్డ్ వేవ్ వచ్చిన సమయంలో ఒమిక్రాన్‌లోని బిఏ.1, బీఏ.2 సబ్ వేరియెంట్‌లు అధికంగా కనిపించాయి. ఆ తర్వాత బీఏ.4, బీఏ.5లని కూడా చూశాం. ఇన్నాళ్లు అతి జాగ్రత్తలు తీసుకున్న చైనా ఒక్కసారిగా అన్ని ఆంక్షలు ఎత్తేయడంతో అక్కడ ప్రజల్లో కరోనాని తట్టుకునే రోగనిరోధక వ్యవస్థలేదు. అదే ఇప్పుడు చైనా కొంప ముంచింది.
వాస్తవానికి ఇప్పుడు చైనాలో నెలకొన్నలాంటి స్థితిని దాటి మనం వచ్చేశామని కోవిడ్–19 జన్యుక్రమ విశ్లేషణలు చేసే సంస్థ ఇన్సాకాగ్ మాజీ చీఫ్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు. 2021 ఏప్రిల్–మే మధ్యలో డెల్టా వేరియెంట్‌తో భారత్‌లో భారీగా ప్రాణ నష్టం జరిగిందని, ఆ సమయంలో కరోనా సోకిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉందని అన్నారు. ఇక ఒమిక్రాన్‌లో బీఎఫ్.7 చైనాలో అత్యధికంగా వృద్ధుల ప్రాణాలు తీస్తోందని, మన దేశంలో యువజనాభా ఎక్కువగా ఉండడం వల్ల భయపడాల్సిన పని లేదని డాక్టర్ అగర్వాల్ చెబుతున్నారు.
అయితే విస్తృతంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌తో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఈ వేరియెంట్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. మాసు్కలు ధరించడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకుంటే బీఎఫ్.7తో భారత్‌కు ముప్పేమీ ఉండదని వైద్య నిపుణులంటున్నారు. ఈ సబ్ వేరియెంట్ కేసులు అమెరికాలోని మొత్తం కేసుల్లో 5%, యూకేలో 7.26% ఉన్నాయి. అక్కడ మరీ అధికంగా కేసులు నమోదు కావడం లేదు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా అంతగా లేదు. అందుకే భారత్‌లోనూ ఇది ప్రభావం చూపించదనే అంచనాలు ఉన్నాయి.
చదవండి: దేశంలో క్యాన్సర్ విజృంభణ
Comments
Please login to add a commentAdd a comment