
మన శరీరానికి జింక్ చాలా అవసరం. మనం తినే ఆహారంలో చాలా పరిమిత పరిమాణంలో మాత్రమే జింక్ లభిస్తుంది. శరీరం జింక్‌ను నిల్వచేసుకోదు. అందుకే జింక్ లభించే ఆహారాన్ని రోజూ తినాలి. జింక్ లోపిస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జింక్ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.
అకారణంగా జుట్టు రాలుతున్నా, బరువు తగ్గుతున్నా, గాయాలు త్వరగా నయం కాకపోతున్నా జింక్ లోపం గా అనుమానించాలి. ఇదే కాదు, శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం.
గాయాలు నయం కాకపోవడం..
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేసేందుకు జింక్ చాలా అవసరం. జింక్ లోపం ఏర్పడినప్పుడు గాయాలు తగిలినా అవి త్వరగా నయం కావు. అంతేకాదు ముఖంపై మొటిమలు వస్తాయి.
బరువు తగ్గడం..
జింక్ లోపం వల్ల జీర్ణశక్తిలో మార్పులు వస్తాయి. ఆకలి మందగిస్తుంది. ఆహారం తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. ఇలా పోషకాల లోపం వల్ల బరువు తగ్గడంతోపాటు అనేకమైన ఇతర ఆరోగ్యసమస్యలూ ఉత్పన్నమవుతాయి.
జుట్టు రాలడం..
జింక్ లోపం వల్ల జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది కాబట్టి అకారణంగా జుట్టు రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుని సమస్య సద్దుమణిగితే నిశ్చింతగా ఉండవచ్చు.
తరచూ జలుబు..
జింక్ తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దానివల్ల తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. తరచూ మీకు జలుబు చేస్తున్నా, అనారోగ్యం బారిన పడుతున్నా జింక్ లోపం ఉందేమో చూసుకోవాలి. జింక్ తగినంత అందితే జలుబు త్వరగా తగ్గుతుంది.
చూపు మసక బారడం..
ఆరోగ్యకరమైన చూపుకు జింక్ చాలా అవసరం. శరీరానికి తగినంత జింక్ అందనప్పుడు దృష్టి మందగిస్తుంది. చూపు మసకగా కనిపిస్తుంది. అస్పష్టంగా అనిపిస్తుంది. జింక్, విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చూపును ఇస్తాయి.
అయోమయం..
మీకు మనసు, ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయా? అయితే జింక్ లోపం ఉందేమో చూసుకోండి. జింక్ తగినంత అందకపోతే మెదడు సరిగా పనిచేయదు. పనిపై ఏకాగ్రత్ కుదరదు. జ్ఞాపకశక్తి సమస్యలకు కూడా తలెత్తుతాయి.
సంతానోత్పత్తిపై ప్రభావం..
జింక్ లోపం పురుషులకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల పురుషుల సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. మీరు తండ్రి కావాలనుకుంటే తప్పనిసరిగా జింక్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. తగినంత పరిమాణంలో జింక్ తీసుకోని పురుషులు తండ్రి కావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రోగనిరోధక శక్తి బలహీనం..
శరీరానికి సంబంధించి అనేక విధులకు జింక్ అవసరమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. కానీ మీ శరీరంలో జింక్ లోపం ఉంటే అది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని గుర్తుంచుకోండి.
ఇలా నివారించాలి..
జింక్ లోప నివారణకు శనగలు, గింజ ధాన్యాలు, పుచ్చగింజలు, జనపనార గింజలు, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్ చాకొలెట్లలో జింక్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి జింక్ లోపం ఉన్నవారు ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.
ఇవి చదవండి: వామ్మో..! పెరుగుతో.. వీటిని కూడా కలిపి తింటున్నారా..??
Comments
Please login to add a commentAdd a comment