Vitamin
-
జుట్టు రాలడం.. బరువు తగ్గడం జింక్ లోపం కావచ్చు!
మన శరీరానికి జింక్ చాలా అవసరం. మనం తినే ఆహారంలో చాలా పరిమిత పరిమాణంలో మాత్రమే జింక్ లభిస్తుంది. శరీరం జింక్‌ను నిల్వచేసుకోదు. అందుకే జింక్ లభించే ఆహారాన్ని రోజూ తినాలి. జింక్ లోపిస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జింక్ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.అకారణంగా జుట్టు రాలుతున్నా, బరువు తగ్గుతున్నా, గాయాలు త్వరగా నయం కాకపోతున్నా జింక్ లోపం గా అనుమానించాలి. ఇదే కాదు, శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం.గాయాలు నయం కాకపోవడం..చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేసేందుకు జింక్ చాలా అవసరం. జింక్ లోపం ఏర్పడినప్పుడు గాయాలు తగిలినా అవి త్వరగా నయం కావు. అంతేకాదు ముఖంపై మొటిమలు వస్తాయి.బరువు తగ్గడం..జింక్ లోపం వల్ల జీర్ణశక్తిలో మార్పులు వస్తాయి. ఆకలి మందగిస్తుంది. ఆహారం తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. ఇలా పోషకాల లోపం వల్ల బరువు తగ్గడంతోపాటు అనేకమైన ఇతర ఆరోగ్యసమస్యలూ ఉత్పన్నమవుతాయి.జుట్టు రాలడం..జింక్ లోపం వల్ల జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది కాబట్టి అకారణంగా జుట్టు రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుని సమస్య సద్దుమణిగితే నిశ్చింతగా ఉండవచ్చు.తరచూ జలుబు..జింక్ తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దానివల్ల తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. తరచూ మీకు జలుబు చేస్తున్నా, అనారోగ్యం బారిన పడుతున్నా జింక్ లోపం ఉందేమో చూసుకోవాలి. జింక్ తగినంత అందితే జలుబు త్వరగా తగ్గుతుంది.చూపు మసక బారడం..ఆరోగ్యకరమైన చూపుకు జింక్ చాలా అవసరం. శరీరానికి తగినంత జింక్ అందనప్పుడు దృష్టి మందగిస్తుంది. చూపు మసకగా కనిపిస్తుంది. అస్పష్టంగా అనిపిస్తుంది. జింక్, విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చూపును ఇస్తాయి.అయోమయం..మీకు మనసు, ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయా? అయితే జింక్ లోపం ఉందేమో చూసుకోండి. జింక్ తగినంత అందకపోతే మెదడు సరిగా పనిచేయదు. పనిపై ఏకాగ్రత్ కుదరదు. జ్ఞాపకశక్తి సమస్యలకు కూడా తలెత్తుతాయి.సంతానోత్పత్తిపై ప్రభావం..జింక్ లోపం పురుషులకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల పురుషుల సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. మీరు తండ్రి కావాలనుకుంటే తప్పనిసరిగా జింక్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. తగినంత పరిమాణంలో జింక్ తీసుకోని పురుషులు తండ్రి కావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.రోగనిరోధక శక్తి బలహీనం..శరీరానికి సంబంధించి అనేక విధులకు జింక్ అవసరమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. కానీ మీ శరీరంలో జింక్ లోపం ఉంటే అది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని గుర్తుంచుకోండి.ఇలా నివారించాలి..జింక్ లోప నివారణకు శనగలు, గింజ ధాన్యాలు, పుచ్చగింజలు, జనపనార గింజలు, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్ చాకొలెట్లలో జింక్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి జింక్ లోపం ఉన్నవారు ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.ఇవి చదవండి: వామ్మో..! పెరుగుతో.. వీటిని కూడా కలిపి తింటున్నారా..?? -
బ్యూటిప్స్: ఇలా చేయండి.. ఈ ఒక్కటీ చాలు!
కొంతమంది స్కిన్ చాలా మెరిసిపోతుంది. మరి కొంతమందికి మాత్రం డ్రై స్కిన్, మొటిమలు, టాన్, పిగ్మంటేషన్, మచ్చలు, డల్ స్కిన్ వంటి సమస్యలు ఉంటాయి. వీటి వల్ల చాలా మంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పతారు. నలుగురిలోకి వెళ్ళలేరు. అయితే, విటమిన్ ఇ చర్మానికి సంబంధించిన అనేక సమస్యల్ని దూరం చేస్తుంది. మరి దీనిని ఎలా అప్లై చేయాలి. అప్లై చేస్తే ఏయే లాభాలు ఉన్నాయో తెలుసుకోండి. ఇలా చేయండి.. చర్మ సమస్యలకి విటమిన్ ఇ చక్కటి ఉపశమనం. ఇందుకోసం టీ స్పూన్ బొప్పాయి జ్యూస్, టీ స్పూన్ రోజ్ వాటర్‌ని తీసుకోవాలి. అందులోనే విటమిన్ ఇ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. స్కిన్ టోన్ పెరగడానికి: కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్‌ని అంతే పరిమాణంలో పెరుగు, గుడ్డుతో కలపండి. దీనిని బాగా మిక్స్ చేయండి. దీనిని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయండి. తర్వాత శుభ్రం చేయండి. ముఖం మెరిసిపోతుంది. విటమిన్ ఈ ఆయిల్‌ని కలబందతో కలిపి కూడా వాడొచ్చు. దీనివల్ల ముఖం మెరిసిపోతుంది. కాంతిమంతంగా మారుతుంది. టీ స్పూన్ పరిమాణంలో గ్రీన్ టీ తీసుకోండి. అందులోనే తేనె కూడా వేయండి. తర్వాత కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్ వేయండి. వీటన్నింటిని కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి. ఇవి చదవండి: చరిత్రను తిరగరాశారు.. రంగస్థలానికి కొత్త వెలుగు తెచ్చారు -
విటమిన్ D లోపం వల్ల ఇన్ని రోగాలు వస్తాయా..!
-
ఈ విటమిన్ లోపిస్తే.. జుట్టు ఎక్కువగా ఊడి బట్టతల వస్తుంది!
How To Control Hair Fall: ఇటీవలి కాలంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. దీని వెనుక వంశపారంపర్య కారణాలు ఉంటే దానిని నివారించడం కష్టం. అయితే బట్టతలను కొంతకాలం పాటు వాయిదా వేయచ్చు. కానీ ప్రతిసారీ ఈ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల మాత్రం రాదని తెలుసుకోవాలి. జుట్టు రాలడం లేదా బట్టతల రావడం అనేది మస్కులర్ డిస్ట్రోఫీ లాంటి జన్యుపరమైన సమస్య కాదని సైన్స్ చెబుతోంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో కొన్ని అవసరమైన మూలకాలు లేకపోవడమే. కానీ ఆ మూలకాల లోపం వంశపారంపర్యంగా ఉంటుంది. వారసత్వం అనేది ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అయిన జన్యువులది మాత్రమే కాదు. బదులుగా కొన్నిసార్లు పోషకాల లోపం కూడా ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అవుతుంది. చదవండి: అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!.. గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు.. ఇంకా.. బయోటిన్ బయోటిన్ అనేది జుట్టుకు అవసరమైన మూలకం. ఇది లేకపోవడం వల్ల జుట్టు పలుచబడుతుంది. దీని లోపం వల్ల గోళ్లు కూడా విరిగిపోతాయి. కండరాల అలసట, బలహీనత, మైకం, కాళ్ళలో తిమ్మిరి వంటివి బయోటిన్ లోపం లక్షణాలు. ఇది శరీరానికి అవసరమైన మూలకం. కానీ జుట్టు, గోళ్లకు ఇది చాలా ముఖ్యమైనది. రాగి సాధారణంగా శరీరంలో రాగి లోపం ఉండదు. కానీ ఏదైనా కారణం వల్ల అది లోపిస్తే జుట్టు, గోళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా భారతదేశం వంటి దేశంలో శరీరంలో కాపర్ సమస్య ఉండదు. కాని ఇది లోపిస్తే మోకాలు, కీళ్లలో భరించలేని నొప్పి ఉంటుంది. కొల్లాజెన్: కొల్లాజెన్ అనేది జుట్టు మూలాలను బలపరిచే మూలకం. ఇది జుట్టుని మందం చేస్తుంది. దీని లోపం వల్ల జుట్టు బలహీనపడుతుంది. ఎక్కువగా ఊడిపోతుంది. చదవండి: సూపర్‌బగ్స్ పెనుప్రమాదం.. యాంటీ బయోటిక్ ఎప్పుడు వాడాలంటే విటమిన్ బి6 జుట్టుకి విటమిన్ బి కాంప్లెక్స్ చాలా ముఖ్యం. దీని లోపం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. విటమిన్ బి 6 మన జుట్టు ఆరోగ్యానికి సంబంధించినది. ఈ విటమిన్ లోపం ఉన్నట్లయితే జుట్టు బలహీనంగా మారుతుంది. ఎక్కువగా ఊడిపోయి బట్టతల వస్తుంది. అందువల్ల ఒకసారి మంచి ట్రైకాలజిస్టును కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకుని ఏ కారణం వల్ల జుట్టు ఊడిపోతోందో తెలుసుకుని ఆ విటమిన్ లోపాన్ని పూరించడం ద్వారా జుట్టు రాలకుండా నివారించుకోవచ్చు. -
Mushrooms: పుట్టగొడుగులు తిన్నారంటే..
Mushrooms Health Benefits In Telugu: పుట్టగొడుగులు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఖనిజ పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. పుట్టగొడుగుల్లో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్ ఉండడం వల్ల యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పనిచేయడమేగాక, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిలోని కొన్ని రకాల ఎంజైమ్‌లు కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచడానికి తోడ్పడతాయి. దీంతో గుండె సంబంధ సమస్యలు రావు. ►పుట్టగొడుగులు తినడం వల్ల శరీరానికి ఖనిజపోషకాలు, విటమిన్లు, పీచు పదార్ధాలు, కార్బొహైడ్రేట్స్ అందుతాయి. ఇవన్నీ శరీరానికి అందడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ►ఆహారంలో పుట్టగొడుగుల్ని చేర్చుకోవడం వల్ల ఉదర సమస్యలు, అజీర్ణం, మలబద్దకం సమస్యలు దరిచేరవు. ►ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఎదరుకాదు. చదవండి: Health Tips: బరువును అదుపులో ఉంచే మిరియాలు -
వైరసవత్తరమైన సినిమాలు
గతాన్ని విశ్లేషించుకోవడానికి, ప్రస్తుతాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తుని ఎదుర్కోవడానికి కీలకమైన వాటిలో సినిమా కచ్చితంగా ఒకటి. సినిమా సమాజానికి అద్దమే కదా! బయటి ప్రపంచంలోని కష్టాలను తప్పించుకోవడానికి సినిమాని ఎస్కేప్ గా వాడతాం. సినిమా ఫ్యాంటీసిలోకి వెళ్లిపోయి మనకున్న అనవసరమైన తలనొప్పులను తాత్కాలికంగా మర్చిపోతాం. ప్రస్తుతం మనందరి ముందు ఉన్న సమస్య ఒక్కటే... కోవిడ్ – 19 (కరోనా వైరస్). ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడతాం అన్నదే అందరి మదిలో ఉన్న ఆలోచన. గతంలోనూ ఇలాంటి వైరస్లు ప్రపంచం మీదకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. బీభత్సాన్ని సృష్టించాయి. వాటిని తట్టుకొని నిలబడ్డ సందర్భాలున్నాయి. అయితే అలాంటి సంఘటనల ఆధారంగా కొన్ని కాల్పనిక సినిమాలు వచ్చాయి. వైరస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమాల గురించి తెలుసుకోవడం మంచి అవకాశం ఇది. సినిమాలోని ప్రాతలను కష్టపెట్టిన ఆ వైరస్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించి, ‘వైరసవత్తరం’ అనిపించుకున్నాయి. ఆ చిత్రాల విశేషాలు. వైరస్ (2019) 2018లో కేరళపై నిఫా వైరస్ దాడి చేసింది. ఎన్నో ప్రాణాలు కోల్పోయాం. అయితే ఆ వైరస్‌ని అధిగమించాం. ఆ సంఘటనల ఆధారంగా మలయాళ దర్శకుడు ఆషిక్ అబూ ‘వైరస్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. మలయాళ క్రేజీ స్టార్స్ చాలా మంది ఈ సినిమాలో నటించారు. మన దేశంలో తెరకెక్కిన బెస్ట్ మెడికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు. (ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు.) కంటేజిన్ (2011) కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందినప్పటినుంచి 2011లో వచ్చిన ‘కంటేజిన్’ సినిమా ప్రస్తావన వస్తూనే ఉంది. కారణం.. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ఆ సినిమాలో ముందే చూపించడమే. స్టీవెన్ సోడన్ బెర్గ్ తెరకెక్కించిన ఆ సినిమాలో కేట్ విన్స్ లెట్, మాట్ డెమన్ ముఖ్య పాత్రల్లో నటించారు. గాల్లో ప్రయాణించే వైరస్ ప్రపంచవ్యాప్తంగా సోకితే ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మందు కనుగొన్నారా? వంటి అంశాలను చూపిం చారు. (అమెజాన్ ప్రైమ్‌లో చుడొచ్చు.) అవుట్ బ్రేక్ (1995) ఎబోలా వైరస్ అమెరికాను ఎటాక్ చేస్తే, దాన్ని ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు, సామాన్య ప్రజలు ఎం చేశారు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘అవుట్ బ్రేక్’. రిచర్డ్ ప్రెస్టన్ రచించిన ‘ది హాట్ జోన్’ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు పెటెర్ సెన్ తెరకెక్కించారు. (చూడాలనుకుంటే యూట్యూబ్‌లో రెంట్ చేసుకోవచ్చు.) ఫ్లూ (2013) 36 గంటల్లో మనుషుల ప్రాణాల్ని తీసుకునే భయంకరమైన వైరస్ ఒకటి సౌత్ కొరియాలో పుడితే, దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? అనే కథతో తెరకెక్కిన కొరియన్ చిత్రం ’ఫ్లూ’. కిమ్ సంగ్ సూ తెరకెక్కించారు. 12 మంకీస్ (1995) 12 మంకీస్ అనే గ్యాంగ్ భయంకరమైన వైరస్‌ని తయారు చేసి ప్రపంచం మీద వదులుతుంది. దాంతో ప్రపంచం దాదాపు అంతమవుతుంది. బతికి బయటపడ్డవాళ్లు భూ కింది భాగంలో జీవిస్తుంటారు. ఈ వైరస్ ఎలా తయారయింది? దీనికి పరిష్కారం ఎలా కనుక్కోవాలి? అని టైమ్ ట్రావెల్లో హీరో ప్రయాణం చేయడమే చిత్రకథ. బ్రాడ్ పిట్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని టెర్రీ గిల్లియం తెరకెక్కించారు. (నెట్ ఫ్లిక్స్‌లో చుడొచ్చు.) వైరస్ బ్యాక్‌డ్రాప్ కథాంశాలతోనే ‘28 డేస్ లేటర్’ (2002), ‘కారియర్స్’ (2009), ‘బ్లైండ్ నెస్’ (2008), 93 డేస్ (2016) వంటి మరికొన్ని సినిమాలు కూడా రూపొందాయి. ఈ సినిమాలన్నీ వేరు వేరు భాషల్లో రూపొందినవి కావొచ్చు. కానీ కథలన్నీ ఇంచుమించు ఒక్కటే. అవన్నీ చెబుతున్నది కూడా ఒక్కటే. సమస్య ఎప్పుడైనా, ఎలా అయినా రావొచ్చు. ధైర్యంగా నిలబడితేనే పరిష్కారం లభిస్తుంది. విపత్కర వైరస్లు వస్తే దాని పరిస్థితిని, ప్రభావాన్ని అవగాహన చేసుకోవడానికే ఈ సినిమాలన్నీ చూడండి, అనవసరమైన భయాన్ని, భ్రమను కలిగించుకోవడానికి కాదు. సినిమాలో విలన్ ఎంత బలవంతుడైతే కథ అంత రసవత్తరంగా ఉంటుంది. అతన్ని ఎదిరించి గెలిస్తే కథ మరింత రసవత్తరంగా తయారవుతుంది. ప్రస్తుతం మనందరి ముందు ఉన్న విలన్ కరోనా. ఈ వైరస్ ని ధైర్యంగా ఎదుర్కొని మనందరమూ హీరోలవుదాం. దాన్ని ఎదుర్కోడానికి ఎదురెళ్లనవసరం లేదు. ఇంట్లో ఉండే జయించవచ్చు. ఇంట్లో ఉండండి. బయటికొచ్చి ఇబ్బందుల్లో పడకండి. – గౌతమ్ మల్లాది -
ఆపిల్ ప్యాక్
►ఆపిల్ పై తొక్క తీసి, ముక్కలు కోసి, మిక్సర్‌లో వేసి గుజ్జు చేయాలి. దీంట్లో రెండు టీ స్పూన్ల తేనె, విటమిన్–ఇ క్యాప్సుల్ మిశ్రమం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముఖ చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. ►సగం ఆపిల్ ముక్కను ఉడికించి గుజ్జు చేయాలి, అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి, తీసి, ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్ ముడతలను నివారిస్తుంది. ►సగం ముక్క ఆపిల్‌ను తరగాలి. రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్, టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలిపి మెత్తగా నూరి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి మృదువుగా వేళ్లతో రాయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. కొబ్బరిపాలు లేదంటే మజ్జిగ కలుపుకోవచ్చు. ఈ ప్యాక్ పొడిబారిన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. -
అమ్మ కావాలని ఉందా?
అమ్మ కావడం చాలామందికి సులువు. కొందరిలో సమస్య ఉంటుంది.ఎదురుచూపు ఉంటుంది.అడ్డంకులు ఏమిటో బోధ పడవు.వైద్య సహాయానికి వెళితే సమస్య ఏమిటో తెలుస్తుంది.అది గర్భాశయంలో లోపం కావచ్చు, ట్యూబుల్లో అడ్డంకి కావచ్చు,ఫలదీకరణ సమస్య కావచ్చు, మానసిక ఒత్తిడీ కావచ్చు.డాక్టర్ని కలవండి. అవగాహన పెంచుకోండి. ఆనందంగా మాతృత్వపు మాధుర్యం అనుభవించండి. గత వారం సంతానలేమి తాలూకు కొన్ని అంశాల గురించి చర్చించాం. ‘అండాల విడుదలలో ఎదురయ్యే సమస్య’ గురించి, వాటికి పరిష్కారాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మహిళల్లో సంతానలేమికి కారణమయ్యే మరికొన్ని అంశాల గురించి విపులంగా తెలుసుకుందాం. గర్భాశయంలో లోపాలు సాధారణంగా గర్భాశయంలో లోపాల వల్ల గర్భం దాల్చలేని వారు దాదాపు 10% నుంచి 15% వరకు ఉంటారు. గర్భాశయంలో లోపాలు కూడా అనేక కారణాల వల్ల కలుగుతుంటాయి. ఉదాహరణకు... గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, పూత ఉన్నా, అక్కడ స్రవించే మ్యూకస్ స్రావాలు మరీ చిక్కగా ఉన్నా, గర్భాశయ ముఖద్వారం మరీ సన్నగా ఉన్నప్పుడు వీర్యకణాలు గర్భసంచి లోపలికి ప్రవేశించలేకపోవచ్చు. కొంతమందిలో యోనిలోని ద్రవాల్లో ఆమ్లగుణం మరీ ఎక్కువగా ఉండటం వల్ల అవి వీర్యకణాలను చైతన్యరహితం చేస్తాయి. కొంతమందిలో సర్విక్స్ దగ్గర వీర్యకణాలకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ–స్పెర్మ్ యాంటీబాడీస్ ఉంటాయి. అవి వీర్యకణాలను నిర్వీర్యం చేసి, గర్భాశయంలోకి వెళ్లనివ్వవు. మరికొందరిలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, అడ్డుపొరలు (యుటెరైన్ సెప్టమ్) వంటి సమస్యలు ఉండటం వల్ల... అవి ఉన్న స్థితి (పొజిషన్), పరిమాణం (సైజు) వంటి అంశాలు గర్భధారణకు అడ్డుగా నిలవవచ్చు. ఇలాంటి సందర్భాల్లో సమస్య తీవ్రతను బట్టి గర్భం దాల్చడం కష్టం కావచ్చు. పరీక్షలు/చికిత్స: స్పెక్యులమ్, వెజైనల్ ఎగ్జామినేషన్ ద్వారా యోని, సర్విక్స్ భాగంలో ఉండే ఇన్ఫెక్షన్, పూత, గీరుకుపోయినట్లుగా అయ్యే పుండు (ఎరోజన్), సర్వైకల్ పాలిప్ వంటి సమస్యలను తెలుసుకోవచ్చు. అలాగే పాప్‌స్మియర్ పరీక్ష కూడా చేయించుకోవడం మంచిది. కేవలం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్ పూర్తి కోర్సు వాడటం వల్ల సమస్య సమసిపోతుంది. దీంతో పుండు తగ్గకపోతే అప్పుడు క్రయోకాటరీ (ఐస్ ట్రీట్మెంట్) చికిత్స అవసరమవుతుంది. పాలిప్ (కండపెరగడం) వంటి సమస్యలు ఉంటే, వాటిని శస్త్రచికిత్సతో తొలగించాలి. గర్భాశయ ముఖద్వారం కొందరిలో మరీ సన్నగా (సర్వైకల్ స్టెనోసిస్) ఉన్నప్పుడు దానిని డీ అండ్ సీ అనే చిన్న ప్రక్రియ ద్వారా వెడల్పుచేయడం వల్ల ఉపయోగం ఉండవచ్చు. ఇన్ఫెక్షన్, పూత, పుండు ఉన్నప్పుడు సర్విక్స్‌లో స్రవించే ద్రవాలు సరిగా లేకపోవడం వల్ల చికిత్స తీసుకున్నా గర్భం రాకపోతే ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్) అనే పద్ధతి ద్వారా వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపడం జరుగుతుంది. పెల్విక్ స్కానింగ్ చేయడం వల్ల గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ వంటి అనేక సమస్యలు తెలుస్తాయి. అవసరమైతే 3డీ స్కానింగ్, ఎమ్మారై వంటి పరీక్షలు చేసి, సమస్య తీవ్రతను నిర్ధారణ చేసి, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. లాపరోస్కోపీ ద్వారా ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలను నిర్ధారణ చేసి, అదే ప్రక్రియ ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేయవచ్చు. లేదా పాత పద్ధతుల్లోనే పొట్టను కట్ చేయడం ద్వారా సర్జికల్ పద్ధతిలో వాటిని తొలగించవచ్చు. ఇక హిస్టరోస్కోప్ ద్వారా గర్భాశయం లోపలి పొరలో ఉండే పాలిప్స్, సెప్టమ్ (అడ్డుపొర), అడ్హెషన్స్ (అతుకులు), సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలను నిర్ధారణ చేసుకొని, వాటిని తొలగించవచ్చు. ఇలా గర్భధారణకు అడ్డుపడే అంశాలను కనుగొని, వాటిని తొలగిస్తే గర్భం దాల్చడానికి అవకాశాలు పెరుగుతాయి. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే...: అన్ని రకాల ఫైబ్రాయిడ్స్‌ను తొలగించాల్సిన అవసరం ఉండదు. ఫైబ్రాయిడ్స్ గర్భాశయ పొరలో ఉన్నప్పుడు (సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్) వాటిని తొలగించాల్సి వస్తుంది. గర్భాశయ కండరాల్లో ఉన్నవి (ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్) 5 సెం.మీ. కంటే ఎక్కువగా ఉండి, సర్విక్స్ భాగంలో ఉండి, వీర్యకణాలను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుపడటం, పిండం పెరగకుండా చేయడం వంటి సమస్య ఏర్పడుతున్నప్పుడు మాత్రమే వాటిని తొలగించడం వల్ల ఉపయోగం ఉంటుంది. చిన్న ఫైబ్రాయిడ్లు, గర్భాశయం బయటకు ఉన్నవీ (సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్) గర్భం రావడానికి పెద్దగా అడ్డుపడకపోవచ్చు. కాబట్టి అలాంటి వాటికి ఆపరేషన్ కచ్చితంగా చేయాలని ఏమీలేదు. ఎండోమెట్రియాసిస్ సమస్య ఉన్నప్పుడు, కొందరిలో గర్భాశయం లోపలిపొర (ఎండోమెట్రియమ్) కడుపులోకి వెళ్లడం, మరికొందరిలో గర్భాశయం బయటా, అండాశయం పైనా, ఇలా పలుచోట్ల అతుక్కొని నెలనెలా రుతుస్రావం సమయంలో లోపలివైపున రక్తస్రావం అయి, అక్కడ అండాశయంలో చాక్లెట్ సిస్ట్లూ, ట్యూబ్స్, గర్భసంచి, పేగులు... ఇలా అన్నీ అంటుకుపోయి అండం నాణ్యత, విడుదలలో, ఫలదీకరణలో ఇబ్బందులు ఏర్పడి, గర్భం రాకపోవచ్చు. ఫెలోపియన్ ట్యూబ్లలో లోపాలు అండాశయం నుంచి గర్భాశయానికి ఇరువైపులా ఉండే ట్యూబ్‌లను ఫెలోపియన్ ట్యూబ్‌లు అంటారు. అండం అండాశయం నుంచి ఈ ట్యూబ్‌లలోకి చేరుతుంది. యోని నుంచి శుక్రకణాలు, గర్భాశయంలోనుంచి ట్యూబ్‌లలోకి చేరుతాయి. అండం, శుక్రకణంతో కలిసి, ట్యూబ్‌లో పిండంగా మారాక అది గర్భాశయంలోని ఎండోమెట్రియమ్ పొరలోకి చేరిపోయి, శిశువుగా పెరుగుతుంది. గర్భం దాల్చడంలో ఫెలోపియన్ ట్యూబ్‌లు కూడా కీలకమైన భూమిక పోషిస్తాయి. అందుకే ఫెలోపియన్ ట్యూబ్లలో లోపాలు కూడా గర్భం రావడంలో అవరోధాలు కలిగిస్తాయి. గర్భాశయం నుంచి లేదా పొట్టలోని పేగుల నుంచి కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఫెలోపియన్ ట్యూబ్స్కి చేరి వాటిని కూడా ఇన్ఫెక్ట్ చేయడం వల్ల వాటి పనితీరు తగ్గుతుంది. అప్పుడు ట్యూబ్స్ వాయడం, తర్వాత అవి మూసుకుపోవడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ రావడంతో పాటు కడుపులో ఏదైనా అపరేషన్ జరిగి ఉంటే ఆ కారణంగా, లేక ఎండోమెట్రియోసిస్‌తో కొందరిలో అతుకులు (అడ్హెషన్స్) ఏర్పడటం వల్ల ట్యూబ్స్ అండాశయాలకు దూరంగా జరుగుతాయి. దాంతో అండం ట్యూబ్లోపలికి ప్రవేశించదు. నిర్ధారణ ఇలా: ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయి ఉన్నాయా లేదా తెరచుకుని ఉన్నాయా తెలుసుకోడానికి హిస్టరోసాల్పింగోగ్రామ్ (హెచ్ఎస్జీ) అనే ఎక్స్‌రే లేదా సోనోసాల్పింగోగ్రామ్ (ఎస్ఎస్జీ) అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కొందరిలో పరీక్ష చేసినప్పుడు పొట్టకండరం బిగుసుకుపోవడం వల్ల ట్యూబ్స్ బిగుసుకుపోయినట్లయ్యి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయని (అడ్డంకులు ఏర్పడ్డాయని) తప్పుడు రిపోర్ట్ రావచ్చు. చికిత్స: ట్యూబ్స్ మూసుకుపోయి ఉంటే, దాన్ని నిర్ధారణ చేసుకోడానికి లాపరోస్కోపీ ప్రక్రియలో డై–టెస్ట్ చేస్తారు. ఇందులో అడ్డంకి (బ్లాక్) ఎక్కడుందో చూసి, హిస్టరోస్కోపీ ద్వారా ఫెలోపియన్ ట్యూబ్ కాన్యులేషన్ అనే ప్రక్రియతో దాన్ని తెరవడానికి ప్రయత్నించవచ్చు. ఇది కొందరికి ఉపయోగపడుతుంది. కొందరిలో సత్ఫలితం ఇవ్వకపోవచ్చు. కొందరిలో ట్యూబ్స్‌లో ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరి (హైడ్రో సాల్పింగ్), అవి వాచి, మూసుకుపోవచ్చు. అలాంటి సందర్భాల్లో చికిత్స చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. కారణం... ట్యూబ్స్ పాడైపోయి, వాటి పనితీరు సరిగా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో గర్భం వచ్చినా అది ట్యూబ్స్‌లో ఇరుక్కుపోయి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండు ట్యూబ్స్‌లో కనీసం ఒక్కటైనా తెరచుకొని ఉంటే గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. ట్యూబ్స్ రెండూ మూసుకుపోయినప్పుడు, అలాంటివారిలో గర్భం కోసం ఐవీఎఫ్ (టెస్ట్‌ట్యూబ్) పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. కొందరిలో ఐవీఎఫ్‌కు వెళ్లేముందు ట్యూబ్స్‌లో హైడ్రోసాల్పింగ్స్ తీవ్రత ఎక్కువగా ఉంటే, ట్యూబ్స్‌ను తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే దానిలోనుంచి వచ్చే ద్రవం పిండం గర్భాశయంలో అతుక్కోకుండా చేస్తుంది. మానసిక కారణాలు మహిళల్లో కనిపించే మానసిక ఒత్తిడి అంశం కూడా గర్భధారణపై చాలావరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు, గర్భం రాలేదని బంధువుల, ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలు, మానసిక వ్యథ వంటి కారణాల వల్ల గర్భధారణకు మొదటి నుంచీ అవసరమైన హార్మోన్ల విడుదలలో అసమతౌల్యత ఏర్పడి అండం విడుదల కాదు. అలాగే ఫలదీకరణ, ఇంప్లాంటేషన్‌లో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఇలాంటి వారికి బయట నుంచి ఎన్ని మందులు ఇచ్చినా, లోపల విడుదల కావాల్సిన హార్మోన్లు సక్రమంగా లేకపోవడం వల్ల గర్భం రావడంలో ఆలస్యమవుతుంది. అందుకే మానసికంగా కుంగుబాటు వంటి సమస్యలను దరిచేరనివ్వకూడదు. మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారు (వారితో పాటు ఇలాంటి సమస్యను దరిచేరనివ్వకూడదని భావించే సాధారణ ఆరోగ్యవంతులు కూడా) యోగా, ధ్యానం, వాకింగ్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. అవసరమైతే కౌన్సెలింగ్ వంటివి ప్రయత్నించవచ్చు. దాంతో మనకు తెలియకుండానే అసమతౌల్యత తొలగిపోయి, హార్మోన్లు సరిగా పనిచేసి, గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇంప్లాంటేషన్ సమస్యలు ఫెలోపియన్ ట్యూబ్‌ల ద్వారా వచ్చే అండం అక్కడ శుక్రకణాలతో కలిశాక పిండంగా మారి, గర్భసంచిలోకి వచ్చి అక్కడ కాస్తంత పరుపులాగా తయారుగా ఉన్న ఎండోమెట్రియమ్ పొరలోకి అంటుకుపోయి శిశువుగా పెరుగుతుందన్న విషయం తెలిసిందే. ఇలా అండంగా మారిన పిండం, ఎండోమెట్రియమ్లోకి అంటుకుపోవడాన్ని ‘ఇంప్లాంటేషన్’ అంటారు. కొందరిలో ఈ ఇంప్లాంటేషన్ సమస్య వల్ల కూడా పిండం పెరగక సంతానలేమి సమస్య రావచ్చు. కారణమేమిటి: కొందరిలో ఎలాంటి సమస్యలూ కనిపించకపోయినా, అన్ని పరీక్షలూ మామూలుగా (నార్మల్‌గా)నే ఉన్నా, ప్రాథమికంగా వాడే మందులు వాడినా, నేరుగా వీర్యకణాలను లోపలికి తీసుకెళ్లి వదిలే ప్రక్రియ అయిన ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్) చేసినా, పిండాన్ని నేరుగా యుటెరస్ వరకు తీసుకెళ్లే ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) జరిపినా, లేదా వీర్యకణాలను నేరుగా అండంలోకే ఇంజెక్షన్ ద్వారా ప్రవేశపెట్టే ఇక్సీ (ఐసీఎస్ఐ – ఇంట్రా సైటోప్లాసమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) పద్ధతి ద్వారా పిండాన్ని నేరుగా యుటెరస్ వరకు పంపినా గర్భం రాకపోవచ్చు. కొందరిలో గర్భాశయం పిండాన్ని స్వీకరించదు. ఇలా ఎందుకు జరుగుతోందనేందుకు కారణాలు ఇంకా తెలియరావడం లేదు. ఇందుకోసం అనేక రకాల పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. పిండం ట్యూబుల్లోకి వచ్చి, గర్భాశయంలో అంటుకుంటేనే అది శిశువుగా రూపొందడం మొదలువుతుంది. ఇంప్లాంటేషన్గా చెప్పే ఈ సమయంలో అనేక రకాల హార్మోన్లు, రసాయనాలు, కెమికల్ మీడియేటర్లు, గర్భాశయ పొరలో రక్తప్రసరణ, ఇంకా బయటకు తెలియని చాలా ప్రక్రియలు అన్నీ సరిగా ఉన్నప్పుడే గర్భధారణ జరుగుతుంది. వాటిలో ఏదైనా సమస్య ఉంటే ఎన్ని చికిత్సలు చేసినా ఉపయోగం ఉండదు. అందుకే టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ ద్వారా ప్రయత్నించినా, అందులోనూ 40% నుంచి 50% మేరకు మాత్రమే గర్భధారణ కలిగే అవకాశం ఉంటాయి. ఇంప్లాంటేషన్ సమస్యలకు చికిత్సలో భాగంగా ఐవీఎఫ్‌లో గర్భసంచిలోకి ఎండోమెట్రియమ్ పొరను ప్రేరేపించడం, పిండం పైనా, పొరకీ చిన్నగా చిల్లు పెట్టడం (అసిస్టెడ్ హ్యాచింగ్) వంటి ప్రక్రియలతో పాటు గర్భాశయం పిండాలన్ని తిరస్కరించకుండా ఉండటం కోసం, స్వీకరించేలా చేయడం కోసం యాంటీఇమ్యూన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, స్టెరాయిడ్స్ వంటి అనేక రకాల మందులతో చికిత్సలు ఇవ్వడం జరుగుతుంది. కొందరిలో ఎన్ని చేసినా ఇంప్లాంటేషన్ నూటికి నూరు పాళ్లు విజయవంతం కాకపోవచ్చు. ఫలదీకరణ (ఫర్టిలైజేషన్) సమస్యలు ప్రతినెలా అండాశయం నుంచి విడుదలైన అండం ట్యూబ్‌లలోకి ప్రవేశిస్తుంది. ఒకసారి విడుదలైన తర్వాత అండం 24 గంటలు మాత్రమే జీవిస్తుంది. (అంటే యాక్టివ్‌గా ఉంటుంది. ఆ తర్వాత నిర్వీర్యమవుతుంది). ఆ సమయంలో కలయిక ద్వారా విడుదలైన వీర్యకణాలు ట్యూబ్‌లలోకి చేరి అండాన్ని చుట్టుముడతాయి. అనేక వీర్యకణాల నుంచి విడుదలయ్యే హైలురానిక్ యాసిడ్ వంటి అనేక ఎంజైములు... అండం మీద చిల్లుపడేలా చేస్తాయి. అందులోనుంచి ఒక్క వీర్యకణం మాత్రమే అండంలోకి ప్రవేశిస్తుంది. వెంటనే చిల్లు మూసుకుపోతుంది. అలా ఒక వీర్యకణం, అండం కలిసి ఫలదీకరణ జరిగి పిండం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ లోపాలు ఉన్నాగానీ గర్భం రాకపోవచ్చు. ఈ ప్రక్రియలో శుక్రకణాలు గర్భాశయంలో వెళ్లిన తర్వాత అక్కడ వాటి సంఖ్య తక్కువగా ఉన్నా, వాటి నాణ్యత (క్వాలిటీ), కదలిక (మొటిలిటీ) సరిగా లేనప్పుడు, వాటి నుంచి విడుదలయ్యే ఎంజైములు సరిగా ఉండనప్పుడు గర్భం రాదు. అలాగే అండం నాణ్యత సరిగా లేకపోయినా, అండంపైన పొర బాగా మందంగా ఉన్నా ఫలదీకరణ జరగకపోవచ్చు. వీర్యకణాలు 48 గంటల నుంచి 72 గంటల వరకు జీవించి ఉంటాయి. ఫలదీకరణ లోపాలను తెలుసుకోవడం మామూలుగా కష్టం. పరీక్షలలో వేరే సమస్యలు ఏవీ కనిపించనప్పుడు దంపతులకు ఒక కోర్స్ యాంటీబయాటిక్, మల్టీ విటమిన్, యాంటీఆక్సిడెంట్స్ మాత్రల వంటి రకరకాల మందులు ఇచ్చి చూడటం జరుగుతుంది. అన్ని రకాలుగా ప్రయత్నించినా ఐయూఐ చికిత్స చేసినా గర్భం రానప్పుడు ఫలదీకరణలో సమస్యలు ఉన్నట్లుగా భావించి, ఆ దంపతులకు ఐవీఎఫ్, ఇక్సీ (ఐసీఎస్ఐ / టెస్ట్‌ట్యూబ్ బేబీ) పద్ధతులను సూచించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో అండాలను శుక్రకణాలను మైక్రోస్కోప్ కింద విశ్లేషించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఒక్కోసారి కొన్ని లోపాలను సైతం గుర్తించే అవకాశం ఉంది. అందులో అనేక అండాలను, శుక్రకణాలను నేరుగా ల్యాబ్‌లో అనేక న్యూట్రిషన్ మీడియాలో కలిపి చూస్తారు. కాబట్టి ఈ ప్రక్రియల ద్వారా ఫలదీకరణ సమస్యలను అధిగమించవచ్చు. అయినా ఫలదీకరణ కాకపోవడం జరగడం, వాటి నాణ్యత బాగా లేకపోయినా, అవసరమైతే దాతల నుంచి స్వీకరించిన అండాలను లేదా శుక్రకణాలను కూడా దంపతులు ఆమోదిస్తే వాడి చూడవచ్చు. తెలియని కారణాలు: (అన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ): కొందరిలో ఎన్ని పరీక్షలు చేసినా, ఎలాంటి సమస్యా లేదని నిర్ధారణ అయినా ఎంతకూ గర్భం రాదు. ఇందుకు కారణాలు తెలియదు. డా‘‘ వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్ -
గర్భిణీ స్త్రీలు పండ్లు తింటే ప్రమాదమా?
గర్భిణీ స్త్రీలు తినాల్సిన పండ్ల గురించి తెలియజేయగలరు. ఏ పండ్లలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి? కొన్ని రకాల పండ్లు తినడం వల్ల కడుపులో బిడ్డకు ప్రమాదమని నా ఫ్రెండ్ చెప్పింది. ఇది నిజమేనా? – బి. సుజాత, విజయనగరం. ప్రెగ్నెన్సీ సమయం లో అన్ని రకాల పండ్లు తినవచ్చు. ఇందులో ముఖ్యంగా ఆపిల్, దానిమ్మ, నారింజ, ద్రాక్ష, పుచ్చకాయ, కివి వంటివి అందరూ తీసుకోవచ్చు. అధిక బరువు ఉండేవాళ్లు, ఫ్యామిలీలో షుగర్ వ్యాధి ఉంటే కొంచెం తియ్యగా ఉండే అరటిపండు, సపోటా, మామిడి పండ్లు వంటివి తక్కువగా, ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడం మంచిది. వీరిలో ఇవి రోజువారిగా తీసుకోవడం వల్ల కొందరిలో బరువు ఎక్కువగా పెరగడం, ప్రెగ్నెన్సీలో షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కొందరు ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి పండు తినకూడదు, దాని వల్ల అబార్షన్ అవుతుంది అని అనుకుంటారు. ఇది అపోహ మటుకే! బాగా పండిన బొప్పాయి పండులో విటమిన్ సీ, ఈ, ఫోలిక్ యాసిడ్, పీచు వంటివి ఉంటాయి. దీనివల్ల మలబద్ధకం లేకుండా ఉంటుంది. కొంతమంది పైనాపిల్ తినకూడదనే అపోహలో ఉంటారు. పైనాపిల్‌లో ఐరన్, ఫోలిక్‌యాసిడ్, విటమిన్ సీ, బీ, మెగ్నీషియమ్, మ్యాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది మరీ ఎక్కువగా కాకుండా మామూలుగా తీసుకోవచ్చు. పండ్లలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి కాబట్టి తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి ప్రెగ్నెన్సీలో అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు. పండ్లను బాగా కడిగిన తర్వాత తాజాగా తీసుకోవాలి. ముక్కలు కోసిన వెంటనే తినాలి. నాకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. ఫిట్స్ వ్యాధి ఉన్నవాళ్లు గర్భం దాల్చడం ప్రమాదమని ఒకరిద్దరు అన్నారు. ఒకరేమో గర్భం దాల్చిన తరువాత ఫిట్స్ తగ్గుతాయని అంటున్నారు. ఏది నిజం? నేను బిడ్డను కనవచ్చా? – డి.శ్రీదేవి, రంగంపేట. ఫిట్స్ వ్యాధి ఉన్నవాళ్లు గర్భం దాల్చిన తర్వాత, మామూలు వాళ్ల కంటే కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. గర్భం దాల్చిన తర్వాత కొంతమందిలో ఫిట్స్ మళ్లీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో రాకపోవచ్చు. అది ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, హార్మోన్స్‌ని బట్టి మానసిక, శారీరక ఒత్తిడి, ఫిట్స్‌కు వాడే మందులు, వాటి మోతాదు, అవి శరీరంలో ఇమిడే దాన్ని బట్టి ఉంటుంది. ఫిట్స్‌కు వాడే మందుల వల్ల 4–6 శాతం వరకు పుట్టబోయే పిల్లల్లో అవయవ లోపాలు ఉండే అవకాశాలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా వెన్నుపూస, గుండె, గ్రహణం మొర్రి, చెయ్యి, కాళ్ల వేళ్లకు సంబంధించిన లోపాలు ఎక్కువగా ఉంటాయి. గర్భం దాల్చిన తర్వాత, వికారం, వాంతులు వంటి ఇబ్బందుల వల్ల ఫిట్స్ మందులు శరీరంలోకి ఇమడకుండా బయటకు వచ్చెయ్యడం వల్ల కూడా ఫిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గర్భం దాల్చిన తర్వాత తరచుగా ఫిట్స్ రావడం వల్ల, బిడ్డకు ఆ కొద్దిసేపు ఆక్సీజన్ సరఫరా లేకపోవడం, బిడ్డ మెదడుపై ప్రభావం చూపడం, బిడ్డ మానసిక ఎదుగుదలలో లోపాలు, బరువు ఎక్కువగా పెరిగిపోవడం, నెలలు నిండకుండానే కాన్పు అవ్వడం, బీపీ పెరగడం, మాయ విడిపోవడం, కాన్పు సమయంలో, తర్వాత రక్తస్రావం అధికంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నువ్వు గర్భం దాల్చక ముందే ఫిజీషియన్ డాక్టర్‌ను సంప్రదించి వారి పర్యవేక్షణలో బిడ్డలో దుష్ప్రభావాలు అతి తక్కువగా కలిగించే ఫిట్స్ మందులను సరైన మోతాదులో వాడుకుంటూ, గర్భం కోసం ప్రయత్నించడం మంచిది. అలాగే ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున వాడుకోవాలి. గర్భం దాల్చిన తర్వాత, క్రమం తప్పకుండా చెకప్‌లు చెయ్యించుకుంటూ, మందులు సరిగా వాడుకోవాలి. మూడవ నెలలో ఎన్టీ స్కాన్, ఐదవ నెలలో ఒఫా స్కాన్, ఫీటల్ ఎకో స్కాన్ వంటివి చెయ్యించుకోవడం వల్ల బిడ్డలో అవయవలోపాలు ఏమైనా ఉంటే ముందుగా తెలుసుకోవచ్చు. ఈ సమయంలో మానసిక ఒత్తిడి లేకుండా డాక్టర్ సలహాలు పాటిస్తూ ఉంటే 90 శాతంపైనే పండంటి బిడ్డకు జన్మనివ్వచ్చు. నేను ప్రెగ్నెంట్. పుట్టబోయే బిడ్డపై గ్రహణాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని విన్నాను. మొన్నటి చంద్రగ్రహణం ప్రభావం వల్ల కడుపులో బిడ్డకు చెడు జరిగే అవకాశం ఉందా? నేను ఉపవాసాలు చేస్తాను. ఈ సమయంలో చేయడం వల్ల ఏదైనా నష్టం జరుగుతుందా? – పి.విశాలక్షి, సంగారెడ్డి. గ్రహణాల వల్ల బిడ్డపై ప్రతికూల ప్రభావం పడుతుంది అనేదానికి ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు. అది కేవలం అపోహ మటుకే! చంద్రగ్రహణంలో సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి వచ్చి, చంద్రుడిని మూసేస్తుంది. సూర్య గ్రహణంలో భూమికి , సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చి సూర్యుడిని కప్పేస్తుంది. దానివల్ల బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేదు. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్లు చెప్పే మాటలకు అడ్డు చెప్పకుండా, ఆరోజు బయటకు వెళ్లకుండా, ఇంట్లో అందరితో కాలక్షేపం చెయ్యవచ్చు. అలా అని కదలకుండా బోర్లా పడుకునే ఉండాలి, ఏమీ తినకూడదు, తాగకూడదు, అనే నియమాలు ఏమీ లేవు. రోజంతా ఏమీ తినకుండా, తాగకుండా ఉపవాసం చెయ్యడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గిపోయి, బీపీ తగ్గిపోయి బిడ్డకి, తల్లికి బాగా ఇబ్బంది కలుగుతుంది. ఆరోజు నేరుగా కళ్లతో ఆకాశంలోకి చూడకుండా, బయట తిరగకుండా ఉంటే సరిపోతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారం ఒకేసారిగా కాకుండా, కొద్దికొద్దిగా 3–4 గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉండాలి. అలాంటిది రోజంతా ఉపవాసం ఉండి ఎప్పుడో రాత్రికి తినడం బిడ్డకి, తల్లికి మంచిది కాదు. తల్లిలో అసిడిటీ, అజీర్ణంతో పాటు షుగర్ లెవెల్స్, బీపీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే బిడ్డకు కూడా సమయానికి పోషకాలు వెళ్లకపోవడం వల్ల బిడ్డకు కూడా ఇబ్బంది ఎదురవుతుంది. ఉపవాసాలు ఉండటం వల్ల దేవుడు కరుణించడు. మంచి మనసుతో, ఇతరుల మనసు నొప్పించకుండా ఉంటే మంచి కలుగుతుంది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
ఆ లోపంతోనే మతిమరుపు!
ఫ్లోరిడాః వృద్ధాప్యంలో మతిమరువు రావడానికి విటమిన్ బి-12 తక్కువ స్థాయిలో ఉండటమే కారణం కావచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వయసు పెరగడం వల్ల జీర్ణాశయంలో ఆమ్లాలు విడుదలయ్యే స్థాయి తగ్గిపోవడంతో ఆహారంలోని బి-12 ను గ్రహించే శక్తి శరీరం కోల్పోతుందని, దీంతో క్రమ క్రమంగా వృద్ధుల్లో విటమిన్ లోపానికి దారితీస్తుందని ఫ్లోరిడాకు చెందిన సైంటిస్టులు పరిశోధనలద్వారా కనుగొన్నారు. వయసు పైబడినవారిలో మతిమరుపు రావడానికి ముఖ్య కారణం విటమిన్ బి-12 లోపం కావచ్చని నోవా ఆగ్నేయ యూనివర్శిటీ ఫార్మకాలజీ ప్రొఫెసర్.. రిచర్డ్ డెట్ మెదడుపై నిర్వహించిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ లోపంతో బాధపడేవారిలో సమస్య బయటకు పెద్దగా కనిపించకపోయినా... క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీంతో చెప్పిన విషయాలను మరచి పోవడం, మళ్ళీ మళ్ళీ అడుగుతుండటమే కాక, ప్రతి విషయానికీ తిగమక పడటం వంటి లక్షణాలు వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తాయని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. మనిషి శరీరంలోని నాడీ వ్యవస్థ పనిచేయడానికి బి-12 విటమిన్ ఎంతగానో సహకరిస్తుంది. అందుకే విటమిన్ లోపం ఏర్పడగానే శరీరంలో నిస్సత్తువ, అవయవాలు పట్టుతప్పి, మూత్రం తెలియకుండా వచ్చేయడం, బీపీ తగ్గడంతో పాటు మతిమరుపు వంటి అనేక సమస్యలు మెల్లమెల్లగా బయట పడతాయని పరిశోధకులు అంటున్నారు. సరైన సమయంలో సమస్యను గుర్తించకపోతే అది.. రక్త హీనతకు కూడా దారి తీసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వయసులో ఉన్నపుడు మనశరీరం కణజాలంలోనూ, కాలేయాల్లోనూ బి-12 ను నిల్వ చేసుకుంటుందని, అందుకే ఆ సమయంలో విటమిన్ తగినంత శరీరానికి అందకపోయినా పెద్దగా తేడా కనిపించదని చెప్తున్నారు. అయితే ఉండాల్సిన కన్నా భారీ స్థాయిలో లోపం ఏర్పడితే మాత్రం శరీరంలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. బి-12 లోపం నివారించాలంటే ఆ విటమిన్ ఎక్కువగా ఉండే పదార్థాలైన చేపలు, మాంసం, కాలేయం వంటివి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. చికెన్, గుడ్లు, పాలు, పాల పదార్థాల్లో కూడా బి-12 ఉన్నా.. తక్కువ మోతాదులో ఉంటుందని, శాకాహారంలో అయితే బి-12 పెద్దగా కనిపించదని పరిశోధకలు చెప్తున్నారు. అందుకే శాకాహారులు.. బి-12 లోపం కనిపిస్తే వైద్యుల సలహా మేరకు విటమిన్ మాత్రలు వాడాల్సి ఉంటుందని సూచిస్తున్న పరిశోధకులు.. తమ అధ్యయనాలను ప్లాస్ వన్ జర్నల్ లో నివేదించారు. -
తినే పూలు...
పువ్వు... దేవుడి పాదాల దగ్గర ఉంటుంది. అమ్మాయి కురుల మీద అందాలొలికిస్తూ ఉంటుంది. అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పువ్వు ఆరోగ్యానికి కూడా మంచిదే. పూజలకూ, పురస్కారాలకే కాదు... రాజాలాంటి ఆరోగ్యం కోసం కూడా పూలు పనికి వస్తాయి. హెల్త్‌కు పుష్పహారం... ఈ పుష్పాహారం! ఈ పువ్వులు తినండి... హెల్దీగా ఉండండి!! కాలీఫ్లవర్... గోబీ పువ్వు అని తెలుగులోనూ ఫూల్ గోబీ అని హిందీలోనూ పిలుచుకునే ఈ పువ్వు కూరలా వండుకోడానికి ఉద్దేశించినదే. గోబీ పకోడీలంటూ శ్నాక్స్ రూపంలోనూ కాలీఫ్లవర్‌ను తీసుకోవచ్చు. కాలీఫ్లవర్‌లోని సల్ఫోరఫేన్ వంటి వృక్షరసాయనాలు (ఫైటో కెమికల్స్) క్యాన్సర్లతో పోరాడతాయి. దాంతో ఈ పువ్వు క్యాన్సర్‌ను నివారిస్తుంది. సల్ఫోరఫేన్ అనే పోషకం ఆటిజమ్‌ను నివారించడంలో కూడా తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇవి ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి. కాలీఫ్లవర్‌లోని ఇండోల్-3-కార్బినాల్ అనే స్టెరాల్ కూడా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా సమరం చేస్తుంది. ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్ల నివారణకు సమర్థమైనది. కణాలు క్యాన్సరస్‌గా మారిపోతే అందులోనే అంతర్గతంగా క్యాన్సర్‌ను హరించే విషాలను (సైటోటాక్సిన్స్)ను పుట్టించి వాటిని తుదముట్టిస్తుందీ పువ్వు. బ్రకోలీ / బ్రోకలీ... బ్రకోలీ అనేది నిజానికి ఇటాలియన్ పేరు. ఇటాలియన్ భాషలో ‘బ్రొకోలో’ అంటే క్యాబేజీ తాలూకు పుష్ప శిఖరాగ్రం (ఫ్లవరింగ్ క్రెస్ట్ ఆఫ్ క్యాబేజీ) అని అర్థం. గతంలో క్యాలీఫ్లవర్ అంతటి విస్తృతంగా లభ్యం కాకపోయినా... ఇప్పుడు మన మార్కెట్లలోనూ చాలా ఎక్కువగానే దొరుకుతోంది. ఇందులో విటమిన్ ఏ పాళ్లు చాలా ఎక్కువ. మేని నిగారింపుకూ, మంచి కనుచూపుకూ ‘విటమిన్-ఏ’ దోహదపడుతుంది. ఇక ఇందులోని పోషకాలు (ఫైటోన్యూట్రియెంట్స్) శరీరంలో పేరుకుపోయిన అనే విషాలను తొలగించే ‘డీ-టాక్సిఫైయర్స్’గా ఉపయోగపడతాయి. అరటిపువ్వు ... ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థం, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. అరటిపువ్వుతో ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. అరటిపువ్వుతో కూరలను వండి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. ఉదాహరణకు... ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది: అరటిలోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఇథనాల్ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి, గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. అరటిపువ్వు నుంచి సేకరించిన పోషకాలు మలేరియా కారక క్రిములను ఎదుర్కొంటాయని ఒక అధ్యయనం చెబుతోంది. అయితే ఈ విషయం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఫ్రీరాడికల్స్‌ను హరిస్తుంది : క్యాన్సర్ కారకాలుగా మారే ఫ్రీరాడికల్స్ అనే కాలుష్య పదార్థాలను అరటిపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్ సమర్థంగా హరిస్తాయి. వయసుపైబడే ప్రక్రియనూ అరటిపువ్వు మందగింపజేస్తుంది. అలా ఏజింగ్‌ను ఆపుతుంది. డయాబెటిస్ నియంత్రణ- రక్తహీనత నివారణ : అరటిపువ్వు రక్తంలోని చక్కెర పాళ్లను నియంత్రిస్తుంది. అలాగే ఇందులో ఐరన్ ఎక్కువ కాబట్టి రక్తహీనతను అరికడుతుంది. రుతు సమస్యల నివారణ : అరటిపువ్వుల కూర తినడం మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అరటిపువ్వుతో అనేక రుతుబాధలు నివారితమవుతాయి. రుతు సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ కావడం తగ్గుతుంది. రుతుస్రావం వచ్చే ముందు మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం, కడుపునొప్పి వంటి అనేక సమస్యలు కనిపించే ప్రీ-మెనుస్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్ఎస్) తగ్గిపోతుంది. ఇందులోని మెగ్నీషియమ్ వల్ల యాంగ్జైటీ తగ్గి, మంచి మూడ్స్ సమకూరుతాయి. పాలను పెంచుతుంది : బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో బాగా పాలు పడేలా చేస్తుంది అరటిపువ్వు. కుంకుమపువ్వు... కుంకుమపువ్వును ఎంతోకాలంగా మనం సుగంధద్రవ్యంగా వాడుతూనే ఉన్నాం. బిర్యానీలోనూ, కశ్మీరీ వంటకాల్లోనూ ఈ పువ్వును ఉపయోగిస్తాం. కుంకుమపువ్వులో యాంటీసెప్టిక్, యాంటీడిప్రెసెంట్ గుణాలున్నాయి. క్యాన్సర్లతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. మంచి రంగుతో పండంటి బిడ్డ పుట్టడానికి కుంకుమపువ్వు దోహదం చేస్తుందన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఈ మాటలో ఎంత వాస్తవం ఉందన్న సంగతి పక్కన పెడితే కుంకుమపువ్వు ఒక హెర్బ్గా, సుగంధద్రవ్యంగా పరిమితంగా తీసుకుంటే చాలా న్యూట్రిటివ్ ప్రయోజనాలు మాత్రం ఉన్నాయి. కుంకుమపువ్వు రక్తపోటును నియంత్రించి, మూడ్స్ త్వరత్వరగా మారిపోవడాన్ని అరికడుతుందని కొన్ని అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇందులో బీ-కాంప్లెక్స్ విటమిన్‌కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ అన్న విలువైన పోషకాలు ఉన్నాయి. ఇవి గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక గర్భవతుల్లో ప్రోజెస్టెరాన్ అన్న హార్మోన్ కారణంగా మలబద్దకం రావడం చాలా సహజంగా జరుగుతుంటుంది. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఆ రకంగా ఇది గర్భవతులకు ఇది మేలు చేస్తుంది. దీన్ని చిటికెడుకు మించకుండా తీసుకోవడం సురక్షితం. అది అపోహే కానీ... ప్రయోజనం ఇలా... కుంకుమపువ్వు కడుపులోని బిడ్డ రంగును ఆకర్షణీయంగా మార్చుతుందనే అపోహ చాలామందిలో ఉంది. దీనికి తగిన శాస్త్రీయ నిర్ధారణ మాత్రం లేదు. కాకపోతే... పాలు సంపూర్ణాహారం. గర్భవతులు తాగితే చాలా మేలు. అయితే మొదటి మూడు నెలల పాటు గర్భవతులు తమ వేవిళ్లు, వికారం కారణంగా పాలు తాగడానికి అంత సుముఖంగా ఉండరు. కుంకుమపువ్వు అనే సుగంధద్రవ్యం పాలను మరింత రుచికరంగా, సుగంధభరితంగా చేస్తుంది. పైగా బిడ్డ మంచి రంగులో పుడతాడనే అంశం వాళ్లను పాలు తాగేలా ప్రోత్సహిస్తుంది. ఇక కొన్నిచోట్ల సంప్రదాయ వంటకాల్లోనూ దీన్ని ఒక దినుసుగా ఉపయోగించి వంటకు మరింత రుచిని తీసుకొస్తారు. అప్పుడు దీనివల్ల కలిగే పైన పేర్కొన్న ప్రయోజనాలన్నీ కేవలం గర్భవతులకే కాకుండా మిగతావాళ్లకూ చేకూరుతాయి. కాబోయే అమ్మలకు కాషన్ కుంకుమపువ్వును గర్భవతులు వాడే సమయంలో తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... పాలలో దీన్ని చిటికెడు కంటే ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక నేచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. అందుకే మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే గర్భస్రావమూ అయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకుని చిటికెడంటే చిటికెడే వాడాలి. వేప పువ్వును ఉగాది పచ్చడి రూపంలో ఆహారంలో వాడడం తెలుగు వారికి ఎప్పటినుంచో తెలిసిన సంప్రదాయమే! గులాబీ... మన దగ్గర ఆహారంలో దీని ఉపయోగం చాలా తక్కువే అయినా చైనీయులు తమ ఔషధాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇందులో ఫీనాలిక్స్ అనే పోషకాలు ఉన్నాయి. అవి గాయం వల్ల కలిగే మంటను తగ్గిస్తాయి. రోజాపువ్వు రేకులతో టీ కాచుకోవడం చాలా మంచిది. ఇది గుండెజబ్బు ముప్పునూ, క్యాన్సర్, డయాబెటిస్లనూ రిస్క్‌ను తగ్గిస్తుంది. పవ్వులకే కాదు... హీలింగ్ గుణానికీ ఇది రాజా అని చాలా మంది అంటుంటారు. అయితే దీన్ని పరిమితంగా టీ కాచుకోడానికీ లేదా ఫ్లేవర్‌గా ఉపయోగించడమే మంచిది. మందారపువ్వు... చాలా మంది దీన్ని పువ్వులను ఎండబెట్టుకొని టీ కాచుకొని తాగుతారు. మందారపువ్వు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. శరీర జీవక్రియలు క్రమబద్ధం చేస్తుంది. ఇందులో విటమిన్-సితో పాటు అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అవి కాలేయ క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్లను నివారిస్తాయి. మందారపూలతో కాచిన టీ వల్ల రక్తపోటు, యాంగ్జైటీ కూడా తగ్గుతాయి. అయితే ఈ చాయ్‌ను పరిమితంగా తాగితేనే మేలు. తామరపువ్వులు (లోటస్) ... తామరపూలతో చాలామంది టీ కాచుకొని తాగుతుంటారు. అయితే ఆసియా ఖండంలో అనేకమంది తామరతూళ్లను వంటకోసం ఉపయోగిస్తుంటారు. తామరపూలలో విటమిన్ ఏ, బీ, సి లు చాలా ఎక్కువ. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక విటమిన్ బి కాంప్లెక్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ సి అన్నది స్వాభావికమైన యాంటీ ఆక్సిడెంట్ అన్న విషయం తెలిసిందే. దాంతో ఇది క్యాన్సర్లతో పోరాడుతుంది. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్-సి రోగనిరోధకశక్తిని పెంచి ఎన్నో వ్యాధులకు కవచంగా పనిచేస్తాయి. డా. సుజాతా స్టీఫెన్ న్యూట్రిషనిస్ట్ మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ మాదాపూర్, హైదరాబాద్ -
సీమచింత
తిండి గోల కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, గట్టిగా వగరు రుచితో ఉంటాయి. పక్వానికొస్తున్న కొద్దీ బంగారు రంగు, గులాబీ, ఊదా నుంచి ఎరుపు రంగును సంతరించుకుంటాయి. పండిందంటే ఇట్టే తొక్క ఊడి వచ్చేస్తుంది. లోపల ఒక్కొక్క కణుపులోనూ తెల్లటి పల్చటి గుజ్జు...ఒలిస్తే నల్లటి గింజలుంటాయి. కొద్దిగా వగరుగా, తియ్యగా ఉంటుంది గుజ్జు. పట్టణాల్లో ఉన్న వారికి తెలియకపోవచ్చు కానీ, పల్లెటూళ్లలోని వారికి మాత్రం సీమచింత అంటే బాగా తెలుసు. కొందరు సీమతమ్మ అని కూడా అంటారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విరివిగా మొలుస్తాయి ఈ చెట్లు. పొలం గట్ల వెంబడి ఎక్కువగా ఉంటాయి. నీటిశాతం ఎక్కువగా ఉండే సీమచింతలో ఔషధ విలువలు, పోషక విలువలు కూడా తక్కువేమీ కావు. క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నియాసిన్, విటమిన్ సిలు ఉండే సీమచింత గొంతు, చిగుళ్లు, నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది. వీటి విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు. క్షయవ్యాధి నివారణకు ఈ చెట్టు వేర్లు బాగా పనిచేస్తాయి. కొందరు వీటిని పులిచింతకాయలు అని కూడా అంటారు. -
తెలివితేటలను పెంచే విటమిన్-సి
ఎగ్జామ్ టిప్స్ చదవాలంటే మూడ్ లేదా? అసలు బుర్రలో మట్టి పెట్టుకు తిరుగుతున్నావా? చదివినవి మీ పిల్లలు మర్చిపోతున్నారా? అయితే ఆసక్తికరమైన ఈ విటమిన్ గురించి తెలుసుకోవాల్సిందే. ఒక శాస్త్రీయ సర్వే ప్రకారం విటమిను సి సప్లిమెంట్ల వల్ల పిల్లల్లో ఐక్యూ పెరుగుతుందని తేలింది.మన శరీరం విటమిన్-సి ని తయారు చేసుకోలేదు అలాగే నిల్వ కూడా ఉంచుకోలేదు. కాబట్టి మనం ప్రతిరోజూ విటమిన్ సి ని ఏదో ఒక విధంగా ఆహారం ద్వారానే తీసుకోవాలి. ఆహారంలో నియమిత లేక సరైన మోతాదులో (45 మి.గ్రా) విటమిన్-సి తీసుకోవడం చాలా అవసరం. అలాగని ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్య సమస్యే. మామూలుగా పొగతాగే వారిలో పళ్లు, కూరగాయలు తక్కువగా తినే వారిలో, పిల్లలు పుట్టకుండా పిల్స్ వాడే వారిలో ఈ విటమిన్ తక్కువగా ఉంటుంది.చెర్రీ, జామ, బొప్పాయి, కివి, కమలాలు, ద్రాక్ష, పైనాపిల్, మామిడి లాంటి పుల్లని పళ్లలో, కాప్సికం, బ్రకోలి, టొమేటోలలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. వేడికి, వెలుగుకి, గాలికి వుండడం వల్ల, యాంటిబయాటిక్స్ వాడడం వల్ల, పొగ, మందు తాగే వారిలో ఇనుము, రాగి పాత్రలలోవండినా తీవ్రమైన జ్వరంతో బాధపడినా విటమిన్-సి నాశనమౌతుంది. కావున విటమిన్-సి మెదడు చురుగ్గా, చలాకీగా ఉండేలా చేయడమే కాక గ్రాహ్యకశక్తిని పెంచి మతిమరుపు పోగొట్టి వ్యాధి నిరోధకతను పెంచి పరీక్షా సమయంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. -
విటమిన్ సప్లిమెంట్లతో రిస్కేనట!
పరిపరి శోధన విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదని చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకంతోనే క్రమం తప్పకుండా విటమిన్ బిళ్లలు, టానిక్‌లు వాడుతుంటారు. అయితే, ఆ నమ్మకం ఉత్త భ్రమేనని అమెరికన్ మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. విటమిన్ సప్లిమెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరగడం సంగతెలా ఉన్నా, వాటిని వాడేవారిలో ఆరోగ్యం గురించి మితిమీరిన ధీమా పెరుగుతుందని, దాంతో అనారోగ్యకరమైన దినచర్యను అలవాటు చేసుకుని, చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారని వారు చెబుతున్నారు. ఇతరులతో పోలిస్తే విటమిన్ సప్లిమెంట్లు తీసుకునే వారు వ్యాయామానికి ఏమాత్రం ప్రాధాన్యమివ్వరని, అంతేకాకుండా, ఏం తిన్నా తమకేమీ కాదనే ధీమాతో రుచిగా ఉన్నవన్నీ ఇష్టానుసారం లాగించేసి స్థూలకాయులుగా మారుతారని, స్థూలకాయం వల్ల గుండెజబ్బులు, బీపీ, డయాబెటిస్ వంటి వ్యాధులకు గురవుతారని తమ అధ్యయనంలో తేలినట్లు చెబుతున్నారు. వీరి పరిశోధన సారాంశం ‘సైకలాజికల్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైంది. -
చింతకు తక్కువ ఉసిరికి ఎక్కువ
వాక్కాయ అతిగా మాట్లాడేవారు వాగుడుకాయలు... అతిగా తినగలిగేవి వాక్కాయలు... అదీ వాక్కాయ రుచి మరి... పులుపు, వగరు రుచుల సమ్మేళనం వాక్కాయ... చింతకాయకి తక్కువ ఉసిరికాయకు ఎక్కువ... ఒక్కో ప్రాంతం వారు ఒక్కో పేరుతో పిలుచుకుంటారు... ఎవరు ఎలా పిలుచుకున్నా వాక్కాయలు మన వంటింట్లోకి వచ్చాయంటే... ఎంతటివారికైనా మాటలకు మూతలు పడాల్సిందే... గిన్నెలకు మూతలు తెరుచుకోవాల్సిందే... వాక్కాయల్లో ఐరన్ అధికంగా ఉండటం చేత, రక్తహీనతతో బాధపడేవారికిది దివ్యౌషధం. ఇందులో ఉండే సి విటమిన్ అనేక రుగ్మతలను దూరం చేస్తుంది. ఈ కాయలు కొద్దిగా జిగురుగా ఉండటం వలన జెల్లీ, జామ్, సిరప్, చట్నీ తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఇవి సాధారణంగా హిమాలయ పర్వత ప్రాంతంలో 300 నుంచి 1800 మీటర్ల ఎత్తులో పడమటి కనుమలలోని సివాలిక్ పర్వతశ్రేణులలో పెరుగుతాయి. ఇంకా నేపాల్, ఆప్ఘనిస్థాన్ ప్రాంతంలో కూడా పెరుగుతాయి. భారతదేశంలో రాజ స్థాన్, గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతంలో పండుతాయి. శ్రీలంకలో కూడా పెరుగుతాయి. వాక్కాయ పులిహోర కావలసినవి: వాక్కాయలు - పావు కిలో; బియ్యం - కేజీ; పచ్చి మిర్చి - 10; ఎండు మిర్చి - 10; సెనగ పప్పు - టే బుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; వేయించిన పల్లీలు - 3 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - 4 రెమ్మలు; ఉప్పు - తగినంత; పసుపు - అర టీ స్పూను; ఇంగువ - అర టీ స్పూను; నూనె - 100 గ్రా. తయారీ: ముందుగా అన్నం వండి పక్కన ఉంచాలి వాక్కాయలను శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలు చేసి జీడి తీసేయాలి బాణలిలో నూనె వేసి కాగాక సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి వాక్కాయ ముక్కలు జత చేయాలి ఉప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు, వేయించిన పల్లీలు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గాక దింపేయాలి అన్నాన్ని ఒక పెద్ద పళ్లెంలో వేసి ఉండలు లేకుండా పొడిపొడిలాడేలా చేయాలి వేయించి ఉంచుకున్న వాక్కాయ మిశ్రమం వేసి బాగా కలిపి సుమారు గంటసేపు ఊరిన తర్వాత అందించాలి. వాక్కాయ - కొబ్బరి పచ్చడి కావలసినవి: వాక్కాయలు - 20; కొబ్బరి ముక్కలు - కప్పు; పచ్చి మిర్చి - 6; ఉప్పు - తగినంత; పసుపు - కొద్దిగా; ఇంగువ - చిటికెడు; నూనె - టేబుల్ స్పూను; ఎండు మిర్చి - 5; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; మెంతులు - పావు టీ స్పూను తయారీ: ముందుగా వాక్కాయలను శుభ్రంగా కడిగి రెండు ముక్కలుగా చేసి పక్కనుంచాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, సెనగపప్పు, మినప్పప్పు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి తీసేయాలి అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక వాక్కాయ ముక్కలు, ఇంగువ, పసుపు, ఉప్పు వేసి కాసేపు మగ్గాక తీసి చల్లార్చాలి మిక్సీలో ముందుగా వేయించి ఉంచుకున్న పోపు వేసి మెత్తగా చేయాలి వాక్కాయ ముక్కలు జత చేసి మరోమారు తిప్పాలి చివరగా కొబ్బరి ముక్కలు వేసి బాగా మెత్తగా తిప్పాలి వేడి వేడి అన్నంలో కమ్మటి నెయ్యితో తింటే రుచిగా ఉంటుంది (ఇష్టపడేవారు వేయించిన పల్లీలు కలుపుకుంటే మరింత రుచిగా ఉంటుంది) వాక్కాయ-వంకాయ కూర కావలసినవి: వాక్కాయలు - 10; వంకాయలు - పావు కేజీ; ఎండు మిర్చి - 6; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; కరివేపాకు - 3 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; పసుపు - కొద్దిగా; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె - టేబుల్ స్పూను తయారీ: ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి వాక్కాయలను శుభ్రంగా కడిగి, రెండు ముక్కలుగా కట్ చేసి జీడి తీసేయాలి బాణలిలో నూనె వేసి కాగాక సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి వంకాయ ముక్కలు వేసి బాగా కలిపాక, వాక్కాయ ముక్కలు, ఉప్పు, పసుపు, ఇంగువ వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కలిపి దించేసి వేడి వేడి అన్నంతో కాని, చపాతీలతో కాని వడ్డించాలి. వాక్కాయ ఆవకాయ కావలసినవి: వాక్కాయలు - అర కేజీ; ఆవ పొడి - 50 గ్రా.; కారం - 50 గ్రా.; ఉప్పు - 50 గ్రా.; నూనె - 200 గ్రా.; మెంతులు - టీ స్పూను తయారీ: ముందుగా వాక్కాయలను శుభ్రంగా కడిగి, కాయకు చిన్న గాటు పెట్టి లోపలి జీడి తీసేసి, కాయలను తడిపోయేవరకు ఆరబెట్టాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక వాక్కాయలను అందులో వేసి కొద్దిసేపు వేయించి తీసి చల్లార్చాలి ఒక పాత్రలో ఆవ పొడి, కారం, మెంతులు, ఉప్పు వేసి బాగా కలపాలి వాక్కాయలు జత చేసి బాగా కలిపి, నూనె పోసి మరోమారు కలిపి గాలి చొరని పాత్రలో ఉంచాలి మూడవ నాడు బాగా కలిపితే సరి. -
సానుకూల దృక్పథంతో సాగాలి
సాక్షి యువమైత్రి మహిళలు నేటి సమాజంలో తమ హక్కుల సాధనకై ధైర్యంగా పోరాడాలని వక్తలు పిలుపునిచ్చారు. మహిళల హక్కులు... గర్భాశయ సంబంధిత సమస్యలు... ఆరోగ్యం...విటమిన్లు... వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై సాక్షి నిర్వహించిన ‘మైత్రి మహిళ’, ‘యువ మైత్రి’ కార్యక్రమాలలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సాక్షి ఆధ్వర్యంలో మైత్రి మహిళ, యువ మైత్రి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కిన్నెర మూర్తి, డాక్టర్ దమయంతి మాట్లాడుతూ ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్ లకు మహిళలు, యువత దూరంగా ఉండాలని సూచించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రొటీన్లు, విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలన్నారు. పౌష్టికాహారం, పోషణ తద్వారా చక్కని ఆరోగ్య సాధన గురించి నిపుణులు వివరించారు. గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ గర్భధారణ సమయంలోనూ, ప్రసవానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వివిధ రకాల అంశాలపై పలువురు మహిళలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కెరియర్‌కు మార్గదర్శకత్వం... ప్రాథమిక విద్యను అభ్యసించిన మహిళ తన భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దుకుని వృత్తి లేదా ఉద్యోగ అవకాశాలను ఎంచుకునే క్రమాన్ని దృష్టిలో పెట్టుకుని రెండవసెషన్లో ‘యువ మైత్రి’ పేరిట కెరియర్‌కు సంబంధించిన మార్గదర్శకాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళాసభ ప్రిన్సిపల్ డాక్టర్ దుర్గ మాట్లాడుతూ ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దిశగా ముందుకు సాగాలని సూచించారు. యువత తమకు ఆసక్తి ఉన్న రంగంలో ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించుకుని, అందుకనుగుణంగా కృషి చేస్తూ, సానుకూల దృక్పథంతో ఆలోచించినప్పుడే ముందుకు వెళ్లగలుగుతారన్నారు. సాక్షి గ్రూప్ ఉపాధ్యక్షులు వె ఈపీ రెడ్డి, మార్కెటింగ్ డెరైక్టర్ రాణిరెడ్డిలు మాట్లాడుతూ స్త్రీల సమస్యలు, యువత కెరియర్‌కు సంబంధించిన సమస్యలపై ప్రతి నెల ఉచితంగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 31, జూన్ 1వ తేదీలలో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ కళాశాలలో సాక్షి కెరియర్ ఫెయిర్‌ను నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. వివరాలకు 9505555020 నంబర్‌ను సంప్రదించవచ్చు. -
చలితో చెలిమి
పొడిచర్మం ఎప్పుడూ పొడిబారుతూనే ఉంటుంది. చలికాలంలో అందరికీ ఈ సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఈ కాలం చర్మానికి బ్లీచ్ వాడకూడదు. ఎక్కువగా రబ్ చేయకూడదు. అలాగే మృదువుగా ఉండాలని నూనెలను వాడకూడదు. స్నానం చేయడానికి ముందు గోరువెచ్చని నూనెను మర్దనాకు ఉపయోగించాలి. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్, బయటకు వెళితే సన్‌స్క్రీన్ రాసుకోవాలి. రోజూ తీసుకునే ఈ జాగ్రత్తలు చలికాలంలోనూ చర్మాన్ని మృదువుగా వస్తాయి. చలి ఒక్కసారిగా ఎక్కువైంది. గాల్లో తేమ తగ్గి చర్మం పొడిబారుతోంది. కాలానుగుణంగా వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి మన దగ్గర ఎప్పుడూ బాణాల్లాంటి చిట్కాలు ఉంచుకోవాలి. కొబ్బరినూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మసాజ్ చేయాలి. రోజులో కొన్నిసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పెదవులు పొడిబారడం, పగుళ్ల సమస్యలు తగ్గి, మృదువుగా అవుతాయి. నువ్వుల నూనె, ఆప్రికాట్ నూనె, విటమిన్ ‘ఇ’ నూనెలను రెండేసి టీ స్పూన్ల చొప్పున తీసుకొని కలపాలి. అందులో రెండు అంగుళాల అల్లం ముక్కను తురిమి వేసి మరిగించాలి. ఇందులో అరకప్పు కోకా బటర్‌ను కరిగించి కలపాలి. ఒక బాటిల్లో పోసి రోజుకు రెండు సార్లు శరీరానికి మసాజ్ చేసుకోవాలి. పొడి చర్మానికి ఇది మేలైన మిశ్రమం. రాత్రి పడుకునే ముందు వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీటిలో పది నిమిషాల సేపు పాదాలను ఉంచాలి. తర్వాత తడి లేకుండా తుడిచి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేస్తే పాదాలపై చర్మం మృదువుగా మారుతుంది. పగుళ్లు తగ్గుముఖం పడతాయి. రెండు టేబుల్ స్పూన్ల తేనెలో, రెండు టీ స్పూన్ల పచ్చి పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, గొంతుకు, మెడకు ప్యాక్ వేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. కప్పు పెరుగులో, పావు కప్పు పెసర పిండి, గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు, మాడుకు, శిరోజాలకు పట్టించాలి. పావు గంట తర్వాత తలస్నానం చేయాలి. ప్రతి మూడు రోజులకోసారి ఇలా నెలరోజుల పాటు చేస్తే చుండ్రు, జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది. -
దీని దుంప తెగ...ఎన్ని పోషకాలో!
డుంబ్రిగుడ, న్యూస్‌లైన్: చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు చిలకడ (ఎర్ర)దుంపలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ దుంపల్లో బీటా కెరిటన్ అనే విటమిన్ అధికంగా ఉండడం వల్ల దృష్టి లోపం నుంచి గట్టెక్కవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్ చెందిన కొంత మంది చిలకడ దుంపల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు స్థానిక వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏడాది క్రితం సొవ్వా, దేముడువలస, లోగేలి గ్రామాల్లో పర్యటించి ప్రయోగాత్మకంగా ఈ దుంపల సాగును ప్రోత్సహించారు. ఏజెన్సీలోని చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందక, వ్యాధి నిరోధక శక్తి తగ్గి మత్యువాత పడుతున్నారు. చాలాచోట్ల అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు కూడా సరైన పౌష్టికాహారం అందడం లేదు. ఐదేళ్లలోపు చిన్నారులు పౌష్టికాహార లోపంతో ప్రాణాలు కోల్పోతున్నట్టు పలు స్వచ్ఛంద సంస్థలు సర్వేల ద్వారా గుర్తించాయి. పౌష్టికాహార లోపాన్ని నివారించడంలో చిలకడ దుంపలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నందున శాస్త్రవేత్తలు వీటి సాగును ప్రోత్సహిస్తున్నారు. చిన్నారులను ఆకర్షించేలా క్యారట్ రంగులో ఆరెంజ్, స్వీట్ ప్లేవర్లలో ఈ దుంపలు లభిస్తున్నాయి. దీని సాగు లాభదాయకంగా ఉండడంతో గిరిజనులు సాగువిస్తీర్ణం గణనీయంగా పెంచుతున్నారు. గత ఏడాది 30 ఎకరాల్లో పండించిన పంట ఈ ఏడాదిలో 70 ఎకరాలకు విస్తరించారు. 50 కిలోల చిలకడ దుంపల బస్తా రూ.1100 నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు దుంపలను కొనుగులో చేసి విశాఖ, రాజమండ్రి, తుని తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. రైతులకు ఆర్థిక ఆసరా... జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేస్తున్న చిలకడ దుంపలు గిరిజన రైతులకు ఆర్థిక ఆసరా అందిస్తోంది. ఈ దుంపల సాగుకు ఇక్కడ భూములు అనుకూలంగా ఉండడంతో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో స్వల్ప కాల వ్యవధిలో పంట చేతికి వ స్తుండడంతో ఈ దుంపల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. పంట పక్వానికి రావడంతో తవ్వి వెలికి తీసి, శుభ్రం చేసి మార్కెట్‌కు తీసుకువెళ్లి విక్రయిస్తున్నారు. గిటుబాటు ధర లభిస్తుండడంతో హర్షం వ్యక్తంచేస్తున్నారు.