సానుకూల దృక్పథంతో సాగాలి | Must have a positive attitude | Sakshi
Sakshi News home page

సానుకూల దృక్పథంతో సాగాలి

Published Tue, May 20 2014 10:42 PM | Last Updated on Mon, Aug 20 2018 8:31 PM

సానుకూల దృక్పథంతో సాగాలి - Sakshi

సానుకూల దృక్పథంతో సాగాలి

సాక్షి యువమైత్రి
 
మహిళలు నేటి సమాజంలో తమ హక్కుల సాధనకై ధైర్యంగా పోరాడాలని వక్తలు పిలుపునిచ్చారు. మహిళల హక్కులు... గర్భాశయ సంబంధిత సమస్యలు... ఆరోగ్యం...విటమిన్లు... వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై సాక్షి నిర్వహించిన ‘మైత్రి మహిళ’, ‘యువ మైత్రి’ కార్యక్రమాలలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సాక్షి ఆధ్వర్యంలో మైత్రి మహిళ, యువ మైత్రి కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కిన్నెర మూర్తి, డాక్టర్ దమయంతి మాట్లాడుతూ ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్ లకు మహిళలు, యువత దూరంగా ఉండాలని సూచించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రొటీన్లు, విటమిన్‌లు కలిగిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలన్నారు.

పౌష్టికాహారం, పోషణ తద్వారా చక్కని ఆరోగ్య సాధన గురించి నిపుణులు వివరించారు. గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ గర్భధారణ సమయంలోనూ, ప్రసవానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వివిధ రకాల అంశాలపై పలువురు మహిళలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.
 
కెరియర్‌కు మార్గదర్శకత్వం...

ప్రాథమిక విద్యను అభ్యసించిన మహిళ తన భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దుకుని వృత్తి లేదా ఉద్యోగ అవకాశాలను ఎంచుకునే క్రమాన్ని దృష్టిలో పెట్టుకుని రెండవసెషన్‌లో ‘యువ మైత్రి’ పేరిట కెరియర్‌కు సంబంధించిన మార్గదర్శకాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళాసభ ప్రిన్సిపల్ డాక్టర్ దుర్గ మాట్లాడుతూ ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దిశగా ముందుకు సాగాలని సూచించారు.

యువత తమకు ఆసక్తి ఉన్న రంగంలో ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించుకుని, అందుకనుగుణంగా కృషి చేస్తూ, సానుకూల దృక్పథంతో ఆలోచించినప్పుడే ముందుకు వెళ్లగలుగుతారన్నారు. సాక్షి గ్రూప్ ఉపాధ్యక్షులు వె ఈపీ రెడ్డి, మార్కెటింగ్ డెరైక్టర్ రాణిరెడ్డిలు మాట్లాడుతూ స్త్రీల సమస్యలు, యువత కెరియర్‌కు సంబంధించిన సమస్యలపై ప్రతి నెల ఉచితంగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈనెల 31, జూన్ 1వ తేదీలలో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ కళాశాలలో సాక్షి కెరియర్ ఫెయిర్‌ను నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. వివరాలకు 9505555020 నంబర్‌ను సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement