హామీలన్నీ.. నీటిమూటలు
‘ముందు దగా.. వెనుక దగా.. కుడి, ఎడమల దగాదగా’ అన్న మహాకవి మాటను అక్షరం పొల్లు పోకుండా ఐదేళ్ల టీడీపీ పాలన రుజువు చేసింది. ఏదో ఒకవిధంగా గద్దెనెక్కాలన్న ఆత్రంతో.. అమలు సాధ్యం కాని బాసలు చేసి, అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు.. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన నమ్మిన జనం గొంతు కోశారు. వారూ వీరూ అనే తేడా లేకుండా ప్రజలపై పగబట్టినట్టుగా వ్యవహరించారు. ఫలితంగా గత ఎన్నికల వేళ ఆయన హామీలు నమ్మిన వారు నిట్టనిలువునా నట్టేట మునిగిపోయారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాట మీద నిలబడేవారికే నాయకులుగా గుర్తింపు ఉంటుంది. ఇచ్చిన హామీలనే కాకుండా ప్రజా అవసరాల దృష్ట్యా ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాలను కూడా అమలు చేసినవారు, వారి కష్టాలకు పరిష్కారం చూపినవారే నిజమైన ప్రజా నాయకులవుతారు. వారి గుండెల్లో గూడు కట్టుకుని కలకాలం ఉంటారు. దానికి విరుద్ధంగా హామీలిచ్చి, నమ్మించి ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక మాట తప్పిన నేతను మోసగాడు, నమ్మక ద్రోహి, అవకాశవాది అంటారు. గత ఎన్నికలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 600 పైగా హామీలిచ్చారు. వాటిల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయలేదు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా అభివృద్ధి ఊసే లేదు. సరికదా! గతంలో ఉన్న పథకాల్ని, మంజూరైన అభివృద్ధి పనుల్ని సహితం పూర్తి చేయని అసమర్థ ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు.
నత్తనడకగా డెల్టా ఆధునికీకరణ
గోదావరి డెల్టా ఆధునికీకరణకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1,710 కోట్లు కేటాయించారు. రూ.1,190 కోట్లతో పంట కాలువలను, రూ.550 కోట్లతో మురుగునీటి కాలువలను ఆధునికీకరించాల్సి ఉంది. వైఎస్ హయాంలో రూ.650 కోట్ల మేర కాంట్రాక్ట్‌లు ఖరారు చేయగా, తరువాత రూ.150 కోట్లు.. మొత్తం రూ.800 కోట్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయి. ఇప్పటికీ ఆ పనులు పూర్తి చేయలేకపోయారు.
గోతులమయంగా ఆర్అండ్బీ రోడ్లు
ఆర్అండ్బీ రోడ్లు గోతులమయంగా తయారయ్యాయి. వీటికి మరమ్మతులు చేపటాల్సి ఉంది. జిల్లాలో 4,400 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లున్నాయి. వీటిలో ఏటా సుమారు 1,100 కిలోమీటర్ల మేర తప్పనిసరిగా అభివృద్ధి చేయాలి. ఇందుకు రూ.330 కోట్లు అవసరం. డబుల్ లేన్ రోడ్లకైతే మరో రూ.120 కోట్లు కేటాయించాలి. మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.100 కోట్లు విడుదల చేయాలి. కొత్త రోడ్ల కోసం మరో రూ.100 కోట్లు కావాలి. కానీ ప్రభుత్వం ఆ స్థాయిలో నిధులు ఇవ్వడంలేదు. జిల్లాలో 150 గ్రామాలకు లింకు రోడ్లు లేవు. ఇందుకోసం రూ.100 కోట్లు అవసరం. వీటికి కూడా నిధులు విడుదల చేయడం లేదు.
చంద్రబాబు హామీలు.. నీటిమూటలు
కాకినాడలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. కొండయ్యపాలెం వంతెన పనులు పూర్తి చేస్తామన్నారు. కాకినాడలో పేదల ఇళ్ల మరమ్మతులకు రూ.10 వేల చొప్పున మంజూరు చేస్తామన్నారు. ఉప్పుటేరు అభివృద్ధికి రూ.90 కోట్లు మంజూరు చేస్తామన్నారు. పెద్దాపురం వద్ద చెత్త ద్వారా విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. లాజిస్టిక్స్, ప్యాకేజీ, నిఫ్ట్ విశ్వవిద్యాలయాలను జిల్లాకు కేటాయించినట్టు చెప్పారు. హోప్ ఐలాండ్‌ను రూ.9 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. స్వదేశీ దర్శన్ పథకం కింద జిల్లాలోని సాగరతీరం వెంబడి రూ.99 కోట్లతో పర్యాటకాభివృద్ధి చేస్తామన్నారు. వీటిలో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలుకు నోచలేదు.
జన్మభూమిలో చెప్పిన వాటికీ దిక్కులేదు
రామచంద్రపురంలో 45 రోజుల్లో ప్రతి ఇంటికీ ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ ఇస్తామని సీఎం చెప్పి రెండేళ్లు దాటిపోయింది. ఒక కాలనీకి మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. స్మార్ట్ డ్రైనేజీ పథకం ద్వారా డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకస్తామన్నారు. ఇంతవరకూ మోక్షం లేదు. శేరిలంక గ్రామాన్ని ముంపు నుంచి కాపాడేందుకు, కోతను నివారించేందుకు రూ.16 కోట్లతో పనులు చేపడతామని ప్రకటించారు. ఇంతవరకూ ఆ దిశగా చర్యలే లేవు. పసలపూడి – వెల్ల బైపాస్ రోడ్డుకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. దానికి అతీగతీ లేదు. కె.గంగవరం మండలం సుందరపల్లి నుంచి బ్రహ్మపురి వరకూ 21 కిలోమీటర్ల ఏటిగట్టును రూ.40 కోట్లతో అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు. పనులు మొదలు కాలేదు. ముమ్మిడివరం నియోజకవర్గంలో నిరుపయోగంగా ఉన్న ఆరు ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి పథకాల మరమ్మతులకు రూ.6 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం – గొల్లగరువులో నిలిచిపోయిన వంతెన పనులకు రూ.60 కోట్లతో తిరిగి అంచనాలు రూపొందించి టెండర్లు పిలుస్తామన్నారు. గుజరాత్ పెట్రోలియం సంస్థ నుంచి మత్స్యకారులకు రావల్సిన 12 నెలల నష్టపరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీటిల్లో ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు.
అసెంబ్లీలో ఇచ్చిన హామీలదీ అదే తీరు
రాష్ట్ర శాసనసభ సాక్షిగా పెట్రో యూనివర్సిటీ, పెట్రోలియం కారిడార్, ఎల్అండ్జీ టెర్మినల్, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం, పోర్టు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్కు, వీసీఐసీ కారిడార్‌లో కాకినాడ, తెలుగు విశ్వవిద్యాలయం, కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ, అక్వా కల్చర్ ప్రాసెసింగ్ యూనిట్, భూ ఉపరితల జలమార్గాలు తదితర అంశాలపై చంద్రబాబు ఆర్భాటంగా హామీలిచ్చారు. కానీ, వాటికి కూడా ఇంతవరకూ అతీగతీ లేదు.
ఇంకా మరెన్నో..
పిఠాపురం బ్రాంచి కెనాల్ ఆధునికీకరణ పనులు చేపట్టలేదు.
సుద్దగెడ్డ ముంపు నుంచి గొల్లప్రోలుకు రక్షణ కోసం ఇటీవల శంకుస్థాపన చేశారు. కానీ నిధులు విడుదల చేయలేదు.
ఉప్పాడ మినీ హార్బర్‌కు నిధులు కేటాయించలేదు.
సఖినేటిపల్లి – నరసాపురం బ్రిడ్జి నిర్మాణాన్ని పట్టించుకోలేదు.
నాలుగు విలీన మండలాల్లో 57 ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు అవసరమైన రూ.1,300 కోట్లు విడుదల చేయలేదు. దీంతో సాగునీటి సమస్య పరిష్కారం కాలేదు.
రాజమహేంద్రవరంలో మొట్టమొదటి రైలు వంతెన హేవలాక్ బ్రిడ్జిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న హామీ గోదారిలో కలిసిపోయింది.
వడ్డీకే సరిపోని రైతు రుణమాఫీ
గత ఎన్నికల వేళ రైతులకు రుణమాఫీ చేస్తానని, ఏ ఒక్కరూ రుణబకాయిలు చెల్లించనవసరం లేదని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. కానీ, రైతులకు రుణ విముక్తి కలగలేదు. మాఫీ చేస్తానన్న చంద్రబాబు తూచ్ అనేశారు. చంద్రబాబు హామీ ఇచ్చే నాటికి జిల్లాలో 6.50 లక్షల మంది రైతులు రూ.13,009 కోట్ల రుణం తీసుకున్నారు. ఆయన సీఎం అయ్యాక రుణమాఫీపై తొలి సంతకం చేశారు. దీంతో రుణాలన్నీ మాఫీ అయిపోతాయని రైతులు భావించారు. కానీ, షరా మామూలుగానే రైతుల్ని చంద్రబాబు నట్టేట ముంచారు. మూడు విడతలుగా రూ.961.93 కోట్లు మాత్రమే మాఫీకి మంజూరు చేశారు. దీంతో తీసుకున్న రుణంలో పదో వంతు కూడా మాఫీ కాని పరిస్థితి నెలకొంది. ఇందులో కూడా చాలావరకూ రైతుల ఖాతాలకు జమ కాలేదు. మరోపక్క చంద్రబాబు మాఫీ చేస్తానన్నారని బకాయిలు చెల్లించకపోవడంతో దాదాపు రూ.4 వేల కోట్ల మేర వడ్డీ భారం రైతులపై పడింది.
రుణమాఫీకి అర్హులైన రైతులు : 6.50 లక్షలు
రుణమాఫీ కావాల్సిన మొత్తం : రూ.13,009 కోట్లు
మూడు విడతలుగా విడుదల చేసిన నిధులు : రూ.961.93 కోట్లు
నాలుగున్నరేళ్లలో రైతులు తీసుకున్నరుణంపై పడిన వడ్డీ : రూ.4 వేల కోట్లు
నిరుద్యోగులకు కుచ్చుటోపీ
ఎన్నికలకు ముందు ఇంటికొక ఉద్యోగమని చంద్రబాబు అన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అని ఆ పార్టీ నాయకులు ఊదరగొట్టారు. కానీ, నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. భృతీ ఇవ్వలేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రం రూ.2 వేలకు బదులు రూ.వెయ్యి ఇస్తామంటూ హడావుడి చేశారు. ఇందులో కూడా డిగ్రీ, డిప్లమో అంటూ ఆంక్షలు పెట్టి నిరుద్యోగ లబ్ధిదారుల సంఖ్యను కుదించేశారు. జిల్లాలో ఉన్న నిరుద్యోగులందరికీ నాలుగున్నరేళ్లలో రూ.900 కోట్ల వరకూ భృతి ఇవ్వాల్సి ఉండగా.. ఆంక్షల పేరుతో 20 వేల మందికి పరిమితం చేసి, అది కూడా ఎన్నికలకు ఆరు నెలలు ముందు, రూ.2 వేలకు బదులు రూ.వెయ్యితో సరిపెట్టి మమ అనిపించేశారు.
భృతికి అర్హులైన నిరుద్యోగులు : 4,10,000
ఆంక్షలతో ఎంపిక చేసిన నిరుద్యోగులు : 20,000
మహిళలకు దగా
రెండో సంతకంతో డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. పెట్టుబడి నిధి అని కొన్నాళ్లు అన్నారు. తర్వాత పసుపు – కుంకుమ అని డ్రామాలు మొదలుపెట్టారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చేనాటికి జిల్లాలోని 89,433 సంఘాలకు రూ.1,326.42 కోట్లు మాఫీ చేయాలి. కానీ, అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరికీ రూ.10 వేలని చెప్పి ఇంతవరకూ రూ.837 కోట్లు మాత్రమే పెట్టుబడి నిధి కింద బ్యాంకు ఖాతాలకు పరిమితం చేశారు. దానికి పసుపు – కుంకుమ అని పేరు పెట్టారు. వాస్తవానికి పెట్టుబడి నిధి కింద ఇచ్చిన రూ.10 వేలు వారు తీసుకున్న రుణాల వడ్డీకే సరిపోలేదు. నాలుగున్నరేళ్ల కాలంలో మహిళలు తీసుకున్న రుణాలకు రూ.వెయ్యి కోట్లు పైగా వడ్డీ పడింది. ఈ లెక్కన ప్రభుత్వమిచ్చిన రూ.837 కోట్లు వడ్డీకే చాలని పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ప్రకటించారు. అది కూడా మూడు విడతలని చెప్పి, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. దీనిని మోసం కాకపోతే ఏమంటారో!
2014 మార్చి 31 నాటికి రుణ బకాయిలు : రూ.1326.42 కోట్లు
బకాయి పడిన డ్వాక్రా సంఘాలు : 89,433
తీసుకున్న రుణంపై పడిన వడ్డీ రూ.వెయ్యి కోట్లు పైనే..
పెట్టుబడి నిధి కింద బ్యాంకు ఖాతాలకు జమ చేసిన నిధులు : రూ.837 కోట్లు