చింతకు తక్కువ ఉసిరికి ఎక్కువ | Amla regret to less thanc | Sakshi
Sakshi News home page

చింతకు తక్కువ ఉసిరికి ఎక్కువ

Published Mon, Oct 5 2015 11:09 PM | Last Updated on Sun, Sep 3 2017 10:29 AM

చింతకు తక్కువ  ఉసిరికి ఎక్కువ

చింతకు తక్కువ ఉసిరికి ఎక్కువ

వాక్కాయ

అతిగా మాట్లాడేవారు వాగుడుకాయలు... అతిగా తినగలిగేవి వాక్కాయలు... అదీ వాక్కాయ రుచి మరి...  పులుపు, వగరు రుచుల సమ్మేళనం వాక్కాయ...  చింతకాయకి తక్కువ ఉసిరికాయకు ఎక్కువ...  ఒక్కో ప్రాంతం వారు ఒక్కో పేరుతో పిలుచుకుంటారు...
 ఎవరు ఎలా పిలుచుకున్నా వాక్కాయలు మన వంటింట్లోకి వచ్చాయంటే...  ఎంతటివారికైనా మాటలకు మూతలు పడాల్సిందే...
 గిన్నెలకు మూతలు తెరుచుకోవాల్సిందే...    
 
వాక్కాయల్లో ఐరన్ అధికంగా ఉండటం చేత, రక్తహీనతతో బాధపడేవారికిది దివ్యౌషధం. ఇందులో ఉండే సి విటమిన్ అనేక రుగ్మతలను దూరం చేస్తుంది. ఈ కాయలు కొద్దిగా జిగురుగా ఉండటం వలన జెల్లీ, జామ్, సిరప్, చట్నీ తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఇవి సాధారణంగా హిమాలయ పర్వత ప్రాంతంలో 300 నుంచి 1800 మీటర్ల ఎత్తులో పడమటి కనుమలలోని సివాలిక్ పర్వతశ్రేణులలో పెరుగుతాయి. ఇంకా నేపాల్, ఆప్ఘనిస్థాన్ ప్రాంతంలో కూడా పెరుగుతాయి. భారతదేశంలో రాజ స్థాన్, గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతంలో పండుతాయి. శ్రీలంకలో కూడా పెరుగుతాయి.
 
వాక్కాయ పులిహోర

కావలసినవి: వాక్కాయలు - పావు కిలో; బియ్యం - కేజీ; పచ్చి మిర్చి - 10; ఎండు మిర్చి - 10; సెనగ పప్పు - టే బుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; వేయించిన పల్లీలు - 3 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - 4 రెమ్మలు; ఉప్పు - తగినంత; పసుపు - అర టీ స్పూను; ఇంగువ - అర టీ స్పూను; నూనె - 100 గ్రా.
 
తయారీ: ముందుగా అన్నం వండి పక్కన ఉంచాలి  వాక్కాయలను శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలు చేసి జీడి తీసేయాలి  బాణలిలో నూనె వేసి కాగాక సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి  వాక్కాయ ముక్కలు జత చేయాలి  ఉప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు, వేయించిన పల్లీలు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గాక దింపేయాలి  అన్నాన్ని ఒక పెద్ద పళ్లెంలో వేసి ఉండలు లేకుండా పొడిపొడిలాడేలా చేయాలి  వేయించి ఉంచుకున్న వాక్కాయ మిశ్రమం వేసి బాగా కలిపి సుమారు గంటసేపు ఊరిన తర్వాత అందించాలి.
 
వాక్కాయ - కొబ్బరి పచ్చడి
కావలసినవి: వాక్కాయలు - 20; కొబ్బరి ముక్కలు - కప్పు; పచ్చి మిర్చి - 6; ఉప్పు - తగినంత; పసుపు - కొద్దిగా; ఇంగువ - చిటికెడు; నూనె - టేబుల్ స్పూను; ఎండు మిర్చి - 5; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; మెంతులు - పావు టీ స్పూను
 
తయారీ: ముందుగా వాక్కాయలను శుభ్రంగా కడిగి రెండు ముక్కలుగా చేసి పక్కనుంచాలి  బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, సెనగపప్పు, మినప్పప్పు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి తీసేయాలి  అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక వాక్కాయ ముక్కలు, ఇంగువ, పసుపు, ఉప్పు వేసి కాసేపు మగ్గాక తీసి చల్లార్చాలి  మిక్సీలో ముందుగా వేయించి ఉంచుకున్న పోపు వేసి మెత్తగా చేయాలి  వాక్కాయ ముక్కలు జత చేసి మరోమారు తిప్పాలి చివరగా కొబ్బరి ముక్కలు వేసి బాగా మెత్తగా తిప్పాలి  వేడి వేడి అన్నంలో కమ్మటి నెయ్యితో తింటే రుచిగా ఉంటుంది (ఇష్టపడేవారు వేయించిన పల్లీలు కలుపుకుంటే మరింత రుచిగా ఉంటుంది)
 
వాక్కాయ-వంకాయ కూర
కావలసినవి: వాక్కాయలు - 10; వంకాయలు - పావు కేజీ; ఎండు మిర్చి - 6; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; కరివేపాకు - 3 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; పసుపు - కొద్దిగా; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె - టేబుల్ స్పూను
 తయారీ: ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి  వాక్కాయలను శుభ్రంగా కడిగి, రెండు ముక్కలుగా కట్ చేసి జీడి తీసేయాలి  బాణలిలో నూనె వేసి కాగాక సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి వంకాయ ముక్కలు వేసి బాగా కలిపాక, వాక్కాయ ముక్కలు, ఉప్పు, పసుపు, ఇంగువ వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి  బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కలిపి దించేసి వేడి వేడి  అన్నంతో కాని, చపాతీలతో కాని వడ్డించాలి.
 
 వాక్కాయ ఆవకాయ
కావలసినవి: వాక్కాయలు - అర కేజీ; ఆవ పొడి - 50 గ్రా.; కారం - 50 గ్రా.; ఉప్పు - 50 గ్రా.; నూనె - 200 గ్రా.; మెంతులు - టీ స్పూను
తయారీ: ముందుగా వాక్కాయలను శుభ్రంగా కడిగి, కాయకు చిన్న గాటు పెట్టి లోపలి జీడి తీసేసి, కాయలను తడిపోయేవరకు ఆరబెట్టాలి  బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక వాక్కాయలను అందులో వేసి కొద్దిసేపు వేయించి తీసి చల్లార్చాలి  ఒక పాత్రలో ఆవ పొడి, కారం, మెంతులు, ఉప్పు వేసి బాగా కలపాలి  వాక్కాయలు జత చేసి బాగా కలిపి, నూనె పోసి మరోమారు కలిపి గాలి చొరని పాత్రలో ఉంచాలి  మూడవ నాడు బాగా కలిపితే సరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement