తినే పూలు... | Eat flowers ... Be Healthy | Sakshi
Sakshi News home page

తినే పూలు...

Published Sun, Jun 19 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

తినే పూలు...

తినే పూలు...

పువ్వు... దేవుడి పాదాల దగ్గర ఉంటుంది.
అమ్మాయి కురుల మీద అందాలొలికిస్తూ ఉంటుంది.
అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పువ్వు
ఆరోగ్యానికి కూడా మంచిదే.
పూజలకూ, పురస్కారాలకే కాదు...
రాజాలాంటి ఆరోగ్యం కోసం కూడా
పూలు పనికి వస్తాయి.
హెల్త్‌కు పుష్పహారం... ఈ పుష్పాహారం!
ఈ పువ్వులు తినండి... హెల్దీగా ఉండండి!!

కాలీఫ్లవర్...

గోబీ పువ్వు అని తెలుగులోనూ ఫూల్ గోబీ అని హిందీలోనూ పిలుచుకునే ఈ పువ్వు కూరలా వండుకోడానికి ఉద్దేశించినదే. గోబీ పకోడీలంటూ శ్నాక్స్ రూపంలోనూ కాలీఫ్లవర్‌ను తీసుకోవచ్చు. కాలీఫ్లవర్‌లోని సల్ఫోరఫేన్ వంటి వృక్షరసాయనాలు (ఫైటో కెమికల్స్) క్యాన్సర్లతో పోరాడతాయి. దాంతో ఈ పువ్వు క్యాన్సర్‌ను నివారిస్తుంది. సల్ఫోరఫేన్ అనే పోషకం ఆటిజమ్‌ను నివారించడంలో కూడా తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇవి ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి. కాలీఫ్లవర్‌లోని ఇండోల్-3-కార్బినాల్ అనే స్టెరాల్ కూడా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా సమరం చేస్తుంది. ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్ల నివారణకు సమర్థమైనది. కణాలు క్యాన్సరస్‌గా మారిపోతే అందులోనే అంతర్గతంగా క్యాన్సర్‌ను హరించే విషాలను (సైటోటాక్సిన్స్)ను పుట్టించి వాటిని తుదముట్టిస్తుందీ పువ్వు.

బ్రకోలీ / బ్రోకలీ...

బ్రకోలీ అనేది నిజానికి ఇటాలియన్ పేరు. ఇటాలియన్ భాషలో ‘బ్రొకోలో’ అంటే క్యాబేజీ తాలూకు పుష్ప శిఖరాగ్రం (ఫ్లవరింగ్ క్రెస్ట్ ఆఫ్ క్యాబేజీ) అని అర్థం. గతంలో క్యాలీఫ్లవర్ అంతటి విస్తృతంగా లభ్యం కాకపోయినా... ఇప్పుడు మన మార్కెట్లలోనూ చాలా ఎక్కువగానే దొరుకుతోంది. ఇందులో విటమిన్ ఏ పాళ్లు చాలా ఎక్కువ. మేని నిగారింపుకూ, మంచి కనుచూపుకూ ‘విటమిన్-ఏ’ దోహదపడుతుంది. ఇక ఇందులోని పోషకాలు (ఫైటోన్యూట్రియెంట్స్) శరీరంలో పేరుకుపోయిన అనే విషాలను తొలగించే ‘డీ-టాక్సిఫైయర్స్’గా ఉపయోగపడతాయి.

అరటిపువ్వు ...

ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థం, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. అరటిపువ్వుతో ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. అరటిపువ్వుతో కూరలను వండి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. ఉదాహరణకు...

 ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది: అరటిలోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఇథనాల్ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి, గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. అరటిపువ్వు నుంచి సేకరించిన పోషకాలు మలేరియా కారక క్రిములను ఎదుర్కొంటాయని ఒక అధ్యయనం చెబుతోంది. అయితే ఈ విషయం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు.

ఫ్రీరాడికల్స్‌ను హరిస్తుంది : క్యాన్సర్ కారకాలుగా మారే ఫ్రీరాడికల్స్ అనే కాలుష్య పదార్థాలను అరటిపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్ సమర్థంగా హరిస్తాయి. వయసుపైబడే ప్రక్రియనూ అరటిపువ్వు మందగింపజేస్తుంది. అలా ఏజింగ్‌ను ఆపుతుంది.

డయాబెటిస్ నియంత్రణ- రక్తహీనత నివారణ : అరటిపువ్వు రక్తంలోని చక్కెర పాళ్లను నియంత్రిస్తుంది. అలాగే ఇందులో ఐరన్ ఎక్కువ కాబట్టి రక్తహీనతను అరికడుతుంది.

రుతు సమస్యల నివారణ : అరటిపువ్వుల కూర తినడం మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అరటిపువ్వుతో అనేక రుతుబాధలు నివారితమవుతాయి. రుతు సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ కావడం తగ్గుతుంది. రుతుస్రావం వచ్చే ముందు మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం, కడుపునొప్పి వంటి అనేక సమస్యలు కనిపించే ప్రీ-మెనుస్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్‌ఎస్) తగ్గిపోతుంది. ఇందులోని మెగ్నీషియమ్ వల్ల యాంగ్జైటీ తగ్గి, మంచి మూడ్స్ సమకూరుతాయి.

పాలను పెంచుతుంది : బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో బాగా పాలు పడేలా చేస్తుంది అరటిపువ్వు.

కుంకుమపువ్వు...

కుంకుమపువ్వును ఎంతోకాలంగా మనం సుగంధద్రవ్యంగా వాడుతూనే ఉన్నాం. బిర్యానీలోనూ, కశ్మీరీ వంటకాల్లోనూ ఈ పువ్వును ఉపయోగిస్తాం. కుంకుమపువ్వులో యాంటీసెప్టిక్, యాంటీడిప్రెసెంట్ గుణాలున్నాయి. క్యాన్సర్‌లతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి.

మంచి రంగుతో పండంటి బిడ్డ పుట్టడానికి కుంకుమపువ్వు దోహదం చేస్తుందన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఈ మాటలో ఎంత వాస్తవం ఉందన్న సంగతి పక్కన పెడితే కుంకుమపువ్వు ఒక హెర్బ్‌గా, సుగంధద్రవ్యంగా పరిమితంగా తీసుకుంటే చాలా న్యూట్రిటివ్ ప్రయోజనాలు మాత్రం ఉన్నాయి. కుంకుమపువ్వు రక్తపోటును నియంత్రించి, మూడ్స్ త్వరత్వరగా మారిపోవడాన్ని అరికడుతుందని కొన్ని అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇందులో బీ-కాంప్లెక్స్ విటమిన్‌కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ అన్న విలువైన పోషకాలు ఉన్నాయి. ఇవి గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక గర్భవతుల్లో ప్రోజెస్టెరాన్ అన్న హార్మోన్ కారణంగా మలబద్దకం రావడం చాలా సహజంగా జరుగుతుంటుంది. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఆ రకంగా ఇది గర్భవతులకు ఇది మేలు చేస్తుంది. దీన్ని చిటికెడుకు మించకుండా తీసుకోవడం సురక్షితం.

 అది అపోహే కానీ... ప్రయోజనం ఇలా...
కుంకుమపువ్వు కడుపులోని బిడ్డ రంగును ఆకర్షణీయంగా మార్చుతుందనే అపోహ చాలామందిలో ఉంది. దీనికి తగిన శాస్త్రీయ నిర్ధారణ మాత్రం లేదు. కాకపోతే... పాలు సంపూర్ణాహారం. గర్భవతులు తాగితే చాలా మేలు. అయితే మొదటి మూడు నెలల పాటు గర్భవతులు తమ వేవిళ్లు, వికారం కారణంగా పాలు తాగడానికి అంత సుముఖంగా ఉండరు. కుంకుమపువ్వు అనే సుగంధద్రవ్యం పాలను మరింత రుచికరంగా, సుగంధభరితంగా చేస్తుంది. పైగా బిడ్డ మంచి రంగులో పుడతాడనే అంశం వాళ్లను పాలు తాగేలా ప్రోత్సహిస్తుంది. ఇక కొన్నిచోట్ల సంప్రదాయ వంటకాల్లోనూ దీన్ని ఒక దినుసుగా ఉపయోగించి వంటకు మరింత రుచిని తీసుకొస్తారు. అప్పుడు దీనివల్ల కలిగే పైన పేర్కొన్న ప్రయోజనాలన్నీ కేవలం గర్భవతులకే కాకుండా మిగతావాళ్లకూ చేకూరుతాయి.

కాబోయే అమ్మలకు కాషన్
కుంకుమపువ్వును గర్భవతులు వాడే సమయంలో తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... పాలలో దీన్ని చిటికెడు కంటే ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక నేచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. అందుకే మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే గర్భస్రావమూ అయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకుని చిటికెడంటే చిటికెడే వాడాలి. వేప పువ్వును ఉగాది పచ్చడి రూపంలో ఆహారంలో వాడడం తెలుగు వారికి ఎప్పటినుంచో తెలిసిన సంప్రదాయమే!


గులాబీ...
మన దగ్గర ఆహారంలో దీని ఉపయోగం చాలా తక్కువే అయినా చైనీయులు తమ ఔషధాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇందులో ఫీనాలిక్స్ అనే పోషకాలు ఉన్నాయి. అవి గాయం వల్ల కలిగే మంటను తగ్గిస్తాయి. రోజాపువ్వు రేకులతో టీ కాచుకోవడం చాలా మంచిది. ఇది గుండెజబ్బు ముప్పునూ, క్యాన్సర్, డయాబెటిస్‌లనూ రిస్క్‌ను తగ్గిస్తుంది. పవ్వులకే కాదు... హీలింగ్ గుణానికీ ఇది రాజా అని చాలా మంది అంటుంటారు. అయితే దీన్ని పరిమితంగా టీ కాచుకోడానికీ లేదా ఫ్లేవర్‌గా ఉపయోగించడమే మంచిది.

మందారపువ్వు...
చాలా మంది దీన్ని పువ్వులను ఎండబెట్టుకొని టీ కాచుకొని తాగుతారు. మందారపువ్వు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. శరీర జీవక్రియలు క్రమబద్ధం చేస్తుంది. ఇందులో విటమిన్-సితో పాటు అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అవి కాలేయ క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్‌లను నివారిస్తాయి. మందారపూలతో కాచిన టీ వల్ల రక్తపోటు, యాంగ్జైటీ కూడా తగ్గుతాయి. అయితే ఈ చాయ్‌ను పరిమితంగా తాగితేనే మేలు.

తామరపువ్వులు (లోటస్) ...
తామరపూలతో చాలామంది టీ కాచుకొని తాగుతుంటారు. అయితే ఆసియా ఖండంలో అనేకమంది తామరతూళ్లను వంటకోసం ఉపయోగిస్తుంటారు. తామరపూలలో విటమిన్ ఏ, బీ, సి లు చాలా ఎక్కువ. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక విటమిన్ బి కాంప్లెక్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ సి అన్నది స్వాభావికమైన యాంటీ ఆక్సిడెంట్ అన్న విషయం తెలిసిందే. దాంతో ఇది క్యాన్సర్‌లతో పోరాడుతుంది. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్-సి రోగనిరోధకశక్తిని పెంచి ఎన్నో వ్యాధులకు కవచంగా పనిచేస్తాయి.

డా. సుజాతా స్టీఫెన్
న్యూట్రిషనిస్ట్ మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్
మాదాపూర్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement