విటమిన్ సప్లిమెంట్లతో రిస్కేనట!
పరిపరి శోధన
విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదని చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకంతోనే క్రమం తప్పకుండా విటమిన్ బిళ్లలు, టానిక్‌లు వాడుతుంటారు. అయితే, ఆ నమ్మకం ఉత్త భ్రమేనని అమెరికన్ మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. విటమిన్ సప్లిమెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరగడం సంగతెలా ఉన్నా, వాటిని వాడేవారిలో ఆరోగ్యం గురించి మితిమీరిన ధీమా పెరుగుతుందని, దాంతో అనారోగ్యకరమైన దినచర్యను అలవాటు చేసుకుని, చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారని వారు చెబుతున్నారు.
ఇతరులతో పోలిస్తే విటమిన్ సప్లిమెంట్లు తీసుకునే వారు వ్యాయామానికి ఏమాత్రం ప్రాధాన్యమివ్వరని, అంతేకాకుండా, ఏం తిన్నా తమకేమీ కాదనే ధీమాతో రుచిగా ఉన్నవన్నీ ఇష్టానుసారం లాగించేసి స్థూలకాయులుగా మారుతారని, స్థూలకాయం వల్ల గుండెజబ్బులు, బీపీ, డయాబెటిస్ వంటి వ్యాధులకు గురవుతారని తమ అధ్యయనంలో తేలినట్లు చెబుతున్నారు. వీరి పరిశోధన సారాంశం ‘సైకలాజికల్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైంది.