అమ్మ కావాలని ఉందా? | Mother is easy for many people  Some people have trouble | Sakshi
Sakshi News home page

అమ్మ కావాలని ఉందా?

Published Thu, Jan 17 2019 12:29 AM | Last Updated on Thu, Jan 17 2019 4:48 AM

Mother is easy for many people  Some people have trouble - Sakshi

అమ్మ కావడం చాలామందికి సులువు. కొందరిలో సమస్య ఉంటుంది.ఎదురుచూపు ఉంటుంది.అడ్డంకులు ఏమిటో బోధ పడవు.వైద్య సహాయానికి వెళితే సమస్య ఏమిటో  తెలుస్తుంది.అది గర్భాశయంలో లోపం కావచ్చు, ట్యూబుల్లో అడ్డంకి కావచ్చు,ఫలదీకరణ సమస్య కావచ్చు, మానసిక ఒత్తిడీ కావచ్చు.డాక్టర్‌ని కలవండి. అవగాహన పెంచుకోండి. ఆనందంగా మాతృత్వపు మాధుర్యం అనుభవించండి.

గత వారం సంతానలేమి తాలూకు కొన్ని అంశాల గురించి చర్చించాం. ‘అండాల విడుదలలో ఎదురయ్యే సమస్య’ గురించి, వాటికి పరిష్కారాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మహిళల్లో సంతానలేమికి కారణమయ్యే మరికొన్ని అంశాల గురించి విపులంగా తెలుసుకుందాం. 

గర్భాశయంలో లోపాలు
సాధారణంగా గర్భాశయంలో లోపాల వల్ల గర్భం దాల్చలేని వారు దాదాపు 10% నుంచి 15% వరకు ఉంటారు. గర్భాశయంలో లోపాలు కూడా అనేక కారణాల వల్ల కలుగుతుంటాయి. ఉదాహరణకు... గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌) వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్‌ ఉన్నా, పూత ఉన్నా, అక్కడ స్రవించే మ్యూకస్‌ స్రావాలు మరీ చిక్కగా ఉన్నా, గర్భాశయ ముఖద్వారం మరీ సన్నగా ఉన్నప్పుడు వీర్యకణాలు గర్భసంచి లోపలికి ప్రవేశించలేకపోవచ్చు. కొంతమందిలో యోనిలోని ద్రవాల్లో ఆమ్లగుణం మరీ ఎక్కువగా ఉండటం వల్ల అవి వీర్యకణాలను చైతన్యరహితం చేస్తాయి.

కొంతమందిలో సర్విక్స్‌ దగ్గర వీర్యకణాలకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ–స్పెర్మ్‌ యాంటీబాడీస్‌ ఉంటాయి. అవి వీర్యకణాలను నిర్వీర్యం చేసి, గర్భాశయంలోకి వెళ్లనివ్వవు. మరికొందరిలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, అడ్డుపొరలు (యుటెరైన్‌ సెప్టమ్‌) వంటి సమస్యలు ఉండటం వల్ల... అవి ఉన్న స్థితి (పొజిషన్‌), పరిమాణం (సైజు) వంటి అంశాలు గర్భధారణకు అడ్డుగా నిలవవచ్చు. ఇలాంటి సందర్భాల్లో  సమస్య తీవ్రతను బట్టి గర్భం దాల్చడం కష్టం కావచ్చు. 

పరీక్షలు/చికిత్స: స్పెక్యులమ్, వెజైనల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా యోని, సర్విక్స్‌ భాగంలో ఉండే ఇన్ఫెక్షన్, పూత, గీరుకుపోయినట్లుగా అయ్యే పుండు (ఎరోజన్‌), సర్వైకల్‌ పాలిప్‌ వంటి సమస్యలను తెలుసుకోవచ్చు. అలాగే పాప్‌స్మియర్‌ పరీక్ష కూడా చేయించుకోవడం మంచిది. కేవలం ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు యాంటీబయాటిక్‌ పూర్తి కోర్సు వాడటం వల్ల సమస్య సమసిపోతుంది. దీంతో పుండు తగ్గకపోతే అప్పుడు క్రయోకాటరీ (ఐస్‌ ట్రీట్‌మెంట్‌) చికిత్స అవసరమవుతుంది. పాలిప్‌ (కండపెరగడం) వంటి సమస్యలు ఉంటే, వాటిని శస్త్రచికిత్సతో తొలగించాలి. గర్భాశయ ముఖద్వారం కొందరిలో మరీ సన్నగా (సర్వైకల్‌ స్టెనోసిస్‌) ఉన్నప్పుడు దానిని డీ అండ్‌ సీ అనే చిన్న ప్రక్రియ ద్వారా వెడల్పుచేయడం వల్ల ఉపయోగం ఉండవచ్చు.

ఇన్ఫెక్షన్, పూత, పుండు ఉన్నప్పుడు సర్విక్స్‌లో స్రవించే ద్రవాలు సరిగా లేకపోవడం వల్ల చికిత్స తీసుకున్నా గర్భం రాకపోతే ఐయూఐ (ఇంట్రా యుటెరైన్‌ ఇన్‌సెమినేషన్‌) అనే పద్ధతి ద్వారా వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్‌ ద్వారా గర్భాశయంలోకి పంపడం జరుగుతుంది. పెల్విక్‌ స్కానింగ్‌ చేయడం వల్ల గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్‌ వంటి అనేక సమస్యలు తెలుస్తాయి. అవసరమైతే 3డీ స్కానింగ్, ఎమ్మారై వంటి పరీక్షలు చేసి, సమస్య తీవ్రతను నిర్ధారణ చేసి, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. లాపరోస్కోపీ ద్వారా ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్‌ వంటి సమస్యలను నిర్ధారణ చేసి, అదే ప్రక్రియ ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేయవచ్చు. లేదా పాత పద్ధతుల్లోనే పొట్టను కట్‌ చేయడం ద్వారా సర్జికల్‌ పద్ధతిలో వాటిని తొలగించవచ్చు.

ఇక హిస్టరోస్కోప్‌ ద్వారా గర్భాశయం లోపలి పొరలో ఉండే పాలిప్స్, సెప్టమ్‌ (అడ్డుపొర), అడ్‌హెషన్స్‌ (అతుకులు), సబ్‌మ్యూకస్‌ ఫైబ్రాయిడ్స్‌ వంటి సమస్యలను నిర్ధారణ చేసుకొని, వాటిని తొలగించవచ్చు. ఇలా గర్భధారణకు అడ్డుపడే  అంశాలను కనుగొని, వాటిని తొలగిస్తే గర్భం దాల్చడానికి అవకాశాలు పెరుగుతాయి. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే...: అన్ని రకాల ఫైబ్రాయిడ్స్‌ను తొలగించాల్సిన అవసరం ఉండదు. ఫైబ్రాయిడ్స్‌ గర్భాశయ పొరలో ఉన్నప్పుడు (సబ్‌మ్యూకస్‌ ఫైబ్రాయిడ్స్‌) వాటిని తొలగించాల్సి వస్తుంది. గర్భాశయ కండరాల్లో ఉన్నవి (ఇంట్రామ్యూరల్‌ ఫైబ్రాయిడ్స్‌) 5 సెం.మీ. కంటే ఎక్కువగా ఉండి, సర్విక్స్‌ భాగంలో ఉండి, వీర్యకణాలను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుపడటం, పిండం పెరగకుండా చేయడం వంటి సమస్య ఏర్పడుతున్నప్పుడు మాత్రమే వాటిని తొలగించడం వల్ల ఉపయోగం ఉంటుంది. 

చిన్న ఫైబ్రాయిడ్‌లు, గర్భాశయం బయటకు ఉన్నవీ (సబ్‌సీరోజల్‌ ఫైబ్రాయిడ్స్‌) గర్భం రావడానికి పెద్దగా అడ్డుపడకపోవచ్చు. కాబట్టి అలాంటి వాటికి ఆపరేషన్‌ కచ్చితంగా చేయాలని ఏమీలేదు. ఎండోమెట్రియాసిస్‌ సమస్య ఉన్నప్పుడు, కొందరిలో గర్భాశయం లోపలిపొర (ఎండోమెట్రియమ్‌) కడుపులోకి వెళ్లడం, మరికొందరిలో గర్భాశయం బయటా, అండాశయం పైనా, ఇలా పలుచోట్ల అతుక్కొని నెలనెలా రుతుస్రావం సమయంలో లోపలివైపున రక్తస్రావం అయి, అక్కడ అండాశయంలో చాక్‌లెట్‌ సిస్ట్‌లూ, ట్యూబ్స్, గర్భసంచి, పేగులు... ఇలా అన్నీ అంటుకుపోయి అండం నాణ్యత, విడుదలలో, ఫలదీకరణలో ఇబ్బందులు ఏర్పడి,  గర్భం రాకపోవచ్చు. 

ఫెలోపియన్‌ ట్యూబ్‌లలో లోపాలు
అండాశయం నుంచి గర్భాశయానికి ఇరువైపులా ఉండే ట్యూబ్‌లను ఫెలోపియన్‌ ట్యూబ్‌లు అంటారు. అండం అండాశయం నుంచి ఈ ట్యూబ్‌లలోకి చేరుతుంది. యోని నుంచి శుక్రకణాలు, గర్భాశయంలోనుంచి ట్యూబ్‌లలోకి చేరుతాయి. అండం, శుక్రకణంతో కలిసి, ట్యూబ్‌లో పిండంగా మారాక అది గర్భాశయంలోని ఎండోమెట్రియమ్‌ పొరలోకి చేరిపోయి, శిశువుగా పెరుగుతుంది. గర్భం దాల్చడంలో ఫెలోపియన్‌ ట్యూబ్‌లు కూడా కీలకమైన భూమిక పోషిస్తాయి. అందుకే ఫెలోపియన్‌ ట్యూబ్‌లలో లోపాలు కూడా గర్భం రావడంలో అవరోధాలు కలిగిస్తాయి. 

గర్భాశయం నుంచి లేదా పొట్టలోని పేగుల నుంచి కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఫెలోపియన్‌ ట్యూబ్స్‌కి చేరి వాటిని కూడా ఇన్ఫెక్ట్‌ చేయడం వల్ల వాటి పనితీరు తగ్గుతుంది. అప్పుడు ట్యూబ్స్‌ వాయడం, తర్వాత అవి మూసుకుపోవడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్‌ రావడంతో పాటు కడుపులో ఏదైనా అపరేషన్‌ జరిగి ఉంటే ఆ కారణంగా, లేక ఎండోమెట్రియోసిస్‌తో కొందరిలో అతుకులు (అడ్‌హెషన్స్‌) ఏర్పడటం వల్ల ట్యూబ్స్‌ అండాశయాలకు దూరంగా జరుగుతాయి. దాంతో అండం ట్యూబ్‌లోపలికి ప్రవేశించదు. 

నిర్ధారణ ఇలా: ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ మూసుకుపోయి ఉన్నాయా లేదా తెరచుకుని ఉన్నాయా తెలుసుకోడానికి హిస్టరోసాల్పింగోగ్రామ్‌ (హెచ్‌ఎస్‌జీ) అనే ఎక్స్‌రే లేదా సోనోసాల్పింగోగ్రామ్‌ (ఎస్‌ఎస్‌జీ) అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కొందరిలో పరీక్ష చేసినప్పుడు పొట్టకండరం బిగుసుకుపోవడం వల్ల ట్యూబ్స్‌ బిగుసుకుపోయినట్లయ్యి ట్యూబ్స్‌ బ్లాక్‌ అయిపోయాయని (అడ్డంకులు ఏర్పడ్డాయని) తప్పుడు రిపోర్ట్‌ రావచ్చు. 

చికిత్స: ట్యూబ్స్‌ మూసుకుపోయి ఉంటే, దాన్ని నిర్ధారణ చేసుకోడానికి లాపరోస్కోపీ ప్రక్రియలో డై–టెస్ట్‌ చేస్తారు. ఇందులో అడ్డంకి (బ్లాక్‌) ఎక్కడుందో చూసి, హిస్టరోస్కోపీ ద్వారా ఫెలోపియన్‌ ట్యూబ్‌ కాన్యులేషన్‌ అనే ప్రక్రియతో దాన్ని తెరవడానికి ప్రయత్నించవచ్చు. ఇది కొందరికి ఉపయోగపడుతుంది. కొందరిలో సత్ఫలితం ఇవ్వకపోవచ్చు. కొందరిలో ట్యూబ్స్‌లో ఇన్ఫెక్షన్‌ వల్ల నీరు చేరి (హైడ్రో సాల్పింగ్‌), అవి వాచి, మూసుకుపోవచ్చు. అలాంటి సందర్భాల్లో చికిత్స చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. కారణం... ట్యూబ్స్‌ పాడైపోయి, వాటి పనితీరు సరిగా ఉండదు.

ఇలాంటి సందర్భాల్లో గర్భం వచ్చినా అది ట్యూబ్స్‌లో ఇరుక్కుపోయి, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండు ట్యూబ్స్‌లో కనీసం ఒక్కటైనా తెరచుకొని ఉంటే గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. ట్యూబ్స్‌ రెండూ మూసుకుపోయినప్పుడు, అలాంటివారిలో గర్భం కోసం ఐవీఎఫ్‌ (టెస్ట్‌ట్యూబ్‌) పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. కొందరిలో ఐవీఎఫ్‌కు వెళ్లేముందు ట్యూబ్స్‌లో హైడ్రోసాల్పింగ్స్‌ తీవ్రత ఎక్కువగా ఉంటే, ట్యూబ్స్‌ను తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే దానిలోనుంచి వచ్చే ద్రవం పిండం గర్భాశయంలో అతుక్కోకుండా చేస్తుంది. 

మానసిక కారణాలు 
మహిళల్లో కనిపించే మానసిక ఒత్తిడి అంశం కూడా గర్భధారణపై చాలావరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు, గర్భం రాలేదని బంధువుల, ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలు, మానసిక వ్యథ వంటి కారణాల వల్ల గర్భధారణకు మొదటి నుంచీ అవసరమైన హార్మోన్ల విడుదలలో అసమతౌల్యత ఏర్పడి అండం విడుదల కాదు. అలాగే ఫలదీకరణ, ఇంప్లాంటేషన్‌లో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఇలాంటి వారికి బయట నుంచి ఎన్ని మందులు ఇచ్చినా, లోపల విడుదల కావాల్సిన హార్మోన్లు సక్రమంగా లేకపోవడం వల్ల గర్భం రావడంలో ఆలస్యమవుతుంది. 

అందుకే మానసికంగా కుంగుబాటు వంటి సమస్యలను దరిచేరనివ్వకూడదు. మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారు (వారితో పాటు ఇలాంటి సమస్యను దరిచేరనివ్వకూడదని భావించే సాధారణ ఆరోగ్యవంతులు కూడా) యోగా, ధ్యానం, వాకింగ్‌ వంటి రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ అవలంబించాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. అవసరమైతే కౌన్సెలింగ్‌ వంటివి ప్రయత్నించవచ్చు. దాంతో మనకు తెలియకుండానే అసమతౌల్యత తొలగిపోయి, హార్మోన్లు సరిగా పనిచేసి, గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. 

ఇంప్లాంటేషన్‌ సమస్యలు
ఫెలోపియన్‌ ట్యూబ్‌ల ద్వారా వచ్చే అండం అక్కడ శుక్రకణాలతో కలిశాక పిండంగా మారి, గర్భసంచిలోకి వచ్చి అక్కడ కాస్తంత పరుపులాగా తయారుగా ఉన్న ఎండోమెట్రియమ్‌ పొరలోకి అంటుకుపోయి శిశువుగా పెరుగుతుందన్న విషయం తెలిసిందే. ఇలా అండంగా మారిన పిండం, ఎండోమెట్రియమ్‌లోకి అంటుకుపోవడాన్ని ‘ఇంప్లాంటేషన్‌’ అంటారు. కొందరిలో ఈ ఇంప్లాంటేషన్‌ సమస్య వల్ల కూడా పిండం పెరగక సంతానలేమి సమస్య రావచ్చు. 

కారణమేమిటి: కొందరిలో ఎలాంటి సమస్యలూ కనిపించకపోయినా, అన్ని పరీక్షలూ మామూలుగా (నార్మల్‌గా)నే ఉన్నా, ప్రాథమికంగా వాడే మందులు వాడినా, నేరుగా  వీర్యకణాలను లోపలికి తీసుకెళ్లి వదిలే ప్రక్రియ అయిన ఐయూఐ (ఇంట్రా యుటెరైన్‌ ఇన్‌సెమినేషన్‌) చేసినా, పిండాన్ని నేరుగా యుటెరస్‌ వరకు తీసుకెళ్లే ఐవీఎఫ్‌ (ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌) జరిపినా, లేదా వీర్యకణాలను నేరుగా అండంలోకే ఇంజెక్షన్‌ ద్వారా ప్రవేశపెట్టే ఇక్సీ (ఐసీఎస్‌ఐ – ఇంట్రా సైటోప్లాసమిక్‌ స్పెర్మ్‌ ఇంజెక్షన్‌) పద్ధతి  ద్వారా పిండాన్ని నేరుగా యుటెరస్‌ వరకు పంపినా గర్భం రాకపోవచ్చు. కొందరిలో గర్భాశయం పిండాన్ని స్వీకరించదు.

ఇలా ఎందుకు జరుగుతోందనేందుకు కారణాలు ఇంకా తెలియరావడం లేదు. ఇందుకోసం అనేక రకాల పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. పిండం ట్యూబుల్లోకి వచ్చి, గర్భాశయంలో అంటుకుంటేనే అది శిశువుగా రూపొందడం మొదలువుతుంది. ఇంప్లాంటేషన్‌గా చెప్పే ఈ సమయంలో అనేక రకాల హార్మోన్లు, రసాయనాలు, కెమికల్‌ మీడియేటర్లు, గర్భాశయ పొరలో రక్తప్రసరణ, ఇంకా బయటకు తెలియని చాలా ప్రక్రియలు అన్నీ సరిగా ఉన్నప్పుడే గర్భధారణ జరుగుతుంది. వాటిలో ఏదైనా సమస్య ఉంటే ఎన్ని చికిత్సలు చేసినా ఉపయోగం ఉండదు.

అందుకే టెస్ట్‌ట్యూబ్‌ బేబీ ప్రక్రియ ద్వారా ప్రయత్నించినా, అందులోనూ 40% నుంచి 50% మేరకు మాత్రమే గర్భధారణ కలిగే అవకాశం ఉంటాయి. ఇంప్లాంటేషన్‌ సమస్యలకు చికిత్సలో భాగంగా ఐవీఎఫ్‌లో గర్భసంచిలోకి ఎండోమెట్రియమ్‌ పొరను ప్రేరేపించడం, పిండం పైనా, పొరకీ చిన్నగా చిల్లు పెట్టడం (అసిస్టెడ్‌ హ్యాచింగ్‌) వంటి ప్రక్రియలతో పాటు గర్భాశయం పిండాలన్ని తిరస్కరించకుండా ఉండటం కోసం, స్వీకరించేలా చేయడం కోసం యాంటీఇమ్యూన్‌ ఇంజెక్షన్స్‌ ఇవ్వడం, స్టెరాయిడ్స్‌ వంటి అనేక రకాల మందులతో చికిత్సలు ఇవ్వడం జరుగుతుంది. కొందరిలో ఎన్ని చేసినా ఇంప్లాంటేషన్‌ నూటికి నూరు పాళ్లు విజయవంతం కాకపోవచ్చు. 

ఫలదీకరణ (ఫర్టిలైజేషన్‌) సమస్యలు
ప్రతినెలా అండాశయం నుంచి విడుదలైన అండం ట్యూబ్‌లలోకి ప్రవేశిస్తుంది. ఒకసారి విడుదలైన తర్వాత అండం 24 గంటలు మాత్రమే జీవిస్తుంది. (అంటే యాక్టివ్‌గా ఉంటుంది. ఆ తర్వాత నిర్వీర్యమవుతుంది). ఆ సమయంలో కలయిక ద్వారా విడుదలైన వీర్యకణాలు ట్యూబ్‌లలోకి చేరి అండాన్ని చుట్టుముడతాయి. అనేక వీర్యకణాల నుంచి విడుదలయ్యే హైలురానిక్‌ యాసిడ్‌ వంటి అనేక ఎంజైములు... అండం మీద చిల్లుపడేలా చేస్తాయి. అందులోనుంచి ఒక్క వీర్యకణం మాత్రమే అండంలోకి ప్రవేశిస్తుంది. వెంటనే చిల్లు మూసుకుపోతుంది. అలా ఒక వీర్యకణం, అండం కలిసి ఫలదీకరణ జరిగి పిండం ఏర్పడుతుంది.

ఈ ప్రక్రియలో ఎక్కడ లోపాలు ఉన్నాగానీ గర్భం రాకపోవచ్చు. ఈ ప్రక్రియలో శుక్రకణాలు గర్భాశయంలో వెళ్లిన తర్వాత అక్కడ వాటి సంఖ్య తక్కువగా ఉన్నా, వాటి నాణ్యత (క్వాలిటీ), కదలిక (మొటిలిటీ) సరిగా లేనప్పుడు, వాటి నుంచి విడుదలయ్యే ఎంజైములు సరిగా ఉండనప్పుడు గర్భం రాదు. అలాగే అండం నాణ్యత సరిగా లేకపోయినా, అండంపైన పొర బాగా మందంగా ఉన్నా ఫలదీకరణ జరగకపోవచ్చు. వీర్యకణాలు 48 గంటల నుంచి 72 గంటల వరకు జీవించి ఉంటాయి. ఫలదీకరణ లోపాలను తెలుసుకోవడం మామూలుగా కష్టం. పరీక్షలలో వేరే సమస్యలు ఏవీ కనిపించనప్పుడు దంపతులకు ఒక కోర్స్‌ యాంటీబయాటిక్, మల్టీ విటమిన్, యాంటీఆక్సిడెంట్స్‌ మాత్రల వంటి రకరకాల మందులు ఇచ్చి చూడటం జరుగుతుంది.

అన్ని రకాలుగా ప్రయత్నించినా ఐయూఐ చికిత్స చేసినా గర్భం రానప్పుడు ఫలదీకరణలో సమస్యలు ఉన్నట్లుగా భావించి, ఆ దంపతులకు ఐవీఎఫ్, ఇక్సీ (ఐసీఎస్‌ఐ / టెస్ట్‌ట్యూబ్‌ బేబీ) పద్ధతులను సూచించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో అండాలను శుక్రకణాలను మైక్రోస్కోప్‌ కింద విశ్లేషించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఒక్కోసారి కొన్ని లోపాలను సైతం గుర్తించే అవకాశం ఉంది. అందులో అనేక అండాలను, శుక్రకణాలను నేరుగా ల్యాబ్‌లో అనేక న్యూట్రిషన్‌ మీడియాలో కలిపి చూస్తారు. కాబట్టి ఈ ప్రక్రియల ద్వారా ఫలదీకరణ సమస్యలను అధిగమించవచ్చు. అయినా ఫలదీకరణ కాకపోవడం జరగడం, వాటి నాణ్యత బాగా లేకపోయినా, అవసరమైతే దాతల నుంచి స్వీకరించిన అండాలను లేదా శుక్రకణాలను కూడా దంపతులు ఆమోదిస్తే వాడి చూడవచ్చు. 

తెలియని కారణాలు: (అన్‌ ఎక్స్‌ప్లెయిన్‌డ్‌ ఇన్‌ఫెర్టిలిటీ): కొందరిలో ఎన్ని పరీక్షలు చేసినా, ఎలాంటి సమస్యా లేదని నిర్ధారణ అయినా ఎంతకూ గర్భం రాదు. ఇందుకు కారణాలు తెలియదు.
డా‘‘ వేనాటి శోభ, బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో, హైదర్‌నగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement