వైరసవత్తరమైన సినిమాలు | Special Story On Virus Backdrop Movies | Sakshi
Sakshi News home page

వైరసవత్తరమైన సినిమాలు

Published Fri, Apr 3 2020 12:49 AM | Last Updated on Fri, Apr 3 2020 8:19 AM

Special Story On Virus Backdrop Movies - Sakshi

గతాన్ని విశ్లేషించుకోవడానికి, ప్రస్తుతాన్ని అర్థం చేసుకోవడానికి,  భవిష్యత్తుని ఎదుర్కోవడానికి  కీలకమైన వాటిలో సినిమా కచ్చితంగా ఒకటి. సినిమా సమాజానికి అద్దమే కదా! బయటి ప్రపంచంలోని కష్టాలను తప్పించుకోవడానికి సినిమాని ఎస్కేప్‌ గా వాడతాం. సినిమా ఫ్యాంటీసిలోకి వెళ్లిపోయి మనకున్న అనవసరమైన తలనొప్పులను తాత్కాలికంగా మర్చిపోతాం. ప్రస్తుతం మనందరి ముందు ఉన్న సమస్య ఒక్కటే... కోవిడ్‌ – 19 (కరోనా వైరస్‌). ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడతాం అన్నదే అందరి మదిలో ఉన్న ఆలోచన. గతంలోనూ ఇలాంటి వైరస్‌లు ప్రపంచం మీదకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. బీభత్సాన్ని సృష్టించాయి. వాటిని తట్టుకొని నిలబడ్డ సందర్భాలున్నాయి. అయితే అలాంటి సంఘటనల ఆధారంగా కొన్ని కాల్పనిక సినిమాలు వచ్చాయి. వైరస్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమాల గురించి తెలుసుకోవడం మంచి అవకాశం ఇది. సినిమాలోని ప్రాతలను కష్టపెట్టిన ఆ వైరస్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు ప్రేక్షకులను మెప్పించి, ‘వైరసవత్తరం’ అనిపించుకున్నాయి.
ఆ చిత్రాల విశేషాలు.


వైరస్‌ (2019)
2018లో కేరళపై నిఫా వైరస్‌ దాడి చేసింది. ఎన్నో ప్రాణాలు కోల్పోయాం. అయితే ఆ వైరస్‌ని అధిగమించాం. ఆ సంఘటనల ఆధారంగా మలయాళ దర్శకుడు ఆషిక్‌  అబూ ‘వైరస్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. మలయాళ క్రేజీ స్టార్స్‌ చాలా మంది ఈ సినిమాలో నటించారు. మన దేశంలో తెరకెక్కిన బెస్ట్‌ మెడికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు.
(ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో చూడొచ్చు.)


కంటేజిన్‌ (2011)
కరోనా వైరస్‌ విపరీతంగా వ్యాప్తి చెందినప్పటినుంచి 2011లో వచ్చిన ‘కంటేజిన్‌’ సినిమా ప్రస్తావన వస్తూనే ఉంది. కారణం.. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ఆ  సినిమాలో ముందే చూపించడమే. స్టీవెన్‌ సోడన్‌ బెర్గ్‌ తెరకెక్కించిన ఆ సినిమాలో కేట్‌ విన్స్‌ లెట్, మాట్‌ డెమన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. గాల్లో ప్రయాణించే వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా సోకితే ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మందు కనుగొన్నారా? వంటి అంశాలను చూపిం చారు. (అమెజాన్‌ ప్రైమ్‌లో చుడొచ్చు.)


అవుట్‌ బ్రేక్‌ (1995)

ఎబోలా వైరస్‌ అమెరికాను ఎటాక్‌ చేస్తే, దాన్ని ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు, సామాన్య ప్రజలు ఎం చేశారు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘అవుట్‌ బ్రేక్‌’. రిచర్డ్‌ ప్రెస్టన్‌ రచించిన ‘ది హాట్‌ జోన్‌’ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు పెటెర్‌ సెన్‌ తెరకెక్కించారు.  
(చూడాలనుకుంటే యూట్యూబ్‌లో రెంట్‌ చేసుకోవచ్చు.)


ఫ్లూ (2013)
36 గంటల్లో మనుషుల ప్రాణాల్ని తీసుకునే భయంకరమైన వైరస్‌ ఒకటి సౌత్‌ కొరియాలో పుడితే, దాన్ని  ఎలా ఎదుర్కొన్నారు? అనే కథతో తెరకెక్కిన కొరియన్‌ చిత్రం ’ఫ్లూ’. కిమ్‌ సంగ్‌ సూ తెరకెక్కించారు.


12 మంకీస్‌ (1995)
12 మంకీస్‌ అనే గ్యాంగ్‌ భయంకరమైన వైరస్‌ని తయారు చేసి ప్రపంచం మీద వదులుతుంది. దాంతో ప్రపంచం దాదాపు అంతమవుతుంది. బతికి బయటపడ్డవాళ్లు  భూ కింది భాగంలో జీవిస్తుంటారు. ఈ వైరస్‌ ఎలా తయారయింది? దీనికి పరిష్కారం ఎలా కనుక్కోవాలి? అని టైమ్‌ ట్రావెల్‌లో హీరో ప్రయాణం చేయడమే చిత్రకథ. బ్రాడ్‌ పిట్‌ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని టెర్రీ గిల్లియం తెరకెక్కించారు. (నెట్‌ ఫ్లిక్స్‌లో చుడొచ్చు.)


వైరస్‌ బ్యాక్‌డ్రాప్‌ కథాంశాలతోనే   ‘28 డేస్‌ లేటర్‌’ (2002),   ‘కారియర్స్‌’ (2009), ‘బ్లైండ్‌ నెస్‌’ (2008), 93 డేస్‌ (2016) వంటి మరికొన్ని సినిమాలు కూడా రూపొందాయి. ఈ సినిమాలన్నీ వేరు వేరు భాషల్లో రూపొందినవి కావొచ్చు. కానీ కథలన్నీ ఇంచుమించు ఒక్కటే. అవన్నీ చెబుతున్నది కూడా ఒక్కటే. సమస్య ఎప్పుడైనా, ఎలా అయినా రావొచ్చు. ధైర్యంగా నిలబడితేనే పరిష్కారం లభిస్తుంది. విపత్కర వైరస్‌లు వస్తే దాని పరిస్థితిని, ప్రభావాన్ని అవగాహన చేసుకోవడానికే ఈ సినిమాలన్నీ చూడండి, అనవసరమైన భయాన్ని, భ్రమను కలిగించుకోవడానికి కాదు. సినిమాలో విలన్‌ ఎంత బలవంతుడైతే కథ అంత రసవత్తరంగా ఉంటుంది. అతన్ని ఎదిరించి గెలిస్తే కథ మరింత రసవత్తరంగా తయారవుతుంది. ప్రస్తుతం మనందరి ముందు ఉన్న విలన్‌ కరోనా.  ఈ వైరస్‌ ని ధైర్యంగా ఎదుర్కొని మనందరమూ హీరోలవుదాం. దాన్ని ఎదుర్కోడానికి ఎదురెళ్లనవసరం లేదు. ఇంట్లో ఉండే జయించవచ్చు. ఇంట్లో ఉండండి. బయటికొచ్చి ఇబ్బందుల్లో పడకండి.

– గౌతమ్‌ మల్లాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement