డుంబ్రిగుడ, న్యూస్‌లైన్: చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు చిలకడ (ఎర్ర)దుంపలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ దుంపల్లో బీటా కెరిటన్ అనే విటమిన్ అధికంగా ఉండడం వల్ల దృష్టి లోపం నుంచి గట్టెక్కవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్ చెందిన కొంత మంది చిలకడ దుంపల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు స్థానిక వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏడాది క్రితం సొవ్వా, దేముడువలస, లోగేలి గ్రామాల్లో పర్యటించి ప్రయోగాత్మకంగా ఈ దుంపల సాగును ప్రోత్సహించారు.
ఏజెన్సీలోని చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందక, వ్యాధి నిరోధక శక్తి తగ్గి మత్యువాత పడుతున్నారు. చాలాచోట్ల అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు కూడా సరైన పౌష్టికాహారం అందడం లేదు. ఐదేళ్లలోపు చిన్నారులు పౌష్టికాహార లోపంతో ప్రాణాలు కోల్పోతున్నట్టు పలు స్వచ్ఛంద సంస్థలు సర్వేల ద్వారా గుర్తించాయి. పౌష్టికాహార లోపాన్ని నివారించడంలో చిలకడ దుంపలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నందున శాస్త్రవేత్తలు వీటి సాగును ప్రోత్సహిస్తున్నారు.
చిన్నారులను ఆకర్షించేలా క్యారట్ రంగులో ఆరెంజ్, స్వీట్ ప్లేవర్లలో ఈ దుంపలు లభిస్తున్నాయి. దీని సాగు లాభదాయకంగా ఉండడంతో గిరిజనులు సాగువిస్తీర్ణం గణనీయంగా పెంచుతున్నారు. గత ఏడాది 30 ఎకరాల్లో పండించిన పంట ఈ ఏడాదిలో 70 ఎకరాలకు విస్తరించారు. 50 కిలోల చిలకడ దుంపల బస్తా రూ.1100 నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు దుంపలను కొనుగులో చేసి విశాఖ, రాజమండ్రి, తుని తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
రైతులకు ఆర్థిక ఆసరా...
జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేస్తున్న చిలకడ దుంపలు గిరిజన రైతులకు ఆర్థిక ఆసరా అందిస్తోంది. ఈ దుంపల సాగుకు ఇక్కడ భూములు అనుకూలంగా ఉండడంతో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో స్వల్ప కాల వ్యవధిలో పంట చేతికి వ స్తుండడంతో ఈ దుంపల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. పంట పక్వానికి రావడంతో తవ్వి వెలికి తీసి, శుభ్రం చేసి మార్కెట్‌కు తీసుకువెళ్లి విక్రయిస్తున్నారు. గిటుబాటు ధర లభిస్తుండడంతో హర్షం వ్యక్తంచేస్తున్నారు.
దీని దుంప తెగ...ఎన్ని పోషకాలో!
Published Sun, Oct 13 2013 2:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
Advertisement
Advertisement