సీమచింత
తిండి గోల
కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, గట్టిగా వగరు రుచితో ఉంటాయి. పక్వానికొస్తున్న కొద్దీ బంగారు రంగు, గులాబీ, ఊదా నుంచి ఎరుపు రంగును సంతరించుకుంటాయి. పండిందంటే ఇట్టే తొక్క ఊడి వచ్చేస్తుంది. లోపల ఒక్కొక్క కణుపులోనూ తెల్లటి పల్చటి గుజ్జు...ఒలిస్తే నల్లటి గింజలుంటాయి. కొద్దిగా వగరుగా, తియ్యగా ఉంటుంది గుజ్జు. పట్టణాల్లో ఉన్న వారికి తెలియకపోవచ్చు కానీ, పల్లెటూళ్లలోని వారికి మాత్రం సీమచింత అంటే బాగా తెలుసు.
కొందరు సీమతమ్మ అని కూడా అంటారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విరివిగా మొలుస్తాయి ఈ చెట్లు. పొలం గట్ల వెంబడి ఎక్కువగా ఉంటాయి. నీటిశాతం ఎక్కువగా ఉండే సీమచింతలో ఔషధ విలువలు, పోషక విలువలు కూడా తక్కువేమీ కావు. క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నియాసిన్, విటమిన్ సిలు ఉండే సీమచింత గొంతు, చిగుళ్లు, నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది. వీటి విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు. క్షయవ్యాధి నివారణకు ఈ చెట్టు వేర్లు బాగా పనిచేస్తాయి. కొందరు వీటిని పులిచింతకాయలు అని కూడా అంటారు.