Health Problems With Long Sitting Jobs Doctors Precautions While Working - Sakshi
Sakshi News home page

గంటల కొద్దీ కూర్చుని పని చేస్తున్నారా..? ఎంత డేంజర్‌ అంటే?

Published Tue, Jan 24 2023 12:45 AM | Last Updated on Tue, Jan 24 2023 9:48 AM

Health Problems With Long Sitting Jobs Doctors Precautions While Working - Sakshi

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్నది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. కానీ కూర్చుని కదలకుండా పనిచేస్తే కొండంత ఆరోగ్య సమస్యలూ చుట్టుముడతాయన్నది నేటి సామెతగా మారింది. ఐటీతో పాటు అనేక రంగాల్లో కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే డెస్క్‌జాబ్స్‌ పెరిగిపోయాయి. ఆ ఉద్యోగాల్లో ఎక్కువసేపు కూర్చునే ఉండటం, పనిఒత్తిడి కారణంగా వివిధ  రకాల వ్యాధులూ పెరిగి­ పోతు­న్నాయి. అందువల్ల పనిప్రదేశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.     
– సాక్షి, హైదరాబాద్‌

డెస్క్‌ వర్క్‌.. ‘డిస్క్‌’పై ఎఫెక్ట్‌..
ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో శక్తి ఖర్చు తగ్గి కొవ్వు పేరుకుపోతోంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. ముందుకు వంగి కూర్చోవడం వల్ల వెన్నెముకపై ప్రభావం పడుతోంది. తొలుత పనిచే­సేటప్పుడే ఈ ఒత్తిడి ఉంటుంది. తర్వాత పడుకున్పప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది. కొన్నేళ్లలో ఇది పూర్తి స్థాయి డిస్క్‌ సమస్యగా మారుతుంది. పనిచేసే చోట కూర్చునే తీరులో లోపాలు, దీర్ఘకాల పని గంటలే దీనికి కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు.

మణికట్టుపై ‘పని’కట్టు
కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌.. ఈ సమస్య మణికట్టు దగ్గర వస్తుంది. మణికట్టు దగ్గర దాదాపు 15 చిన్నచిన్న కండరాలు ఉంటాయి. వీటిలో ఒక్క కండరానికి వాపు వచ్చినా మిగతా అన్నింటిపై ఒత్తిడి పడుతుంది. దీనితో చేతిలో తిమ్మిర్లులా రావడం, రాత్రి పడుకున్నప్పుడు వేళ్లు వణకడం వంటివి జరగొచ్చు. రోజంతా మౌస్, కీబోర్డు వాడి.. ఆ తర్వాత బైక్‌ హ్యాండిల్, కార్‌ స్టీరింగ్‌ పట్టుకోవాల్సిన అవసరం వల్ల మణికట్టు కండరాలు మరింత అధిక శ్రమకు గురవుతాయి.

ఐటీ రంగంలో ఎక్కువగా..
ప్రముఖ వెల్‌నెస్‌ సంస్థ సోల్‌ హెల్త్‌కేర్‌ సంస్థ అధ్యయనం ప్రకారం.. ఐటీ రంగంలో ఆరోగ్య సమస్యలు బాగా పెరిగిపోయాయి. ఓ కంపెనీలో పనిచేసే 784 మందిని ఎంచుకుంటే.. అందులో 179 మంది నడుము నొప్పి, 129 మంది గర్భాశయం, వెన్నెముకలోని కీళ్లు/ డిస్క్‌లను ప్రభావితం చేసే గర్భాశయ స్పాండిలోసిస్, 65 మందిలో కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ (చేతుల్లో తిమ్మిర్లు), 61 మందిలో సాక్రోలియాక్‌ సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. 
►ఐటీ ఉద్యోగుల్లో గుండె జబ్బులు 147 శాతం ఎక్కువని, వీటితో మరణించే ప్రమాదం 18 శాతం పెరుగుతోందని అన్నల్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌ అధ్యయనంలో వెల్లడైంది.
►ది జర్నల్‌ ఆఫ్‌ నేషనల్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక ప్రకారం.. ఎక్కువగా కూర్చోవడం పెద్దపేగు కేన్సర్‌ ప్రమాదాన్ని 24 శాతం, ఊపిరితిత్తుల కేన్సర్‌ ప్రమాదాన్ని 21 శాతం, ఎండోమెట్రియల్‌ కేన్సర్‌ ప్రమాదాన్ని 24 శాతం వరకు పెంచుతోంది. కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌కు దారి తీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు దూరం
►కంప్యూటర్‌ ముందు కూర్చున్న­ప్పుడు వెన్నెముక కుర్చీకి ఆసాంతం ఆనుకు­నేలా నిటారుగా కూర్చోవాలి. కళ్లకు, స్క్రీన్‌కు మధ్య తగినంత దూరం ఉండేలా ఉంచుకోవాలి. పాదాలను నేలపై విశ్రాంతిగా ఆనించి ఉంచి మోకాలి వద్ద 90 డిగ్రీల కోణంలో కాళ్లు ఉంచాలి.
►మోచేయి ఎక్కువగా ఒత్తిడికి గురికా­వడం వల్ల కలిగే ‘టెన్నిస్‌ ఎల్బో’ సమస్య డెస్క్‌ జాబ్‌ ఉద్యోగుల్లో పెరుగుతోంది. ఈ పరిస్థితిలో కీబోర్డు, మౌస్‌లను విని­యోగించేప్పుడు మణికట్టును వదులుగా ఉంచాలి.
►45 నిమిషాల నుంచి గంట కంటే ఎక్కు వసేపు నిర్విరామంగా కూర్చోవడం మంచిది కాదు. మధ్య మధ్యలో నిల­బడటం,  నడవటం చేయాలి.
►పని సమయంలో కాఫీలు/టీలు ఎక్కువ­గా తాగడం వల్ల డీహైడ్రేషన్‌ అవకాశాలు పెరుగుతాయి.
►ప్రతి 20 నిమిషాల పాటు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌పై పనిచేశాక.. కనీసం 20 సెకన్లపాటు మీకు దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. దీనివల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది.
– డాక్టర్‌ సుధీంద్ర, కిమ్స్‌ ఆస్పత్రి వైద్యుడు

ముందే గుర్తించా..
కంప్యూటర్‌ ముందు పనిచేయడం మొదలెట్టిన కొన్నినెలల్లోనే ఆరోగ్యంలో తేడా గమనించాను. వేళ్ల తిమ్మిర్లు, నొప్పులు, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు వచ్చాయి. డాక్టర్‌ను కలిసి వారి సూచనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేస్తున్నా. ఇప్పుడు సమస్యలు తగ్గిపోయాయి. మా సీనియర్లలో చాలా మంది మాత్రం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు.
– స్రవంతి, ప్రైవేటు ఉద్యోగిని

హెల్త్‌ సెషన్స్‌ జరుగుతున్నాయి
మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలు కార్పొరేట్‌ సంస్థల ఉద్యోగుల్లో ఇప్పుడు సాధారణమైపోయాయి. అనేకమంది జాబ్స్‌ వదిలేసి సొంత ఉపాధి వైపు మళ్లుతుండటానికి ఇదో కారణం కూడా. అందుకే ఆఫీసుల్లోనే ఆరోగ్యంపై వర్క్‌షాప్స్‌ జరుగుతున్నాయి.
– సంతోష్, ఐటీ ఉద్యోగి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement