
ప్ర: నేను స్మార్ట్‌ఫోన్‌ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటాను. బ్యాంకింగ్ వ్యవహారాలకూ, ఆఫీస్ కమ్యూనికేషన్స్ వేగంగా టైప్ చేయడంతో పాటు చాలా కీస్ నా బొటనవేలితో నొక్కుతుంటాను. ఈమధ్య ఆ వేలు చాలా నొప్పిగా ఉంటోంది. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడటం వల్లనే వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఇదేమైన సమస్యా? నా బొటనవేలి నొప్పి తగ్గడానికి మార్గాలు చెప్పండి.
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బొటనవేలి నొప్పికి మీ సెల్‌ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించడమే కారణమనిపిస్తోంది. మీరు బ్లాక్‌బెర్రీ థంబ్ లేదా గేమర్స్ థంబ్ అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీన్నే వైద్యపరిభాషలో ‘డీ–క్వెర్‌వెయిన్ సిండ్రోమ్ అని అంటారు. మనం మన స్మార్ట్ ఫోన్‌ను వాడేటప్పుడు బొటనవేలిని మాటిమాటికీ ఉపయోగిస్తుంటాం. దాంతో బొటనవేలి వెనకభాగంలో ఉన్న టెండన్ ఇన్‌ఫ్లమేషన్‌కు గురై వాపు వస్తుంది. మళ్లీ అదేపనిగా దాన్ని ఉపయోగించడం వల్ల ఆ గాయం మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటుంది. ఫలితంగా ఈ సమస్య వస్తుంది. మీలా సెల్‌ఫోన్‌ను చాలా ఎక్కువగా వాడేవారు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ తరహా నొప్పిని చాలావరకు నివారించుకోవచ్చు. ఆ జాగ్రత్తలివే...
►టైపింగ్ లేదా టెక్ట్స్ మెటీరియల్ పంపడం కోసం ఒక బొటన వేలినే కాకుండా ఇతర వేళ్లను కూడా మార్చి మార్చి ఉపయోగిస్తూ బొటనవేలిపై పడే భారాన్ని తగ్గించడం.
►ఫోన్‌ను ఒక చేత్తో పట్టుకొని మరో చేతి బొటనవేలిని ఉపయోగించే బదులు, దాన్ని ఒక ఉపరితలం మీద పెట్టి ఇరుచేతుల వేళ్లను మార్చి ఉపయోగిస్తూ ఉండటం.
►మణికట్టును చాలా రిలాక్స్‌గా ఉంచి వీలైనంత వరకు మణికట్టుపై భారం పడకుండా చూడటం.
►మీ స్మార్ట్‌ఫోన్‌ను ఒళ్లో పెట్టుకొని ఉండకుండా, కాస్త ఛాతీ భాగం వద్ద ఉండేలా చూసుకోవడం. ఒళ్లో పెట్టుకోవడం వల్ల కంటి మీద, ఒంగి స్క్రీన్ చూస్తూ ఉండటంతో మెడ మీద భారం పడుతుంది. అదే ఫోన్‌ను ఛాతీ వద్ద పెట్టుకుంటే అన్నివిధాలా సౌకర్యంగా ఉంటుంది.
►ఫోన్‌ను శరీరానికి ఏదో ఒక వైపున ఉంచకుండా మధ్యన ఉంచడం. దీని వల్ల శరీరం అసహజ భంగిమలో ఒంగకుండా బ్యాలెన్స్‌తో ఉంటుంది.
ఇక ఈ జాగ్రత్తలతో పాటు మరికొన్ని జాగ్రత్తలూ అవసరం. అవి...
►ఫోన్ ఉపయోగించే సమయాన్ని సాధ్యమైనంతగా తగ్గించడం.
►పొడవు పొడవు వాక్యాలు కాకుండా అర్థమయ్యేరీతిలో షార్ట్‌కట్స్ వాడుతూ బొటనవేలి ఉపయోగాన్ని తగ్గించడం. దీనివల్ల మీ బొటనవేలు, ఇతర వేళ్లు, మణికట్టుపై భారం తగ్గుతుంది.
►‘ఐ యామ్ ఇన్ మీటింగ్’ లాంటి కొన్ని రెడీమేడ్ వాక్యాలు ఉంటాయి. వాటి సహాయం తీసుకుంటే టైపింగ్ బాధ తగ్గడంతో పాటు, సమయమూ ఆదా అవుతుంది.
►ఎవరిపేరునైనా కనుగొనాలంటే పూర్తిగా స్క్రీన్ స్క్రోల్ చేస్తుండే బదులు షార్ట్‌కట్స్ ఉపయోగించడం ద్వారా సమయాన్నీ, బొటనవేలి ఉపయోగాన్నీ తగ్గించవచ్చు.
►అదేపనిగా ఫోన్ ఉపయోగించే వారు... ప్రతి 15 నిమిషాల్లో కనీసం 2–3 నిమిషాల పాటు మీ బొటనవేలికి విశ్రాంతినివ్వాలి. అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించండి.
డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్