ఇంట్లో కుక్క ఉందా?
పెట్టిల్లు
వర్షాకాలం వాతావరణ మార్పుల వల్ల మనం దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యల బారిన పడతాం. మరి మన పెంపుడు కుక్కల మాటేమిటి?! వాటికి ఈ కాలం ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
⇒ ఉదయం, సాయంత్రాలు బయట తిప్పినా కొద్దిగానైనా తడవక తప్పదు. అలాగే వదిలేస్తే ఈ కాలం బ్యాక్టీరియా వృద్ధి చెంది ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
⇒ అలాగని రోజూ స్నానం చేయించడం కుదరదు. అందుకని వాకింగ్ నుంచి తీసుకువచ్చిన తర్వాత బ్లో డ్రయ్యర్‌తో పూర్తిగా ఆరబెట్టండి. స్నానం చేయించిన ప్రతీసారి త్వరగా ఆరడానికి ఇదే చిట్కాను పాటించండి. అలాగే, స్నానానికి షాంపూ వాడితే మేలు.
⇒ బుజ్జి బుజ్జి కుక్కపిల్లల పాదాల దగ్గర చర్మం సున్నితంగా ఉంటుంది. ఇవి బయట తిరిగి, మురికి అలాగే ఉండిపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ కాలం వర్షంలో తడవకుండా ఉండేందుకు డాగ్స్‌కు కూడా షూస్ మార్కెట్లో ఉన్నాయి. వాటిని ట్రై చేయవచ్చు.
⇒ కుక్కల పడుకునే చోటు, వాటి బెడ్ శుభ్రంగా, తడి లేకుండా ఉండాలి. లేదంటే త్వరగా చెడువాసన వచ్చే అవకాశం ఉంది. అలాగే వాటికి పెట్టే ఆహారం, తినే పాత్రపై మూతలు పెట్టి ఉంచడం మేలు. క్రిములు వృద్ధి చెందడానికి అవకాశం లేని, పొడిగా ఉండే బెడ్‌ను ఈ కాలం ఏర్పాటు చేయాలి.
⇒ వర్షాకాలం చాలా వరకు కుక్కలకు చెవి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అవి గుబిలి కారణంగానూ కావచ్చు. అందుకని చెవుల బయట, లోపల కూడా పొడిగా ఉండాలి.
⇒ ఈ కాలం ఆరుబయట విహారం కుక్కలకు అంత మంచిది కాదు. ఇంటి లోపలే అవి ఆడుకునేందుకు వీలుగా స్థలాన్ని ఏర్పాటు చేయడం మంచిది. ఉదా: కార్ గ్యారేజ్, అపార్ట్‌మెంట్ కింది స్థలం, మెట్ల కింద.. గాలి, వెలుతురు బాగా ఉండే చోటు ఇలా...