సాక్షి, తూర్పుగోదావది: జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నా సాయంత్రం 6 గంటల నుంచి చలి తీవ్రత పెరుగుతోంది. ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే చాలామంది ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల దారి పడుతుండడం ఇందుకు నిదర్శనం. దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా బారిన పడుతున్నారు. గతంలో ఊపిరితిత్తులు, ఆస్తమా ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్న వారికి చలి తీవ్రత కారణంగా ఎక్కువ అవుతోంది. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణంలో మార్పులతో పాటు అల్పపీడన ప్రభావాలతో ఈ ఏడాది నవంబర్ రెండోవారం నుంచి నమోదు అవుతున్న తక్కువ ఉష్ణోగ్రతలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ చలికాలంలో సీజనల్ వ్యాధులతో పాటు ఆయాసం, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఉదయం జాగింగ్, వాకింగ్‌కు వెళ్లే వారి చర్మం పొడిబారి బిరుసుగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వీటితో పాటు కాళ్ల మడమలు, పెదాలు పగలడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్న పిల్లలపై చలి ప్రభావం ఎక్కువగా ఉండనుంది. వివిధ రుగ్మతలు ఉన్నవారు జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలో వ్యాధులు బారిన పడకుండా రక్షించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
గ్లిజరన్ సబ్బుల వాడకం మేలు
చలికాలంలో చర్మం తెల్లగా పొడిబారకుండా ఉండడానికి గ్లిజరిన్ సబ్బుల వాడితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుని తలస్నానం చేయాలి. వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడి బారుతుంది. గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి.
పాదాలు పగిలే ప్రమాదం
చలికాలంలో పాదాలు పగలడం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీటిలో పాదాలను పది నిమిషాలు ఉంచాలి. నీటిలో ఉంచిన తరువాత సబ్బుతో కడుక్కుని పొడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. పగిలిన చోట మాయిశ్చరైజర్ రాయాలి. విటమిన్–ఈ క్రీమ్ రాస్తే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సలహాలను పాటించాలి.
చిన్నారుల పట్ల జాగ్రత్తలు
చలికాలంలో చిన్నారులకు చలి నుంచి రక్షణకు స్వెటర్లను తొడిగించాలి. వేడి నీటితో స్నానం చేయించాలి. పిల్లలకు ఇచ్చే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి. చలికాలంలో రాత్రి వేళ తమ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లేవారు. పనుల నిమిత్తం బయటకు వచ్చే వారు ఉన్ని దుస్తులు ధరించాలి. బ్రాండెడ్ దుస్తులు అయితే మంచిది. బైక్‌పై వెళ్లేవారు మంకీక్యాప్, కాళ్లకు షూ, చేతులకు గ్లౌజ్‌లు ధరించాలి.
ఆస్తమా ఉంటే..
చలికాలంలో ఆస్తమా ఉన్నవారు నిత్యం వాడే మందులను సిద్ధంగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి పనులకు దూరంగా ఉండాలి. చల్లని గాలిలో తిరగవద్దు. శ్వాస నాళాలు మూసుకుపోకుండా వైద్యుడి సలహా మేరకు మందులు వాడాలి. ఇన్‌హేలర్, నెబ్యులైజర్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. గుండెజబ్బులు ఉన్న వారు, గుండె ఆపరేషన్ చేయించుకున్నవారు వాకింగ్ చేయకూడదు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
►చలిగాలులు వీస్తున్న సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఉంచాలి.
►శరీరానికి వేడిని కలిగించే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
►పొలం పనులకు వెళ్లేవారికి చలి వల్ల కాళ్లు, చేతులు దురదలు పెడుతుంటాయి. వ్యాజిలిన్, చర్మ క్రీములు రాసుకోవడం ఉత్తమం.
►శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా ఉండేందుకు పొడి దుస్తులను ధరించాలి.
►చలి తీవ్రతతో జలుబు బాగా వచ్చి ఊపిరి తీసుకునే అవకాశం ఉండదు. అలాంటప్పుడు నెబ్యులైజర్ వినియోగించుకోవాలి.
శ్వాసకోస వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలి
ఆస్తమా, టీబీ వ్యాధిగ్రస్తులు ఉదయం 8 గంటల వరకు సాయంత్రం 6 గంటల తరువాత బయటికి వెళ్లకూడదు. బయటికి వచ్చే సమయంలో మాస్కులు ధరించడం మేలు. గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే సమీప ప్రాంతాల్లోని వైద్య సిబ్బందిని ఆశ్రయించాలి. వేడి ఆహార పదార్థాలు, నీటిని స్వీకరించాలి. చిన్నపిల్లలకు న్యుమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి. చల్లటి వాతావరణంలో బయటకి వెళ్లకుండా చూడాలి. – డాక్టర్ కేవీఎస్ గౌరీశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి
జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా..
కనిష్టం గరిష్టం
మంగళవారం 23 29
బుధవారం 22 29
గురువారం 22 32
శుక్రవారం 20 29
శనివారం 19 32
ఆదివారం 19 28
సోమవారం 19 28
Comments
Please login to add a commentAdd a comment