కీళ్ల నొప్పులకు ఏ వ్యాయామం చేస్తే మంచిది ? | Precautions For Old Persons Suffering Bones Problem In Winter Season | Sakshi
Sakshi News home page

కీళ్లకు వింటర్‌ తంటా

Published Thu, Nov 28 2019 8:11 AM | Last Updated on Thu, Nov 28 2019 8:46 AM

Precautions For Old Persons Suffering Bones Problem In Winter Season   - Sakshi

చలికాలం వస్తుందంటేనే పెద్ద వయసు వారికి ఒకింత వణుకు. ఈ వణుకు చలి వల్ల వచ్చేది కాదు. ఈ సీజన్‌లో వాళ్లలో కీళ్లనొప్పులు మరీ ఎక్కువవుతాయి. అంతేకాదు... గౌట్, ఆర్థరైటిస్‌ వచ్చే నొప్పులు వింటర్‌లో మరింతగా పెరుగుతాయి. దీనికి చాలా కారణాలే ఉంటాయి. ఉదాహరణకు ఎండాకాలంలోలా చలికాలంలో సూర్యరశ్మి తగ్గుతుంది. దాంతో ఎముకలకు కావాల్సిన విటమిన్‌–డి కూడా తగ్గడం లాంటి కారణాలూ ఇందుకు దోహదపడతాయి. ఈ సీజన్‌లో పెరిగే కీళ్లనొప్పులు, కారణాలు, వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకొని జాగ్రత్త పడటం కోసమే ఈ కథనం. చలికాలంలో కీళ్ల నొప్పులు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని ఇవి... 

బయటి వాతావరణం చల్లగా ఉండటంతో దేహంలోని చర్మానికి ప్రసరించే రక్తం తన వేడిని వెంటనే కోల్పోతుంది. పైగా వాతావరణంలో చల్లదనం కంటిన్యువస్‌గా ఉండటం వల్ల చర్మం ఉపరితల భాగాల్లో ఉండే రక్తనాళాలు మామూలు కంటే కాస్త ఎక్కువగా కుంచించుకుపోయినట్లవుతుంది. ఈ కండిషన్‌ను వాసో కన్‌స్ట్రిక్షన్‌ అంటారు. వాసో కన్‌స్ట్రిక్షన్‌ కారణంగా కాళ్లూ చేతులు, దేహ ఉపరితల భాగాలకు రక్త ప్రసరణ కాస్తంత తగ్గుతుంది. ఈ కారణంగా ఈ సీజన్‌లో ఏదైనా భాగంలో నొప్పి, వాపు, మంట (ఇన్‌ఫ్లమేషన్‌) వచ్చినా లేదా ఆర్థరైటిస్‌ వంటి జబ్బుల్లో వచ్చే నొప్పులైనా... అవి తగ్గడానికి కూడా కాస్తంత ఎక్కువ సమయమే పడుతుంది. 

ఇక శరీరంలోని ఉపరితల భాగాలకు సైతం రక్తసరఫరా (చాలా çస్వల్పంగానైనా) ఒకింత తగ్గడం కారణంగా మామూలు నొప్పులతోపాటు కీళ్ల నొప్పులు సైతం మిగతా సమయాల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా మన శరీరం ఎప్పుడూ 98.4  డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉండేలా నిర్వహితమవుతుంటుంది. బయట చలి పెరిగిన కారణంగా ఒక్కోసారిగా ఇది 70 ప్లస్‌ లేదా 80 ప్లస్‌ డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పడిపోతుంది. ఇలా ఉష్ణోగ్రత పడిపోవడంతో మన దేహ రక్షణవ్యవస్థలో భాగంగా చర్మంలోని నొప్పిని గ్రహించి మెదడుకు చేరవేసే భాగాలు (పెయిన్‌ సెన్సర్స్‌) మరింత తీవ్రంగానూ, ఎక్కువగానూ పనిచేయాల్సి వస్తుంది. ఇలా మన పెయిన్‌ సెన్సర్స్‌ మరింతగా చురుగ్గా ఎక్కువగా పనిచేస్తుండటంతో చిన్నదెబ్బ తగిలినా కూడా మనకు చాలా నొప్పిగా అనిపిస్తుంది. 

ఈ సీజన్‌లో మనకు తెలియకుండానే ఆర్థరైటిస్‌ను అదుపు చేసేందుకు అనువైన జీవనశైలిని మనం అనుసరిస్తుంటాం. ఉదాహరణకు మనం ఈ సీజన్‌లో చురుకుదనం తగ్గుతుంది. కాస్త మందకొడిగా ఉంటాం. దాంతో ఆర్థరైటిస్‌ వంటి జబ్బులకు మనకు తెలియకుండానే అవకాశం ఇచ్చేలా మన జీవనశైలి ఉంటుంది.

ఈ సీజన్‌లో చలికి కీళ్లు బిగుసుకుపోవడం అన్నది చాలా సాధారణం. దాంతో వాటిల్లో కదలికలు బాగా తగ్గుతాయి. కదలికలు తగ్గిపోవడంతో ఎముకలకు రోజూ లభ్యమయ్యే వ్యాయామమూ దొరకదు. కీళ్లకు రక్తప్రసరణ వ్యవస్థ వల్ల గాక... మన వ్యాయామం, శరీర కదలికల వల్లనే పోషకాలు అందుతుంటాయి. దాంతో  వాటికి అవసరమైన పోషకాలు సరిగా అందవు.  కీళ్ల నొప్పులు పెరగడానికి ఇదీ ఒక కారణం. 

ఈ సీజన్‌లో ఉండే వాతావరణ పీడనం (బ్యారోమెట్రిక్‌ ప్రెషర్‌) పెరుగుతుంది. అంటే గాలి మందంగా మారి ఒత్తిడిని పెంచుతుంది. ఈ ఒత్తిడి కారణంగా కీళ్లు లేదా గాయం లేదా ఆర్థరైటిస్‌ చుట్టూ ఉండే ఇన్‌ఫ్లమేషన్‌ మరింత సెన్సిటివ్‌గా మారిపోతాయి. దాంతో ఈ వాతావరణ పీడనం కారణంగా కీళ్లు మరింత ఒత్తిడికి గురై నొప్పులు పెరుగుతాయి. 

చాలామందిలో చలికాలంలో నొప్పిని భరించే శక్తి (పెయిన్‌ టాలరెన్స్‌) తగ్గుతుంది. పెద్ద వయసు వారిలో ఇది మరింత ఎక్కువ. అందుకే వృద్ధుల్లో ఎప్పుడూ ఉండే మామూలు నొప్పులు సైతం ఈ కాలంలో మరింత పెరిగినట్లు అనిపిస్తాయి. ఈ కాలంలో సూర్యకాంతి, సూర్యరశ్మి తక్కువగా ఉంటాయి. దాంతో ఎముకల ఆరోగ్య నిర్వహణకు అవసరమైన విటమిన్‌–డి కూడా తగ్గుతుంది. అందుకే ఈ సీజన్‌లో ఫ్రాక్చర్లు అయితే అవి తగ్గడానికి మిగతా కాలాలతో పోలిస్తే ఒకింత ఎక్కువ సమయమే తీసుకుంటుంది.  

నొప్పిని తగ్గించేందుకు కొన్ని సూచనలివి..

  • ఈ సీజన్‌లో చాలామంది నీళ్లు తక్కువగా తాగడం వల్ల తేలిగ్గా డిహైడ్రేషన్‌కు గురవుతాయి. కాబట్టి వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగండి. ఇక ఒంటిని వెచ్చబరచుకోడానికి దోహదం కాఫీ, టీ వంటివి ఎక్కువగా తాగేస్తారు. పైగా దళసరిగా ఉండే మందపాటి దుస్తులు, స్వెటర్లు ధరిస్తారు. దాంతో మనకు తెలియకుండానే చెమట రూపంలో నీరు బయటకు వెళ్తుంది. ఈ అన్ని కారణాలతో శరీరంలో నీళ్లు, లవణాల పాళ్లు తగ్గుతాయి. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి. 
  • మోకాళ్లపై ఎలాంటి భారం పడకుండానే మంచి వ్యాయామాన్ని చేకూర్చే ఈదడం వంటి ప్రక్రియలు ఈ సీజన్‌లో చాలా మంచిది. మీకు సాధ్యమైనంత వరకు నేల మీద బాసిపట్లు (సక్లముక్లం) వేసి కూర్చోకుండా కుర్చీ మీదనే కూర్చునేలా జాగ్రత్తలు తీసుకోవడం, వెస్ట్రన్‌ టాయ్‌లెట్‌ను వాడటం, కుదిరినంతవరకు టేబుల్‌పైనే భోజనం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే నొప్పులను తేలిగ్గానే నివారించుకోవచ్చు. 
  • డాక్టర్‌ సలహా మేరకు విటమిన్‌–డి సప్లిమెంట్స్‌ వాడండి. ఒకవేళ మీరు ఆస్టియో ఆర్థరైటిస్‌ రోగులైతే చలి మీ జీవితాన్ని మరింత దుర్భరం చేస్తుంది కాబట్టి డాక్టర్‌ సలహా మేరకు విటమిన్‌–డి సప్లిమెంట్లు వాడండి. అలాగే ఆహారంలో అది ఎక్కువగా ఉండే వెన్న, పాలు వంటి పదార్థాలు ఈ సీజన్‌లో ఎక్కువగా తీసుకోండి. 
  • ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే ఒమెగా–3, ఒమెగా–6, ఒమెగా–9 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్స్‌ను ఆహారంలో తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. తరచూ ఒంటిని బాగా సాగదీస్తున్నట్లుగా చేసే స్ట్రెచింగ్‌ వ్యాయామాలతో నొప్పులు బాగా తగ్గుతాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉంటే ఇంట్లోనే స్టేషనరీ సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు చేయండి. కండరాలు రిలాక్స్‌ కావాలంటే గోరువెచ్చటి నువ్వుల నూనెతో తేలిగ్గా మసాజ్‌ చేసుకోవచ్చు. అయితే మసాజ్‌ బాగా తీవ్రంగా కాకుండా తేలిగ్గా చేసుకోవాలి.  
  • నొప్పిగా ఉన్న కీళ్లను ఉప్పు వేసిన గోరు వెచ్చటి నీళ్లలో కాసేపు మునిగి ఉండేలా చూడటం మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఐస్‌ కాపడంతోనూ నొప్పితగ్గుతుంది. అయితే చలికాలంలో అప్పటికే బాగా బయట బాగా చలిగా ఉన్న కారణంగా ఐస్‌ పెట్టడం మరింత బాధాకరంగా అనిపించవచ్చు. 
  • ఈ సీజన్‌లో మీకు దెబ్బలు తగలకుండా చూసుకోండి. బయటకు వెళ్తున్నప్పుడు మంచి షూస్‌ ధరించడం, వ్యాయామం చేస్తున్నప్పుడు మోకాళ్లకు ధరించే నీ–ప్యాడ్స్‌ వంటివి ధరించండి. ఈ సూచనలు పాటిస్తున్నా మీ కీళ్లనొప్పులు ఎంతకూ తగ్గకపోతే తప్పనిసరిగా డాక్టర్‌ను కలిసి తగిన మందులు వాడాలి. పైన పేర్కొన్న అన్ని జాగ్రత్తలు తీసుకొని, ఆ సూచనలన్నీ పాటించాక కూడా కీళ్లనొప్పులు వస్తుంటే మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి.  

కీళ్ల ఆరోగ్యానికి తక్కువ శ్రమతో ఎక్కువ వ్యాయామం ఎలా?
శరీరానికి శ్రమ కలిగించకుండానే తేలికపాటి కదలికలతో మనకు మంచి వ్యాయామం కలిగించే యాక్టివిటీస్‌ ఈ కింద ఉన్నాయి. మీకు వీలైనవాటిని ఎంచుకోండి. 

  • ఇండోర్స్‌లో ఎక్కువగా నడవడం. ఇందుకు తేలిక మార్గం ఏమిటంటే ఏదైనా షాపింగ్‌ మాల్‌ను ఎంచుకొని లోపల చాలాసేపు తిరగడం. అన్ని వస్తువులను పరిశీలిస్తూ అక్కడ వీలైనంత ఎక్కువగా నడుస్తుండండి. ∙ఇంట్లో పనులు చేయడం... అంటే ఇల్లు శుభ్రం చేయడం, వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను ఉపయోగించడం వంటివి. 
  • పిల్లలతో ఆడటం... ఇందులో కూర్చుని ఆడే ఆటలను మినహాయించాలి. ఇన్‌డోర్‌ స్విమ్మింగ్‌      ఇంట్లోనే తేలికపాటి మ్యూజిక్‌కు డాన్స్‌ చేయడం.   ఆఫీసులో లేదా మీరు వెళ్లినచోట లిఫ్ట్‌కు బదులు మెట్లనే ఉపయోగించడం. 
  • టీవీ చూస్తున్నప్పుడు కూర్చునే స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేయడం

నొప్పులను తగ్గించుకోవడం ఎలా?
ఈ సీజన్‌లో నొప్పి అనేది వస్తే దాన్ని పూర్తిగా నివారించలేకపోయినా తగ్గించుకోడానికి  కొన్ని ఉపశమన మార్గాలున్నాయి. అవి... 

  • బయట చలిగా ఉన్నప్పుడు శరీరానికి తగినంత ఉష్ణోగ్రత ఇచ్చే దుస్తులను  ధరించాలి. చేతులకు గ్లోవ్స్‌ వేసుకోవడం, కాళ్లకు సాక్స్‌ వేసుకోవడం మంచిది. ఆర్థరైటిస్‌ నొప్పులు ఉన్నవారు మోకాళ్లు, మోచేతుల వద్ద మరింత మందంగా ఉండే దుస్తులు వేసుకోవడం శ్రేయస్కరం. 
  • ఈ సీజన్‌లో ఆరుబయట కాకుండా వీలైతే ఇన్‌డోర్‌ వ్యాయామాలు చేయండి. శీతకాలం కీళ్ల నొప్పులు తగ్గాలంటే శ్రమ కలిగించని విధంగా తేలికపాటి వ్యాయామాలు, తగినంత శారీరక శ్రమ మంచి మార్గం. మన కీళ్లలో ఎప్పుడూ కదలికలు ఉండేలా చేసుకోవడం వల్ల కీళ్ల ఆరోగ్య నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. 
  • ఈ సీజన్‌లో వ్యాయామాలు తప్పనిసరి. వ్యాయామం సమయంలో మనం ఆహ్లాదంగా ఉండటానికి దోహదపడేదీ, మన ఒత్తిడిని గణనీయంగా తగ్గించేది అయిన  ఎండార్ఫిన్‌ అనే స్రావం శరీరంలోకి విడుదల అవుతుంది. ‘ఎండార్ఫిన్‌’లో నొప్పిని తగ్గించే గుణం చాలా ఎక్కువ. అందుకే ఈ సీజన్‌లో వ్యాయామం తప్పనిసరి. పైగా వ్యాయామం కారణంగా ఈ సీజన్‌లో సహజంగా మందగించే రక్త సరఫరా బాగా మెరుగవుతుంది. దాంతో నొప్పి సెన్సర్స్‌ కూడా మామూలుగా పనిచేస్తాయి. ఫలితంగా నొప్పి తగ్గుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement