old persons
-
అవి తగ్గడంతోనే రిస్క్ పెరిగింది
సాక్షి, హైదరాబాద్ : పెద్ద వయస్కులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు కరోనా బారిన పడటానికి కారణాలు వెల్లడయ్యాయి. శరీరంలోని జన్యువుల కార్యకలాపాల నియంత్రణతో పాటు బయటి నుంచి ప్రవేశించే వైరస్ ఆర్ఎన్ఏలపై దాడి చేయడంలో కీలక పాత్ర పోషించే మైక్రో ఆర్ఎన్ఏల క్షీణత వల్లే వారు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. వయసు పెరుగుదలతో పాటు, గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, కిడ్నీ, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా శరీరంలోని మైక్రో ఆర్ఎన్ఏల తగ్గుదలతో రోగ నిరోధకశక్తి తగ్గి పెద్ద వయస్కులు కరోనా బారినపడే ప్రమాదం ఎక్కువున్నట్లు వెల్లడైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, అగస్టా యూనివర్సిటీ, ఇతర పరిశోధన సంస్థలు నిర్వహించిన ఈ అధ్యయనం ‘ద జర్నల్ ఆఫ్ ఏజింగ్ అండ్ డిసీజ్’తాజా సంచికలో ప్రచురితమైంది. మొత్తం 17 దేశాల నుంచి సేకరించిన సార్స్ సంబంధిత 4 శాంపిళ్లు, ప్రస్తుత కరోనా కారక సార్స్ సీవోవీ2కు సంబంధించిన 29 నమూనాలపై ఈ మైక్రో ఆర్ఎన్ఏలను ప్రయోగించారు. వీటిలో సార్స్ జీనోమ్‌ను 848 మైక్రో ఆర్ఎన్ఏలు, సార్స్ సీవోవీ 2 జీనోమ్‌ను 873 మైక్రో ఆర్ఎన్ఏలు దాడి చేసినట్లు సైంటిస్ట్‌లు వెల్లడించారు. మనుషుల్లోని ఈ మైక్రో ఆర్ఎన్ఏలు దాడిచేసే వైరస్ల ఆర్ఎన్ఏలను తెంపుతున్నట్లుగా, ఈ వైరస్ శరీరంలోని కణాల్లోకి ప్రవేశించినప్పుడు కూడా ఈ మైక్రో ఆర్ఎన్ఏలు ముందుండి పోరాడుతున్నట్లు తేలిందన్నారు. అయితే వయసుతో పాటు దీర్ఘకాల అనారోగ్య సమస్యల కారణంగా మైక్రో ఆర్ఎన్ఏల సంఖ్య క్షీణత వల్ల వైరస్‌లపై స్పందించే శక్తి తగ్గిపోతున్నట్లు అధ్యయనంలో కీలక పాత్ర పోషించిన కార్లోస్ తెలిపారు. ఈ కారణం గా పెద్ద వయసు వారి శరీరంలోకి కరోనా ప్రవేశించాక ప్రతిఘటన లేకపోవడంతో కణ యంత్రాంగాన్ని కైవశం చేసుకుని తన బలాన్ని పెంచుకుని ప్రధాన అవయవాలపై దాడి చేస్తున్నట్లు స్పష్టమైందన్నారు. -
కీళ్ల నొప్పులకు ఏ వ్యాయామం చేస్తే మంచిది ?
చలికాలం వస్తుందంటేనే పెద్ద వయసు వారికి ఒకింత వణుకు. ఈ వణుకు చలి వల్ల వచ్చేది కాదు. ఈ సీజన్లో వాళ్లలో కీళ్లనొప్పులు మరీ ఎక్కువవుతాయి. అంతేకాదు... గౌట్, ఆర్థరైటిస్ వచ్చే నొప్పులు వింటర్లో మరింతగా పెరుగుతాయి. దీనికి చాలా కారణాలే ఉంటాయి. ఉదాహరణకు ఎండాకాలంలోలా చలికాలంలో సూర్యరశ్మి తగ్గుతుంది. దాంతో ఎముకలకు కావాల్సిన విటమిన్–డి కూడా తగ్గడం లాంటి కారణాలూ ఇందుకు దోహదపడతాయి. ఈ సీజన్లో పెరిగే కీళ్లనొప్పులు, కారణాలు, వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకొని జాగ్రత్త పడటం కోసమే ఈ కథనం. చలికాలంలో కీళ్ల నొప్పులు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని ఇవి... బయటి వాతావరణం చల్లగా ఉండటంతో దేహంలోని చర్మానికి ప్రసరించే రక్తం తన వేడిని వెంటనే కోల్పోతుంది. పైగా వాతావరణంలో చల్లదనం కంటిన్యువస్‌గా ఉండటం వల్ల చర్మం ఉపరితల భాగాల్లో ఉండే రక్తనాళాలు మామూలు కంటే కాస్త ఎక్కువగా కుంచించుకుపోయినట్లవుతుంది. ఈ కండిషన్‌ను వాసో కన్‌స్ట్రిక్షన్ అంటారు. వాసో కన్‌స్ట్రిక్షన్ కారణంగా కాళ్లూ చేతులు, దేహ ఉపరితల భాగాలకు రక్త ప్రసరణ కాస్తంత తగ్గుతుంది. ఈ కారణంగా ఈ సీజన్లో ఏదైనా భాగంలో నొప్పి, వాపు, మంట (ఇన్ఫ్లమేషన్) వచ్చినా లేదా ఆర్థరైటిస్ వంటి జబ్బుల్లో వచ్చే నొప్పులైనా... అవి తగ్గడానికి కూడా కాస్తంత ఎక్కువ సమయమే పడుతుంది. ఇక శరీరంలోని ఉపరితల భాగాలకు సైతం రక్తసరఫరా (చాలా çస్వల్పంగానైనా) ఒకింత తగ్గడం కారణంగా మామూలు నొప్పులతోపాటు కీళ్ల నొప్పులు సైతం మిగతా సమయాల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా మన శరీరం ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారన్‌హీట్ ఉండేలా నిర్వహితమవుతుంటుంది. బయట చలి పెరిగిన కారణంగా ఒక్కోసారిగా ఇది 70 ప్లస్ లేదా 80 ప్లస్ డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పడిపోతుంది. ఇలా ఉష్ణోగ్రత పడిపోవడంతో మన దేహ రక్షణవ్యవస్థలో భాగంగా చర్మంలోని నొప్పిని గ్రహించి మెదడుకు చేరవేసే భాగాలు (పెయిన్ సెన్సర్స్) మరింత తీవ్రంగానూ, ఎక్కువగానూ పనిచేయాల్సి వస్తుంది. ఇలా మన పెయిన్ సెన్సర్స్ మరింతగా చురుగ్గా ఎక్కువగా పనిచేస్తుండటంతో చిన్నదెబ్బ తగిలినా కూడా మనకు చాలా నొప్పిగా అనిపిస్తుంది. ఈ సీజన్లో మనకు తెలియకుండానే ఆర్థరైటిస్‌ను అదుపు చేసేందుకు అనువైన జీవనశైలిని మనం అనుసరిస్తుంటాం. ఉదాహరణకు మనం ఈ సీజన్లో చురుకుదనం తగ్గుతుంది. కాస్త మందకొడిగా ఉంటాం. దాంతో ఆర్థరైటిస్ వంటి జబ్బులకు మనకు తెలియకుండానే అవకాశం ఇచ్చేలా మన జీవనశైలి ఉంటుంది. ఈ సీజన్లో చలికి కీళ్లు బిగుసుకుపోవడం అన్నది చాలా సాధారణం. దాంతో వాటిల్లో కదలికలు బాగా తగ్గుతాయి. కదలికలు తగ్గిపోవడంతో ఎముకలకు రోజూ లభ్యమయ్యే వ్యాయామమూ దొరకదు. కీళ్లకు రక్తప్రసరణ వ్యవస్థ వల్ల గాక... మన వ్యాయామం, శరీర కదలికల వల్లనే పోషకాలు అందుతుంటాయి. దాంతో వాటికి అవసరమైన పోషకాలు సరిగా అందవు. కీళ్ల నొప్పులు పెరగడానికి ఇదీ ఒక కారణం. ఈ సీజన్లో ఉండే వాతావరణ పీడనం (బ్యారోమెట్రిక్ ప్రెషర్) పెరుగుతుంది. అంటే గాలి మందంగా మారి ఒత్తిడిని పెంచుతుంది. ఈ ఒత్తిడి కారణంగా కీళ్లు లేదా గాయం లేదా ఆర్థరైటిస్ చుట్టూ ఉండే ఇన్ఫ్లమేషన్ మరింత సెన్సిటివ్‌గా మారిపోతాయి. దాంతో ఈ వాతావరణ పీడనం కారణంగా కీళ్లు మరింత ఒత్తిడికి గురై నొప్పులు పెరుగుతాయి. చాలామందిలో చలికాలంలో నొప్పిని భరించే శక్తి (పెయిన్ టాలరెన్స్) తగ్గుతుంది. పెద్ద వయసు వారిలో ఇది మరింత ఎక్కువ. అందుకే వృద్ధుల్లో ఎప్పుడూ ఉండే మామూలు నొప్పులు సైతం ఈ కాలంలో మరింత పెరిగినట్లు అనిపిస్తాయి. ఈ కాలంలో సూర్యకాంతి, సూర్యరశ్మి తక్కువగా ఉంటాయి. దాంతో ఎముకల ఆరోగ్య నిర్వహణకు అవసరమైన విటమిన్–డి కూడా తగ్గుతుంది. అందుకే ఈ సీజన్లో ఫ్రాక్చర్లు అయితే అవి తగ్గడానికి మిగతా కాలాలతో పోలిస్తే ఒకింత ఎక్కువ సమయమే తీసుకుంటుంది. నొప్పిని తగ్గించేందుకు కొన్ని సూచనలివి.. ఈ సీజన్లో చాలామంది నీళ్లు తక్కువగా తాగడం వల్ల తేలిగ్గా డిహైడ్రేషన్కు గురవుతాయి. కాబట్టి వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగండి. ఇక ఒంటిని వెచ్చబరచుకోడానికి దోహదం కాఫీ, టీ వంటివి ఎక్కువగా తాగేస్తారు. పైగా దళసరిగా ఉండే మందపాటి దుస్తులు, స్వెటర్లు ధరిస్తారు. దాంతో మనకు తెలియకుండానే చెమట రూపంలో నీరు బయటకు వెళ్తుంది. ఈ అన్ని కారణాలతో శరీరంలో నీళ్లు, లవణాల పాళ్లు తగ్గుతాయి. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి. మోకాళ్లపై ఎలాంటి భారం పడకుండానే మంచి వ్యాయామాన్ని చేకూర్చే ఈదడం వంటి ప్రక్రియలు ఈ సీజన్లో చాలా మంచిది. మీకు సాధ్యమైనంత వరకు నేల మీద బాసిపట్లు (సక్లముక్లం) వేసి కూర్చోకుండా కుర్చీ మీదనే కూర్చునేలా జాగ్రత్తలు తీసుకోవడం, వెస్ట్రన్ టాయ్‌లెట్‌ను వాడటం, కుదిరినంతవరకు టేబుల్‌పైనే భోజనం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే నొప్పులను తేలిగ్గానే నివారించుకోవచ్చు. డాక్టర్ సలహా మేరకు విటమిన్–డి సప్లిమెంట్స్ వాడండి. ఒకవేళ మీరు ఆస్టియో ఆర్థరైటిస్ రోగులైతే చలి మీ జీవితాన్ని మరింత దుర్భరం చేస్తుంది కాబట్టి డాక్టర్ సలహా మేరకు విటమిన్–డి సప్లిమెంట్లు వాడండి. అలాగే ఆహారంలో అది ఎక్కువగా ఉండే వెన్న, పాలు వంటి పదార్థాలు ఈ సీజన్లో ఎక్కువగా తీసుకోండి. ఇన్ఫ్లమేషన్ను తగ్గించే ఒమెగా–3, ఒమెగా–6, ఒమెగా–9 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్‌ను ఆహారంలో తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. తరచూ ఒంటిని బాగా సాగదీస్తున్నట్లుగా చేసే స్ట్రెచింగ్ వ్యాయామాలతో నొప్పులు బాగా తగ్గుతాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉంటే ఇంట్లోనే స్టేషనరీ సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయండి. కండరాలు రిలాక్స్ కావాలంటే గోరువెచ్చటి నువ్వుల నూనెతో తేలిగ్గా మసాజ్ చేసుకోవచ్చు. అయితే మసాజ్ బాగా తీవ్రంగా కాకుండా తేలిగ్గా చేసుకోవాలి. నొప్పిగా ఉన్న కీళ్లను ఉప్పు వేసిన గోరు వెచ్చటి నీళ్లలో కాసేపు మునిగి ఉండేలా చూడటం మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఐస్ కాపడంతోనూ నొప్పితగ్గుతుంది. అయితే చలికాలంలో అప్పటికే బాగా బయట బాగా చలిగా ఉన్న కారణంగా ఐస్ పెట్టడం మరింత బాధాకరంగా అనిపించవచ్చు. ఈ సీజన్లో మీకు దెబ్బలు తగలకుండా చూసుకోండి. బయటకు వెళ్తున్నప్పుడు మంచి షూస్ ధరించడం, వ్యాయామం చేస్తున్నప్పుడు మోకాళ్లకు ధరించే నీ–ప్యాడ్స్ వంటివి ధరించండి. ఈ సూచనలు పాటిస్తున్నా మీ కీళ్లనొప్పులు ఎంతకూ తగ్గకపోతే తప్పనిసరిగా డాక్టర్‌ను కలిసి తగిన మందులు వాడాలి. పైన పేర్కొన్న అన్ని జాగ్రత్తలు తీసుకొని, ఆ సూచనలన్నీ పాటించాక కూడా కీళ్లనొప్పులు వస్తుంటే మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. కీళ్ల ఆరోగ్యానికి తక్కువ శ్రమతో ఎక్కువ వ్యాయామం ఎలా? శరీరానికి శ్రమ కలిగించకుండానే తేలికపాటి కదలికలతో మనకు మంచి వ్యాయామం కలిగించే యాక్టివిటీస్ ఈ కింద ఉన్నాయి. మీకు వీలైనవాటిని ఎంచుకోండి. ఇండోర్స్‌లో ఎక్కువగా నడవడం. ఇందుకు తేలిక మార్గం ఏమిటంటే ఏదైనా షాపింగ్ మాల్‌ను ఎంచుకొని లోపల చాలాసేపు తిరగడం. అన్ని వస్తువులను పరిశీలిస్తూ అక్కడ వీలైనంత ఎక్కువగా నడుస్తుండండి. ∙ఇంట్లో పనులు చేయడం... అంటే ఇల్లు శుభ్రం చేయడం, వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించడం వంటివి. పిల్లలతో ఆడటం... ఇందులో కూర్చుని ఆడే ఆటలను మినహాయించాలి. ఇన్డోర్ స్విమ్మింగ్ ఇంట్లోనే తేలికపాటి మ్యూజిక్కు డాన్స్ చేయడం. ఆఫీసులో లేదా మీరు వెళ్లినచోట లిఫ్ట్‌కు బదులు మెట్లనే ఉపయోగించడం. టీవీ చూస్తున్నప్పుడు కూర్చునే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం నొప్పులను తగ్గించుకోవడం ఎలా? ఈ సీజన్లో నొప్పి అనేది వస్తే దాన్ని పూర్తిగా నివారించలేకపోయినా తగ్గించుకోడానికి కొన్ని ఉపశమన మార్గాలున్నాయి. అవి... బయట చలిగా ఉన్నప్పుడు శరీరానికి తగినంత ఉష్ణోగ్రత ఇచ్చే దుస్తులను ధరించాలి. చేతులకు గ్లోవ్స్ వేసుకోవడం, కాళ్లకు సాక్స్ వేసుకోవడం మంచిది. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు మోకాళ్లు, మోచేతుల వద్ద మరింత మందంగా ఉండే దుస్తులు వేసుకోవడం శ్రేయస్కరం. ఈ సీజన్లో ఆరుబయట కాకుండా వీలైతే ఇన్డోర్ వ్యాయామాలు చేయండి. శీతకాలం కీళ్ల నొప్పులు తగ్గాలంటే శ్రమ కలిగించని విధంగా తేలికపాటి వ్యాయామాలు, తగినంత శారీరక శ్రమ మంచి మార్గం. మన కీళ్లలో ఎప్పుడూ కదలికలు ఉండేలా చేసుకోవడం వల్ల కీళ్ల ఆరోగ్య నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. ఈ సీజన్లో వ్యాయామాలు తప్పనిసరి. వ్యాయామం సమయంలో మనం ఆహ్లాదంగా ఉండటానికి దోహదపడేదీ, మన ఒత్తిడిని గణనీయంగా తగ్గించేది అయిన ఎండార్ఫిన్ అనే స్రావం శరీరంలోకి విడుదల అవుతుంది. ‘ఎండార్ఫిన్’లో నొప్పిని తగ్గించే గుణం చాలా ఎక్కువ. అందుకే ఈ సీజన్లో వ్యాయామం తప్పనిసరి. పైగా వ్యాయామం కారణంగా ఈ సీజన్లో సహజంగా మందగించే రక్త సరఫరా బాగా మెరుగవుతుంది. దాంతో నొప్పి సెన్సర్స్ కూడా మామూలుగా పనిచేస్తాయి. ఫలితంగా నొప్పి తగ్గుతుంది. -
‘వందేళ్ల ఓటర్లపై పునః పరిశీలన’
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాల్లో వందేళ్లకు పైబడిన వయో వృద్ధుల ఓట్లపై పునఃపరిశీలన జరపాలని అన్ని జిలా కలెక్టర్లను ఆదేశిం చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ పేర్కొన్నారు. పరిశీలన ప్రక్రియ పూర్తయితే వెంటనే నకిలీ ఓట్లను తొలగిస్తా మని తెలిపారు. మరణ ధ్రువీకరణ రిజిస్టర్ ఆధారం గా ఓటరు జాబితాలను సరిచూస్తామన్నారు. ముం దస్తు ఎన్నికలకు జరుగుతున్న ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో మాట్లాడారు. ఓటర్ల జాబితాల్లో కొంత వరకు బోగస్ ఓటర్లున్నట్లు గుర్తించా మని చెప్పారు. ఓటర్ల జాబితాల్లో 70 లక్షల బోగస్ ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు విషయంలో స్పందించేందుకు నిరాకరించారు. 2014 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో 2.81 కోట్లు ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 2.61 కోట్లకు ఎలా తగ్గిందన్న అంశంపై పరిశీలన జరుపుతున్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించారని ఫిర్యాదు చేస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. -
వయోవృద్ధులకు 4 రోజులు ప్రత్యేక దర్శనం
తిరుమల: వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు ఈ నెలలో నాలుగు రోజులు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 10, 24 తేదీల్లో వయో వృద్ధులు, దివ్యాంగులు, 11, 25 తేదీల్లో చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఉదయం 10 గంటల స్లాట్‌కు 1000 టికెట్లు, మధ్యాహ్నం 2 గంటల స్లాట్‌కు 2000 టికెట్లు, 3 గంటల స్లాట్‌కు 1000 టికెట్లు జారీ చేయనున్నారు. గుర్తింపు పత్రం తప్పనిసరి.. ప్రత్యేక దర్శనానికి వచ్చేవారు టోకెన్లు తీసుకునేటప్పుడు ఆధార్ లేదా ఓటర్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. రాయితీపై 20 రూపాయలకు 2లడ్డూలు, 70 రూపాయలకు 4 లడ్డూలు తీసుకోవచ్చు. వెయిటింగ్ హాల్ నుంచి ప్రత్యేక క్యూ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. నడవలేని వారిని శ్రీవారి సహాయకులతో పంపుతారు. 5 సంవత్సరాల లోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సుప«థం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. -
అడిగితే ఆలోచిస్తారట!
సాక్షి, హైదరాబాద్: ఆయన పేరు రామారావు. గోదావరి జిల్లాకు చెందిన వృద్ధుడు. హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడి వద్దకు బంధువులతో కలసి వచ్చి.. తర్వాత నగరం నుంచి భద్రాచలానికి బయలుదేరారు. రాష్ట్ర ఆర్టీసీ బస్సులో ఎక్కి వయో వృద్ధుల రాయితీ టికెట్ అడిగారు. ‘అలాంటి వసతి లేదు’అంటూ కండక్టర్ బదులిచ్చాడు. దీంతో ఓ ఆర్టీసీ అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించారు. ఏపీఎస్ ఆర్టీసీలో రాయితీ ఉన్నప్పుడు మీరెందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించగా.. ‘అలాంటి రాయితీ కావాలంటూ ఇప్పటి వరకు ఆర్టీసీకి ఎలాంటి అర్జీలు రాలేదు. వస్తే పరిశీలిస్తాం’అని ఆ అధికారి అనటంతో కంగుతినడం ఈయన వంతైంది. చాలా రాష్ట్రాల్లో ఉన్నా.. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ రవాణా సంస్థలు వృద్ధులకు రాయితీని అమలు చేస్తున్నాయి. రైల్వే శాఖ టికెట్ ధరలో 40 శాతం రాయితీ కల్పించింది. కానీ రాష్ట్ర ఆర్టీసీలో మాత్రం వృద్ధులకు ఎలాంటి ప్రత్యేక వెసులుబాటు లేదు. తీవ్ర నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీ.. ఆదాయాన్ని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇప్పటి వరకు ఈ రాయితీ అంశంపై దృష్టి సారించలేదు. ఆదాయాన్ని పెంచుకు నేందుకు అనుసరించాల్సిన కొత్త పద్ధతులంటూ గతంలో కొందరు నిపుణులు కొన్ని సూచనలు చేశారు. అందులో వృద్ధులకు టికెట్ ధరపై రాయితీ ప్రకటించాలన్న అంశం కూడా ఉంది. రాయితీ ఇస్తున్నందున వృద్ధులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలకు ఆసక్తి చూపుతారని, వెంట కుటుంబ సభ్యులు కూడా ప్రయాణించటం వల్ల బస్సుల ఆక్యుపెన్సీ రేషియో మెరుగవుతుందనేది ఆ సూచనల సారాంశం. ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం.. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 25 శాతం మేర టికెట్ ధరపై రాయితీ వస్తోంది. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వృద్ధుల్లో చాలామంది ఏపీ బస్సుల్లో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 66 శాతం వరకు ఉంది. ఇలాంటి వెసులుబాట్లు కల్పిస్తే అది కనీసం 2 శాతం పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం తెలంగాణలో వృద్ధుల సంఖ్య 70 లక్షల వరకు ఉంది. అందులో సగం మంది ఆర్టీసీ బస్సులవైపు చూసినా అది సంస్థకు ఆర్థికంగా కొంతమేర మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆర్టీసీలో విరమణ పొందిన ఉద్యోగులకు మాత్రమే రాయితీని వర్తింపజేస్తున్నారు. ఏడేళ్ల కిందటే తీర్మానం వాస్తవానికి రాష్ట్ర విభజనకు పూర్వమే ఈ అంశంపై ఆర్టీసీ బోర్డు తీర్మానించింది. కానీ దాన్ని అమలులోకి తీసుకురాలేదు. తాను బోర్డు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో తీర్మానం చేశామని, వృద్ధులకు 25 శాతం మేర రాయితీ ఇవ్వాలని అనుకున్నా ఓ ఉన్నతాధికారి దాన్ని అమలు చేయలేదని ఎన్ఎంయూ నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇప్పుడు దాన్ని అమలు చేస్తే వృద్ధులను గౌరవించుకున్నట్టు ఉండటంతోపాటు సంస్థకు మేలు జరుగుతుందని చెప్పారు. -
బ్యాంకుల్లో చోరీలు
ఉంగుటూరు : పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని బ్యాంకుల్లో చోరీలు పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే జిల్లాలోని మూడు బ్యాంకుల్లో సామాన్యుల డబ్బులు అపహరణకు గుయ్యాయి. బ్యాంకుల వద్ద జనం భారీగా గుమిగూడి ఉండడం దొంగలకు అనువుగా మారుతోంది. ఉంగుటూరు మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన వృద్ధుడు ములకల వెంకటేశ్వరరావు ఉంగుటూరులోని యూనియన్ బ్యాంకుకు వచ్చాడు. ధాన్యం అమ్మగా వచ్చిన రూ.35వేలను తన ఖాతాలో జమ చేసుకోవడానికి బ్యాంకులో ఉన్న ఇద్దరు యువకుల సాయాన్ని కోరాడు. వారిలో ఓ యువకుడితో వోచర్ పూర్తిచేయిస్తుండగా, మరో యువకుడు వృద్ధుడి సంచిలోని డబ్బులు చోరీచేశాడు. ఆ తర్వాత డబ్బులు జమ చేసుకోవాలని వోచర్ ఇచ్చేసి ఇద్దరూ జారుకున్నారు. వెంకటేశ్వరరావు కౌంటరు దగ్గరకు వెళ్లి సంచిని చూసుకోగా, డబ్బులు కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ బాధితుడు బ్యాంకు అధికారుల దగ్గరకు వెళ్లగా, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించి నిందితుల గురించి ఆరా తీస్తున్నారు. ఇదే తరహాలో నారాయణ పురం స్టేట్‌బ్యాంకులోనూ చోరీ జరిగింది. అప్పారావుపేట గ్రామానికి చెందిన వృద్ధుడు పామర్తి తాతారావు రూ. 24వేలను తన ఖాతాలో జమ చేయటానికి నారాయణపురం స్టేట్ బ్యాంక్‌కు సోమవారం వచ్చాడు. ఆయన జేబులో ఉన్న మొత్తాన్ని దుండగులు చాకచక్యంగా చోరీ చేశారు. ఆ వృద్ధుడు బ్యాంకు కౌంటర్ వద్దకు వెళ్లి చూసుకోగా, డబ్బు లేదు. దీంతో బాధితుడు చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుట్టాయగూడెంలోనూ.. బుట్టాయగూడెం : పాత నోట్లు మార్చుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లిన ఓ వ్యక్తిని వద్ద దుండగులు రూ.23వేలతోపాటు రెండు చెక్‌లు చోరీ చేశారు. ఈ ఘటన సోమవారం బుట్టాయగూడెం విజయ బ్యాంక్‌లో జరిగింది. బాధితుని కథనం ప్రకారం.. మండలంలోని ముప్పినవారిగూడెంకు చెందిన తాళ్లూరి వెంకటేశ్వరరావు తన దగ్గర ఉన్న రూ.23వేల పాత నోట్లను ఒక సంచిలో పెట్టి వాటిని మార్చుకునేందుకు విజయబ్యాంక్‌కు వచ్చాడు. బ్యాంక్‌లో నోట్లను జమ చేసే విషయమై బ్యాంకర్లతో మాట్లాడుతూ కొద్దిసేపటికి తన వద్దనున్న సంచిని పరిశీలించాడు. అందులో రూ.23వేలతోపాటు రెండు ఖాళీ చెక్‌లు మాయమైనట్టు గుర్తించాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు చెప్పాడు.