బ్యాంకుల్లో చోరీలు
Published Tue, Nov 22 2016 2:07 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
ఉంగుటూరు : పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని బ్యాంకుల్లో చోరీలు పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే జిల్లాలోని మూడు బ్యాంకుల్లో సామాన్యుల డబ్బులు అపహరణకు గుయ్యాయి. బ్యాంకుల వద్ద జనం భారీగా గుమిగూడి ఉండడం దొంగలకు అనువుగా మారుతోంది. ఉంగుటూరు మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన వృద్ధుడు ములకల వెంకటేశ్వరరావు ఉంగుటూరులోని యూనియన్ బ్యాంకుకు వచ్చాడు. ధాన్యం అమ్మగా వచ్చిన రూ.35వేలను తన ఖాతాలో జమ చేసుకోవడానికి బ్యాంకులో ఉన్న ఇద్దరు యువకుల సాయాన్ని కోరాడు. వారిలో ఓ యువకుడితో వోచర్ పూర్తిచేయిస్తుండగా, మరో యువకుడు వృద్ధుడి సంచిలోని డబ్బులు చోరీచేశాడు. ఆ తర్వాత డబ్బులు జమ చేసుకోవాలని వోచర్ ఇచ్చేసి ఇద్దరూ జారుకున్నారు. వెంకటేశ్వరరావు కౌంటరు దగ్గరకు వెళ్లి సంచిని చూసుకోగా, డబ్బులు కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ బాధితుడు బ్యాంకు అధికారుల దగ్గరకు వెళ్లగా, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించి నిందితుల గురించి ఆరా తీస్తున్నారు. ఇదే తరహాలో నారాయణ పురం స్టేట్‌బ్యాంకులోనూ చోరీ జరిగింది. అప్పారావుపేట గ్రామానికి చెందిన వృద్ధుడు పామర్తి తాతారావు రూ. 24వేలను తన ఖాతాలో జమ చేయటానికి నారాయణపురం స్టేట్ బ్యాంక్‌కు సోమవారం వచ్చాడు. ఆయన జేబులో ఉన్న మొత్తాన్ని దుండగులు చాకచక్యంగా చోరీ చేశారు. ఆ వృద్ధుడు బ్యాంకు కౌంటర్ వద్దకు వెళ్లి చూసుకోగా, డబ్బు లేదు. దీంతో బాధితుడు చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బుట్టాయగూడెంలోనూ..
బుట్టాయగూడెం : పాత నోట్లు మార్చుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లిన ఓ వ్యక్తిని వద్ద దుండగులు రూ.23వేలతోపాటు రెండు చెక్‌లు చోరీ చేశారు. ఈ ఘటన సోమవారం బుట్టాయగూడెం విజయ బ్యాంక్‌లో జరిగింది. బాధితుని కథనం ప్రకారం.. మండలంలోని ముప్పినవారిగూడెంకు చెందిన తాళ్లూరి వెంకటేశ్వరరావు తన దగ్గర ఉన్న రూ.23వేల పాత నోట్లను ఒక సంచిలో పెట్టి వాటిని మార్చుకునేందుకు విజయబ్యాంక్‌కు వచ్చాడు. బ్యాంక్‌లో నోట్లను జమ చేసే విషయమై బ్యాంకర్లతో మాట్లాడుతూ కొద్దిసేపటికి తన వద్దనున్న సంచిని పరిశీలించాడు. అందులో రూ.23వేలతోపాటు రెండు ఖాళీ చెక్‌లు మాయమైనట్టు గుర్తించాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు చెప్పాడు.
Advertisement
Advertisement