మంథని, న్యూస్‌లైన్: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ ఏటీఎంలో జరిగిన సంఘటన ఖాతాదారులను ఆందోళకు గురి చేస్తోంది. అక్కడి కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై ఆంగంతకుడు వేట కత్తితో దాడి చేయడంతో మన జిల్లాలోని ఏటీఎంల రక్షణపై అందరి దృష్టి పడిం ది. ఎక్కడైనా ఏదేని సంఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత షరా మామూలే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, ఆంధ్రాబ్యాంకుతో పాటు ఇతర బ్యాంకులు తమ ఖాతాదారుల సౌకర్యార్థం ఏటీఎంలు నడుపుతున్నాయి. వాటి రక్షణకు సెక్యూరిటీ గార్డ్, కేర్‌టేకర్స్‌ను నియమించడంతో పాటు సీసీ కెమెరాలను కూడా అమర్చారు.
రక్షణ ఉన్న ఏటీఎంలో ఖాతాదారుల సొమ్ము, వ్యక్తులకు పెద్దగా ప్రమాదం లేకపోగా, సెక్యూరిటీ లేని చోట్ల మాత్రం ఖాతాదారులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు ఏటీఎంలలో దొంగతనాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సీఐఎస్ సెక్యూరిటీ కంపెనీ జిల్లాలో 26 ఎస్‌బీహెచ్ ఏటీఎంలకు కేర్‌టేకర్స్‌ను నియమించింది. చాలా కాలం సక్రమంగానే పనిచేసినా ఆ కంపెనీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బ్యాంకు గత ఏడాదిన్నర క్రితం సదరు కంపెనీకి కాంట్రాక్టు రద్దు చేసింది. తదుపరి మరో కంపెనీకి సెక్యూరిటీ బాధ్యతలు అప్పగించకపోవడంతో ఏటీఎంలకు పూర్తిగా రక్షణ కరువైంది. ఏటీఎంలలో ఉండే సీసీ కెమెరాలను ధ్వంసం చేసి లూఠీకి ప్రయత్నించిన సంఘటనలు కూడా వెలుగు చూశాయి. గోదావరిఖని లక్ష్మీనగర్ ఏటీఎం అద్దాలు ధ్వంసం చేసి మిషన్‌ను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా, సుల్తానాబాద్, సెంటనరీకాలనీలో ఇదే పరిస్థితి ఏర్పడింది. మంథని ఏటీఎంలో ఏకంగా సీసీ కెమెరాను అపహరించుకుపోయిన సంఘటన ఉంది. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో ఏటీఎంల వాడకంపై పెద్దగా అవగాహనలేని ఖాతాదారులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంలో తలెత్తుతున్న సాంకేతిక లోపంతో ఖాతాదారుల సొమ్ము గల్లంతవుతోంది. సీక్రెట్ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత సాంకేతిక లోపం ఏర్పడితే ఆ ఖాతాదారుడి సొమ్ము కొద్దిసేపటి వరకు బయటకు రావడంలేదు. తర్వాత కార్డును ఉపయోగించే ఖాతాదారుడికి అంతకంటే ముందుగా ఉపయోగించిన వారి డబ్బు చేతిలో పడుతుంది.
కార్డు వినియోగించడం తెలియని ఖాతాదారులు పక్క వ్యక్తి సాయంతో డబ్బులు డ్రా చేసుకుంటే సదరు వ్యక్తి అమాయకులైన ఖాతాదారుల నుంచి సీక్రెట్ కోడ్‌ను తెలుసుకోవడంతో పాటు కార్డును మార్చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత సంఘటనలే కాకుండా ఈ మధ్య ఏటీఎంలలో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. బెంగళూరులో జరిగిన సంఘటనతోనైనా జిల్లాలోని ఏటీఎంల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలను మూసివేయాలని ఖాతాదారులు కోరుతున్నారు.
మన ఏటీఎంల భద్రత ఎంత?
Published Fri, Nov 22 2013 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
Advertisement
Advertisement