
సాక్షి, హైదరాబాద్ : పెద్ద వయస్కులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు కరోనా బారిన పడటానికి కారణాలు వెల్లడయ్యాయి. శరీరంలోని జన్యువుల కార్యకలాపాల నియంత్రణతో పాటు బయటి నుంచి ప్రవేశించే వైరస్ ఆర్‌ఎన్‌ఏలపై దాడి చేయడంలో కీలక పాత్ర పోషించే మైక్రో ఆర్‌ఎన్‌ఏల క్షీణత వల్లే వారు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. వయసు పెరుగుదలతో పాటు, గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, కిడ్నీ, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా శరీరంలోని మైక్రో ఆర్‌ఎన్‌ఏల తగ్గుదలతో రోగ నిరోధకశక్తి తగ్గి పెద్ద వయస్కులు కరోనా బారినపడే ప్రమాదం ఎక్కువున్నట్లు వెల్లడైంది.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, అగస్టా యూనివర్సిటీ, ఇతర పరిశోధన సంస్థలు నిర్వహించిన ఈ అధ్యయనం ‘ద జర్నల్ ఆఫ్ ఏజింగ్ అండ్ డిసీజ్’తాజా సంచికలో ప్రచురితమైంది. మొత్తం 17 దేశాల నుంచి సేకరించిన సార్స్ సంబంధిత 4 శాంపిళ్లు, ప్రస్తుత కరోనా కారక సార్స్ సీవోవీ2కు సంబంధించిన 29 నమూనాలపై ఈ మైక్రో ఆర్‌ఎన్‌ఏలను ప్రయోగించారు. వీటిలో సార్స్ జీనోమ్‌ను 848 మైక్రో ఆర్‌ఎన్‌ఏలు, సార్స్ సీవోవీ 2 జీనోమ్‌ను 873 మైక్రో ఆర్‌ఎన్‌ఏలు దాడి చేసినట్లు సైంటిస్ట్‌లు వెల్లడించారు. మనుషుల్లోని ఈ మైక్రో ఆర్‌ఎన్‌ఏలు దాడిచేసే వైరస్‌ల ఆర్‌ఎన్‌ఏలను తెంపుతున్నట్లుగా, ఈ వైరస్ శరీరంలోని కణాల్లోకి ప్రవేశించినప్పుడు కూడా ఈ మైక్రో ఆర్‌ఎన్‌ఏలు ముందుండి పోరాడుతున్నట్లు తేలిందన్నారు.
అయితే వయసుతో పాటు దీర్ఘకాల అనారోగ్య సమస్యల కారణంగా మైక్రో ఆర్‌ఎన్‌ఏల సంఖ్య క్షీణత వల్ల వైరస్‌లపై స్పందించే శక్తి తగ్గిపోతున్నట్లు అధ్యయనంలో కీలక పాత్ర పోషించిన కార్లోస్ తెలిపారు. ఈ కారణం గా పెద్ద వయసు వారి శరీరంలోకి కరోనా ప్రవేశించాక ప్రతిఘటన లేకపోవడంతో కణ యంత్రాంగాన్ని కైవశం చేసుకుని తన బలాన్ని పెంచుకుని ప్రధాన అవయవాలపై దాడి చేస్తున్నట్లు స్పష్టమైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment