సాక్షి, హైదరాబాద్: ఆయన పేరు రామారావు. గోదావరి జిల్లాకు చెందిన వృద్ధుడు. హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడి వద్దకు బంధువులతో కలసి వచ్చి.. తర్వాత నగరం నుంచి భద్రాచలానికి బయలుదేరారు. రాష్ట్ర ఆర్టీసీ బస్సులో ఎక్కి వయో వృద్ధుల రాయితీ టికెట్ అడిగారు. ‘అలాంటి వసతి లేదు’అంటూ కండక్టర్ బదులిచ్చాడు. దీంతో ఓ ఆర్టీసీ అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించారు. ఏపీఎస్ ఆర్టీసీలో రాయితీ ఉన్నప్పుడు మీరెందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించగా.. ‘అలాంటి రాయితీ కావాలంటూ ఇప్పటి వరకు ఆర్టీసీకి ఎలాంటి అర్జీలు రాలేదు. వస్తే పరిశీలిస్తాం’అని ఆ అధికారి అనటంతో కంగుతినడం ఈయన వంతైంది.
చాలా రాష్ట్రాల్లో ఉన్నా..
చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ రవాణా సంస్థలు వృద్ధులకు రాయితీని అమలు చేస్తున్నాయి. రైల్వే శాఖ టికెట్ ధరలో 40 శాతం రాయితీ కల్పించింది. కానీ రాష్ట్ర ఆర్టీసీలో మాత్రం వృద్ధులకు ఎలాంటి ప్రత్యేక వెసులుబాటు లేదు. తీవ్ర నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీ.. ఆదాయాన్ని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇప్పటి వరకు ఈ రాయితీ అంశంపై దృష్టి సారించలేదు.
ఆదాయాన్ని పెంచుకు నేందుకు అనుసరించాల్సిన కొత్త పద్ధతులంటూ గతంలో కొందరు నిపుణులు కొన్ని సూచనలు చేశారు. అందులో వృద్ధులకు టికెట్ ధరపై రాయితీ ప్రకటించాలన్న అంశం కూడా ఉంది. రాయితీ ఇస్తున్నందున వృద్ధులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలకు ఆసక్తి చూపుతారని, వెంట కుటుంబ సభ్యులు కూడా ప్రయాణించటం వల్ల బస్సుల ఆక్యుపెన్సీ రేషియో మెరుగవుతుందనేది ఆ సూచనల సారాంశం.
ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం..
ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 25 శాతం మేర టికెట్ ధరపై రాయితీ వస్తోంది. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వృద్ధుల్లో చాలామంది ఏపీ బస్సుల్లో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 66 శాతం వరకు ఉంది.
ఇలాంటి వెసులుబాట్లు కల్పిస్తే అది కనీసం 2 శాతం పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం తెలంగాణలో వృద్ధుల సంఖ్య 70 లక్షల వరకు ఉంది. అందులో సగం మంది ఆర్టీసీ బస్సులవైపు చూసినా అది సంస్థకు ఆర్థికంగా కొంతమేర మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆర్టీసీలో విరమణ పొందిన ఉద్యోగులకు మాత్రమే రాయితీని వర్తింపజేస్తున్నారు.
ఏడేళ్ల కిందటే తీర్మానం
వాస్తవానికి రాష్ట్ర విభజనకు పూర్వమే ఈ అంశంపై ఆర్టీసీ బోర్డు తీర్మానించింది. కానీ దాన్ని అమలులోకి తీసుకురాలేదు. తాను బోర్డు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో తీర్మానం చేశామని, వృద్ధులకు 25 శాతం మేర రాయితీ ఇవ్వాలని అనుకున్నా ఓ ఉన్నతాధికారి దాన్ని అమలు చేయలేదని ఎన్‌ఎంయూ నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇప్పుడు దాన్ని అమలు చేస్తే వృద్ధులను గౌరవించుకున్నట్టు ఉండటంతోపాటు సంస్థకు మేలు జరుగుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment