Neck problems
-
సెల్ రోగం..అధికమవుతున్న టెక్స్ట్ నెక్ సిండ్రోమ్
ప్రస్తుత పరిస్థితుల్లో సెల్‌ఫోన్ లేకపోతే ఏ ఒక్క పని జరగని పరిస్థితి. సెల్‌ఫోన్ వల్ల జరిగే మంచిని అటుంచితే... ఇప్పటికే చాలామంది ఎక్కువగా మొబైల్ఫోన్లు వినియోగిస్తూ రకరకాల రుగ్మతల బారిన పడుతున్నారు. కంటి సమస్యలతో కొందరు, గేమింగ్‌కు బానిసలై మరికొందరు, మానసిక సమస్యలతో కూడా ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. తాజాగా ‘టెక్ట్స్ నెక్ సిండ్రోమ్’ (మెడకు సంబంధించిన నొప్పి) పట్టిపీడిస్తోంది. ఉరవకొండకు చెందిన ఓ యువతి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతోంది. తల ఓవైపునకు వంచినట్టు ఉందని బాధపడుతుంటే తల్లిదండ్రులు డాక్టర్‌కు చూపించారు. ఈమె ఎక్కువగా సెల్‌ఫోన్ వాడటం వల్ల ఇలా జరిగిందని న్యూరో వైద్యులు చెప్పారు. ఇప్పుడామె నొప్పి భరించలేక ఆక్యుపేషనల్ థెరఫీ చేయిస్తోంది. అనంతపురానికి చెందిన అనీల్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అమెరికాలో కూడా పదేళ్లు పనిచేసి వచ్చారు. మొబైల్ ఫోన్ వాడకం పెరిగి ఆయనకు మెడనొప్పితో పాటు నడుమునొప్పి వచ్చింది. నగరంలోనే ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంత జిల్లాలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో ఎక్కువ మంది ‘టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ ’కు గురవుతున్నట్లు తేలింది. దీనివల్ల మెడ వంకర్లు పోవడం, మెడనొప్పి రావడం, తలెత్తుకు తిరగలేకపోవడం జరుగుతోంది. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ ఎర్గొనోమిక్స్ అనే జర్నల్ టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ పెద్ద భూతంలా వేధిస్తోందని వెల్లడించింది. ఈ సిండ్రోమ్ కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటోందని వైద్యులు చెబుతున్నారు. ఏమిటీ టెక్ట్స్ నెక్ సిండ్రోమ్? టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ అనేది వైరసో, బాక్టీరియానో కాదు. తదేకంగా సెల్‌ఫోన్‌ను వాడుతున్న వారికి వచ్చే ప్రత్యేక జబ్బు. స్మార్ట్ఫోన్లు వాడుతున్న వారిలో ఈ పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా టెక్ట్స్ మెసేజ్‌లు ఎక్కువ సేపు చూస్తూండటం వల్ల మెడ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తేలింది. దీంతో మెడ కండరాలు, నరాలు ఒత్తిడికి గురై నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి. దీనివల్ల విపరీతమైన తలనొప్పి, భుజాల నొప్పి రావడం, ఇది ఇలాగే కొనసాగి, తొడ నుంచి పాదం వరకూ జాలుగా నొప్పిరావడం వంటివి జరుగుతున్నాయి. నిద్రలేమి, మానసిక ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నారు. టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ నుంచి బయట పడండిలా... రెండు, మూడు నిముషాలకు కంటే ఎక్కువగా మెడలు వంచి సెల్ఫోన్లో మెసేజ్‌లు చూడకూడదు. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారు పదే పదే మెడను రొటేట్ అంటే కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి తిప్పుతూ ఉండాలి. ప్రతి గంటకోసారి రెండు మూడు సార్లు తలను పైకెత్తి మళ్లీ కిందికి బలవంతంగా వంచాలి. మెసేజ్‌ను చదవాలనుకున్నప్పుడు కుర్చీలో వెనక్కు వాలి ఫోన్‌ను ముఖంపైకి తెచ్చుకుని చదువుకోవాలి. పెద్ద పెద్ద మెసేజ్‌లు ఉన్నప్పుడు అంతా ఒకేసారి చదవకుండా మధ్యలో విరామం తీసుకుని మెడ వ్యాయామం చేయాలి. రోజూ యోగాసనాలు చేస్తే కండరాలు, నరాల వ్యవస్థ సానుకూలంగా మారి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. వ్యాయామమే పరిష్కారం చాలామంది టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ గురై మెడనొప్పి తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. ఇది కరెక్టు కాదు. దీనివల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గచ్చుగానీ, భవిష్యత్‌లో ప్రమాదం ఎక్కువ. తలకు, మెడకు సంబంధించి వ్యాయామం మంచిది. యోగా వల్ల చాలా వరకు నొప్పిని నియంత్రించుకోవచ్చు. – జె.నరేష్‌బాబు, మెడ, వెన్నుపూస వైద్య నిపుణులు తక్కువ సేపు వాడాలి మొబైల్ ఫ్లోన్లు చిన్నతనం నుంచే అలవాటు పడిన చాలామంది పిల్లలు ఇప్పటికే దృష్టిలోపంతో బాధపడుతున్నారు. గంటల తరబడి ఫోన్ చూడటం వల్ల సున్నితమైన కంటికి సంబంధించి అవయవాలు దెబ్బతింటున్నాయి. వీలైనంత తక్కువ సేపు వాడటం మంచిది. – పల్లంరెడ్డి నివేదిత, కంటివైద్య నిపుణురాలు ఉచ్చులో ఇరుక్కుపోయారు ఓ వైపు మెడనొప్పి, నడుమునొప్పులే కాదు.. రాత్రిళ్లు ఎక్కువగా మొబైల్ వాడి గేమింగ్, బెట్టింగ్‌ల కారణంగా వ్యసనాలకు లోనయ్యారు. నిద్రలేమి కారణంగా మెంటల్ కండీషన్ ఇన్‌బ్యాలెన్స్ అవుతోంది. చాలా మందికి చదువుమీద దృష్టి పోతోంది. మానసిక బలహీనతల వల్ల డ్రగ్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. – డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్యనిపుణులు -
గంటల కొద్దీ కూర్చుని పని చేస్తున్నారా..? ఎంత డేంజర్ అంటే?
కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్నది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. కానీ కూర్చుని కదలకుండా పనిచేస్తే కొండంత ఆరోగ్య సమస్యలూ చుట్టుముడతాయన్నది నేటి సామెతగా మారింది. ఐటీతో పాటు అనేక రంగాల్లో కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే డెస్క్‌జాబ్స్ పెరిగిపోయాయి. ఆ ఉద్యోగాల్లో ఎక్కువసేపు కూర్చునే ఉండటం, పనిఒత్తిడి కారణంగా వివిధ రకాల వ్యాధులూ పెరిగి పోతున్నాయి. అందువల్ల పనిప్రదేశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ డెస్క్ వర్క్.. ‘డిస్క్’పై ఎఫెక్ట్.. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో శక్తి ఖర్చు తగ్గి కొవ్వు పేరుకుపోతోంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. ముందుకు వంగి కూర్చోవడం వల్ల వెన్నెముకపై ప్రభావం పడుతోంది. తొలుత పనిచేసేటప్పుడే ఈ ఒత్తిడి ఉంటుంది. తర్వాత పడుకున్పప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది. కొన్నేళ్లలో ఇది పూర్తి స్థాయి డిస్క్ సమస్యగా మారుతుంది. పనిచేసే చోట కూర్చునే తీరులో లోపాలు, దీర్ఘకాల పని గంటలే దీనికి కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. మణికట్టుపై ‘పని’కట్టు కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఈ సమస్య మణికట్టు దగ్గర వస్తుంది. మణికట్టు దగ్గర దాదాపు 15 చిన్నచిన్న కండరాలు ఉంటాయి. వీటిలో ఒక్క కండరానికి వాపు వచ్చినా మిగతా అన్నింటిపై ఒత్తిడి పడుతుంది. దీనితో చేతిలో తిమ్మిర్లులా రావడం, రాత్రి పడుకున్నప్పుడు వేళ్లు వణకడం వంటివి జరగొచ్చు. రోజంతా మౌస్, కీబోర్డు వాడి.. ఆ తర్వాత బైక్ హ్యాండిల్, కార్ స్టీరింగ్ పట్టుకోవాల్సిన అవసరం వల్ల మణికట్టు కండరాలు మరింత అధిక శ్రమకు గురవుతాయి. ఐటీ రంగంలో ఎక్కువగా.. ప్రముఖ వెల్నెస్ సంస్థ సోల్ హెల్త్‌కేర్ సంస్థ అధ్యయనం ప్రకారం.. ఐటీ రంగంలో ఆరోగ్య సమస్యలు బాగా పెరిగిపోయాయి. ఓ కంపెనీలో పనిచేసే 784 మందిని ఎంచుకుంటే.. అందులో 179 మంది నడుము నొప్పి, 129 మంది గర్భాశయం, వెన్నెముకలోని కీళ్లు/ డిస్క్‌లను ప్రభావితం చేసే గర్భాశయ స్పాండిలోసిస్, 65 మందిలో కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (చేతుల్లో తిమ్మిర్లు), 61 మందిలో సాక్రోలియాక్ సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. ►ఐటీ ఉద్యోగుల్లో గుండె జబ్బులు 147 శాతం ఎక్కువని, వీటితో మరణించే ప్రమాదం 18 శాతం పెరుగుతోందని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అధ్యయనంలో వెల్లడైంది. ►ది జర్నల్ ఆఫ్ నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. ఎక్కువగా కూర్చోవడం పెద్దపేగు కేన్సర్ ప్రమాదాన్ని 24 శాతం, ఊపిరితిత్తుల కేన్సర్ ప్రమాదాన్ని 21 శాతం, ఎండోమెట్రియల్ కేన్సర్ ప్రమాదాన్ని 24 శాతం వరకు పెంచుతోంది. కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే డీప్ వెయిన్ థ్రాంబోసిస్కు దారి తీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు దూరం ►కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు వెన్నెముక కుర్చీకి ఆసాంతం ఆనుకునేలా నిటారుగా కూర్చోవాలి. కళ్లకు, స్క్రీన్కు మధ్య తగినంత దూరం ఉండేలా ఉంచుకోవాలి. పాదాలను నేలపై విశ్రాంతిగా ఆనించి ఉంచి మోకాలి వద్ద 90 డిగ్రీల కోణంలో కాళ్లు ఉంచాలి. ►మోచేయి ఎక్కువగా ఒత్తిడికి గురికావడం వల్ల కలిగే ‘టెన్నిస్ ఎల్బో’ సమస్య డెస్క్ జాబ్ ఉద్యోగుల్లో పెరుగుతోంది. ఈ పరిస్థితిలో కీబోర్డు, మౌస్‌లను వినియోగించేప్పుడు మణికట్టును వదులుగా ఉంచాలి. ►45 నిమిషాల నుంచి గంట కంటే ఎక్కు వసేపు నిర్విరామంగా కూర్చోవడం మంచిది కాదు. మధ్య మధ్యలో నిలబడటం, నడవటం చేయాలి. ►పని సమయంలో కాఫీలు/టీలు ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ అవకాశాలు పెరుగుతాయి. ►ప్రతి 20 నిమిషాల పాటు కంప్యూటర్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై పనిచేశాక.. కనీసం 20 సెకన్లపాటు మీకు దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. దీనివల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. – డాక్టర్ సుధీంద్ర, కిమ్స్ ఆస్పత్రి వైద్యుడు ముందే గుర్తించా.. కంప్యూటర్ ముందు పనిచేయడం మొదలెట్టిన కొన్నినెలల్లోనే ఆరోగ్యంలో తేడా గమనించాను. వేళ్ల తిమ్మిర్లు, నొప్పులు, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు వచ్చాయి. డాక్టర్‌ను కలిసి వారి సూచనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేస్తున్నా. ఇప్పుడు సమస్యలు తగ్గిపోయాయి. మా సీనియర్లలో చాలా మంది మాత్రం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. – స్రవంతి, ప్రైవేటు ఉద్యోగిని హెల్త్ సెషన్స్ జరుగుతున్నాయి మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలు కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల్లో ఇప్పుడు సాధారణమైపోయాయి. అనేకమంది జాబ్స్ వదిలేసి సొంత ఉపాధి వైపు మళ్లుతుండటానికి ఇదో కారణం కూడా. అందుకే ఆఫీసుల్లోనే ఆరోగ్యంపై వర్క్‌షాప్స్ జరుగుతున్నాయి. – సంతోష్, ఐటీ ఉద్యోగి -
అబ్బా.. మెడనొప్పి
డాక్టర్స్ కాలమ్ తలకూ మొండేనికి మధ్య బాల్ బేరింగ్ లాంటిది మెడ. వాహనాలు నడపడంలో బాల్ బేరింగ్లు ఎంత ముఖ్యమైనవో మన శరీరంలో మెడకూడా అంతే. తిరుగుతున్నాయి కదా అని బేరింగ్లను ఎలాగ పడితే అలా తిప్పితే అవి ఎలా పాడైపోతాయో.. ఇష్టారాజ్యంగా తిప్పితే మెడ పరిస్థితీ అంతే. మెడ పనితీరు, దీని ప్రాధాన్యం అనేది నగరీకరణ జరుగుతున్న క్రమంలో బాగా తగ్గిపోవడంతో బాధితులు ఎక్కువయ్యారు. నడక, పడకల నుంచీ కూర్చునే కుర్చీలు, కూర్చునే తీరు అన్నీ మెడ నొప్పికి కారణాలవుతున్నాయి. కంప్యూటరీకరణ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు శిలల్లా మారి పనిచేయడం వల్ల మెడ నరాలు మొద్దుబారి.. కండరాలు పట్టేస్తున్నాయి. హైదరాబాద్‌లో చాలామంది ముప్పయ్ ఏళ్లు నిండకుండానే మెడ నొప్పితో బాధపడుతున్నారు. విధి నిర్వహణలో, వాహనాలు నడిపేటప్పుడు పక్కా ప్రిన్స్‌పుల్స్ ఫాలో కాకపోవడం మెడపై ఒత్తిడి పెరుగుతోంది. చిన్నపాటి మెడనొప్పే కదా అని అశ్రద్ధ చేస్తే.. తర్వాత స్పాండిలైటిస్, ఆ తర్వాత నెక్ సర్జరీ వరకూ వెళ్తోంది. మన పనితీరులో కొన్ని పద్ధతులు ఫాలో అయితే మెడను ఈజీగా కాపాడుకోవచ్చంటున్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డా.బి.సాంబశివారెడ్డి. నగరంలో వాహన చోదకులు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే వారిలో రెండొంతుల మంది మెడనొప్పి బాధితులేనని ఆయన చెబుతున్నారు. ప్రజెంటర్: జి.రామచంద్రారెడ్డి అపసవ్య దిశలే కారణం.. * 90 శాతం మందిలో కూర్చునే తీరు, పనిచేసే తీరు వల్లే మెడనొప్పి కలుగుతుంది * ద్విచక్రవాహనాలు నడుపుతున్న సమయంలో మణికట్టు, భుజాలు సరైన దిశలో పెట్టకపోవడం మెడపై ప్రభావం చూపుతోంది * గంటల తరబడి కంప్యూటర్ల ముందు పనిచేయడం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి మొదలవుతుంది * ఈ నొప్పి దీర్ఘకాలంగా ఉంటే స్పైనల్ (వెన్నుపూస) నరాలు దెబ్బతినే అవకాశం ఉంది * పడుకోవడంలో సరైన పద్ధతులు ఫాలో కాకపోవడం కూడా మెడనొప్పికి హేతువవుతోంది * మెడనొప్పి తీవ్రమైతే శస్త్రచికిత్స మినహా మార్గం లేదు దిశను మార్చుకుంటేనే.. * చాలామంది మెడనొప్పి రాగానే నెక్ కాలర్ (మెడకు ఓ పట్టీ) వేస్తుంటారు. దీనివల్ల ఉపయోగం ఉండదు * కంప్యూటర్ వద్ద పనిచేస్తున్నప్పుడు భుజాలు, మోచేతులు సమాంతర దిశలో ఉండాలి * అలాగే కంప్యూటర్ కీబోర్డుకు మణికట్టు సమాంతరంగా ఉండాలి. * టూ వీలర్ నడుపుతున్నప్పుడు నిటారుగా ఉండి, భుజాలు మెడకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి * రోజుకు కనీసం ఐదారు సార్లు నెక్ వ్యాయామం చేయాలి. అంటే రెండు చేతులూ తల వెనుక అదిమి పట్టి ముందుకు, వెనకకు స్ట్రెచ్ చేయడం * గంటల తరబడి కుర్చీలో కూర్చోకుండా మధ్య మధ్యలో రిలాక్స్ అవుతుండాలి