అబ్బా.. మెడనొప్పి
డాక్టర్స్ కాలమ్
తలకూ మొండేనికి మధ్య బాల్ బేరింగ్ లాంటిది మెడ. వాహనాలు నడపడంలో బాల్ బేరింగ్‌లు ఎంత ముఖ్యమైనవో మన శరీరంలో మెడకూడా అంతే. తిరుగుతున్నాయి కదా అని బేరింగ్‌లను ఎలాగ పడితే అలా తిప్పితే అవి ఎలా పాడైపోతాయో..
ఇష్టారాజ్యంగా తిప్పితే మెడ పరిస్థితీ అంతే. మెడ పనితీరు, దీని ప్రాధాన్యం అనేది నగరీకరణ జరుగుతున్న క్రమంలో బాగా తగ్గిపోవడంతో బాధితులు ఎక్కువయ్యారు. నడక, పడకల నుంచీ కూర్చునే కుర్చీలు, కూర్చునే తీరు అన్నీ మెడ నొప్పికి కారణాలవుతున్నాయి. కంప్యూటరీకరణ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు శిలల్లా మారి పనిచేయడం వల్ల మెడ నరాలు మొద్దుబారి.. కండరాలు పట్టేస్తున్నాయి.
హైదరాబాద్‌లో చాలామంది ముప్పయ్ ఏళ్లు నిండకుండానే మెడ నొప్పితో బాధపడుతున్నారు. విధి నిర్వహణలో, వాహనాలు నడిపేటప్పుడు పక్కా ప్రిన్స్‌పుల్స్ ఫాలో కాకపోవడం మెడపై ఒత్తిడి పెరుగుతోంది. చిన్నపాటి మెడనొప్పే కదా అని అశ్రద్ధ చేస్తే.. తర్వాత స్పాండిలైటిస్, ఆ తర్వాత నెక్ సర్జరీ వరకూ వెళ్తోంది. మన పనితీరులో కొన్ని పద్ధతులు ఫాలో అయితే మెడను ఈజీగా కాపాడుకోవచ్చంటున్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డా.బి.సాంబశివారెడ్డి. నగరంలో వాహన చోదకులు, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే వారిలో రెండొంతుల మంది మెడనొప్పి బాధితులేనని ఆయన చెబుతున్నారు.
ప్రజెంటర్: జి.రామచంద్రారెడ్డి
అపసవ్య దిశలే కారణం..
* 90 శాతం మందిలో కూర్చునే తీరు, పనిచేసే తీరు వల్లే మెడనొప్పి కలుగుతుంది
* ద్విచక్రవాహనాలు నడుపుతున్న సమయంలో మణికట్టు, భుజాలు సరైన దిశలో పెట్టకపోవడం మెడపై ప్రభావం చూపుతోంది
* గంటల తరబడి కంప్యూటర్ల ముందు పనిచేయడం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి మొదలవుతుంది
* ఈ నొప్పి దీర్ఘకాలంగా ఉంటే స్పైనల్ (వెన్నుపూస) నరాలు దెబ్బతినే అవకాశం ఉంది
* పడుకోవడంలో సరైన పద్ధతులు ఫాలో కాకపోవడం కూడా మెడనొప్పికి హేతువవుతోంది
* మెడనొప్పి తీవ్రమైతే శస్త్రచికిత్స మినహా మార్గం లేదు
దిశను మార్చుకుంటేనే..
* చాలామంది మెడనొప్పి రాగానే నెక్ కాలర్ (మెడకు ఓ పట్టీ) వేస్తుంటారు. దీనివల్ల ఉపయోగం ఉండదు
* కంప్యూటర్ వద్ద పనిచేస్తున్నప్పుడు భుజాలు, మోచేతులు సమాంతర దిశలో ఉండాలి
* అలాగే కంప్యూటర్ కీబోర్డుకు మణికట్టు సమాంతరంగా ఉండాలి.
* టూ వీలర్ నడుపుతున్నప్పుడు నిటారుగా ఉండి, భుజాలు మెడకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి
* రోజుకు కనీసం ఐదారు సార్లు నెక్ వ్యాయామం చేయాలి. అంటే రెండు చేతులూ తల వెనుక అదిమి పట్టి ముందుకు, వెనకకు స్ట్రెచ్ చేయడం
* గంటల తరబడి కుర్చీలో కూర్చోకుండా మధ్య మధ్యలో రిలాక్స్ అవుతుండాలి