కల్తీ... కల్తీ... కల్తీ. కల్తీ లేని వస్తువు కోసం దుర్భిణీ వేసి వెతకాల్సి వస్తోంది. బతకాలంటే రోజుకు మూడుసార్లు తినాలి. హోటల్‌లో తిందామంటే పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం వంటల్లో రంగులేస్తారు. ఇంట్లో శుభ్రంగా వండుకుని తిందామంటే... వంట దినుసులు కల్తీ. మిరప్పొడి కొందామంటే అందమైన ప్యాకింగ్ మీద నోరూరించే ఎర్రటిరంగు ఫొటో ఉంటుంది.
లోపల మిరప్పొడి ఏ రంగులో ఉందో కనిపించదు. ఇంటికి తెచ్చి ప్యాకెట్ తెరిచి చూస్తే ఒక్కోసారి రంపం పొట్టులా, ఇటుక పొడిలా నిర్జీవంగా కనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఎర్రటి ఎరుపుతో ఇది కారంపొడేనా లేక గోడలకేసే రంగా అన్నంత చిక్కగా ఉంటుంది. మనం దాదాపుగా వంటల్లో రోజూ వాడే ఐదు దినుసులను ఎలా పరీక్షించుకోవచ్చో చూద్దాం.
మిరప్పొడి: ఒక కప్పు నీటిని తీసుకుని అందులో టీ స్పూన్ మిరప్పొడి వేయాలి. మిరప్పొడి నీటిమీద తేలుతూ ఉండి రేణువులు నీటిని పీల్చుకుంటూ మెల్లగా మిరప్పొడి మొత్తం కప్పు అడుగుకు చేరుతుంది. కల్తీ మిరప్పొడి అయితే నీటిలో వేయగానే అడుగుకు చేరుతుంది. అంతేకాదు, కప్పు అడుగుకు చేరేలోపు రంగు వదులుతూ నీటిని ఎర్రగా మారుస్తుంది.
ఇంగువ: ఇంగువకు మండే గుణం ఎక్కువ. ఇంగువ కల్తీని తెలుసుకోవడానికి అదే మంచి గీటురాయి కూడా. ఇంగువను చిన్న ముక్క తీసుకుని మంట మీద పెడితే వెంటనే మంట అంటుకుని ఇంగువ ముక్క మండిపోతుంది. కల్తీ ఇంగువ అయితే వెంటనే మండదు. మంట మీద పెట్టి వెలిగించే ప్రయత్నం చేసినా సరే వెలగకుండా మాడిపోతుంది. ఇంగువ పొడి కొనేవాళ్లకు కూడా ఇదే చిట్కా. చిన్న పేపర్ మీద పావు టీ స్పూన్ ఇంగువ వేసి కాగితాన్ని వెలిగించాలి. కాగితంతోపాటే ఇంగువ కూడా మంటను ఆకర్షిస్తే అది అసలైన ఇంగువ. కాగితం మండిపోయి ఇంగువ పొడి నల్లబారి సరిగా మండకపోతే అది కల్తీ ఇంగువ అని అర్థం.
మిరియాలు: మిరియాలలో కల్తీ ఎలా జరుగుతుందంటే... బొ΄్పాయి గింజలను కలుపుతారు. ఒక కప్పు నీటిలో టీ స్పూన్ మిరియాలు వేయాలి. మిరియాలు బరువుగా ఉంటాయి నేరుగా నీటి అడుగుకు చేరతాయి. బొ΄్పాయి గింజలు తేలిక. కాబట్టి అవి నీటిలో తేలుతాయి.
జీలకర్ర: జీలకర్రలో ఏ గింజలు కలుపుతారనేది కచ్చితంగా చెప్పడం కష్టం. కానీ అసలు జీలకర్ర, అందులో కలిపిన గింజలు ఒకేరకంగా కనిపించడానికి కొద్దిగా నల్లరంగు కలుపుతారు. జీలకర్రను పావు టీ స్పూన్ తీసుకుని అరచేతిలో వేసి బాగా రుద్దాలి. చేతులకు నలుపు అంటితే కల్తీ జీలకర్ర అని అర్థం.
పసుపు: పసుపుకు కూడా రంగులద్దుతారు. అర టీ స్పూన్ పసుపును కప్పునీటిలో వేయాలి. మిరప్పొడి వలెనే ఇది కూడా నీటిని పీల్చుకుంటూ మెల్లగా నానుతూ అడుగుకు చేరుతుంది. రంగు కలిపిన పసుపు అయితే నీటి అడుగుకు చేరే లోపే రంగు వదులుతుంది. వేసిన వెంటనే నీరు చిక్కటి పసుపురంగులోకి మారుతాయి.
Comments
Please login to add a commentAdd a comment