జాగ్రత్తలు పాటించకుంటే సీజనల్ వ్యాధులు
వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాల్సిన సమయమిది
వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో రోగ కారకాలు దూరం
వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం ఇదే. సరైన ఆరోగ్య జాగ్రత్తలు పాటించకుంటే రోగాల బారిన పడే ప్రమాదం ఎక్కువ. అందుకే ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, సరైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామానికి తోడు రోజువారీ పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
రోజువారీ ఆహారం..
ఉదయం రెండు ఇడ్లీలు లేదా 60 గ్రాముల గింజ ధాన్యాలు లేదా 25 గ్రాముల పప్పులతో 150 మిల్లీ లీటర్ల పాలు తీసుకోవచ్చు. ఉదయం 11 గంటల సమయంలో ఏదో ఒక పండు, నిమ్మరసం లేదా జామకాయ తింటే మేలు. ఇవేవీ అందుబాటులో లేకపోతే ఒక గ్లాసు పాలైనా తాగాలి. మధ్యాహ్నం భోజనంలో 75 గ్రాముల గింజ ధాన్యాలు, ఆకుకూరలు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. సాయంత్రం 5 గంటలకు 50 గ్రాముల గింజ ధాన్యాలతో చిరుతిండి, ఒక కప్పు పాలు తీసుకోవాలి. రాత్రి భోజనంలో రెండు కప్పుల అన్నం లేదా రెండు చపాతీలు లేదా పుల్కాలు కూరగాయలతో తినాలి. ఒకవేళ కూరగాయ, పెరుగు వద్దనుకుంటే 100 గ్రాముల మాంసాహారం తీసుకోవచ్చు.
నీరు.. పాలు..
పరిశ్రుభమైన నీటినే తాగాలి. ఎత్తు, బరువుకు సరిపడా నీరు తాగితే 50 శాతం రుగ్మతలు దరిచేరవు. ఎక్కువగా కాచి వడబోసిన నీటినే తీసుకోవాలి. నీటితో పాటు పాలు కూడా చాలా అవసరం. రోజుకు 250 ఎం.ఎల్. పాలు తాగాలి. కాఫీ, టీ అలవాటు ఉన్న వారు రోజుకు ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ తీసుకోకపోవడమే శ్రేయస్కరం.
పప్పు ధాన్యాలు కీలకం
ఆహారంలో పల్లీలు, మినుములు, శనగలు, బాదం పప్పు వంటివి ఏదో ఒకటి ఉండేలా చూసుకోవాలి. ప్రతి రోజు ఏదో ఒక ఆకుకూర కనీసం 100 గ్రాములు తీసుకోవాలి. జామ, నిమ్మ, ఉసిరి ఏదో ఒక దానిని రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రోజూ ఉడికించిన గుడ్డు, వారంలో ఒకసారి చికెన్, మటన్ తినాలి.
తాజా పండ్లు, కూరగాయలు మేలు..
ప్రతిపూట భోజనానికి ముందు, తర్వాత తప్పని సరిగా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఉండే సూక్ష్మ పోషక పదార్థాలు, ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పసుపు, నారింజ రంగులో ఉండే పండ్లు కొన్నిరకాల దీర్ఘకాలిక జబ్బులను నిరోధిస్తాయి. తాజాగా ఉండే పచ్చి కూరగాయలు, పండ్లను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
వీటికి దూరంగా ఉండాల్సిందే..
నిల్వ చేసిన ఆహారం, తీపి పదార్థాలు తీసుకోరాదు. బయట దొరికే రెడీమేడ్ ఆహారం, ఉప్పుతో కూడిన ఆహారం, కూల్‌డ్రింక్స్, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
జలుబు నివారణకు..
ఈ కాలంలో ఎక్కువగా పీడించేవి జలుబు, దగ్గు, ఆయాసం. ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం మిరియాలు, అల్లం, వెల్లుల్లి బాగా ఉపయోగపడతాయి. వీటిని అవసరం మేరకు వేడినీరు, పాలు, టీలో ఏదేని ఒకదానిలో కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.
మంచి ఆహారంతో ఆరోగ్యం
ఆహారం బాగా ఉడికించి తినాలి. ఏ, సీ, డీ, కే విటమిన్లు కలిగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అంధత్వంతో పాటు పిల్లల్లో వాంతులు, విరేచనాలు, తట్టు, శ్వాసకోస సంబంధ వ్యాధులను నివారించేందుకు ఏ విటమిన్ బాగా పని చేస్తుంది. తోటకూర, మెంతికూర, పాలకూర, క్యారెట్, మునగాకు, మామిడి, బొప్పాయి, గుమ్మడి వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా విటమిన్లు అందుతాయి. జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఇలా చేస్తే రోగకారకాలను నియంత్రించవచ్చు. – బాలాజీ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment