‘‘నెల నెలా డాక్టర్ దగ్గరకు వెళ్తున్నావా’’ ‘‘న్యూట్రిషనిస్ట్ ఇచ్చిన డైట్ చార్ట్ ప్రకారం తింటున్నావా’’ ‘‘రోజూ వాకింగ్ చేస్తే డెలివరీ సులువవుతుంది’’ ‘‘నీకేం తినాలని ఉందో చెప్పు... చేసి పంపిస్తాను’’ గర్భిణికి ఇలాంటి ఆత్మీయ పలకరింపులెన్నో. ఆత్మీయతలు... ఆనందాలు బయటకు కనిపిస్తాయి. ఆమె మనసు పడే సంఘర్షణ బయటకు కనిపించదు. ఆమె మనసు మౌనంగా మాట్లాడుతుంది. జీవిత భాగస్వామి ఆ మనసు భాషను అర్థం చేసుకోవాలి. తగిన సహకారం అందించాలి.
గర్భిణులకు క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ చేసుకోవాలని చెబుతుంటాం. పోషకాహారం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతుంటాం. వ్యాయామం ఎంత అవసరమో సూచిస్తుంటాం. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఒకమ్మాయి గర్భం దాల్చిందని తెలియగానే ఫోన్ చేసి అభినందనలు చెబుతూ రకరకాల పరామర్శల్లో భాగంగా పై జాగ్రత్తలన్నీ చెబుతుంటాం. మరొక అడుగు ముందుకు వేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోమనే ఓ మంచిమాట కూడా. అయితే గర్భంతో ఉన్న మహిళకు ఈ జాగ్రత్తలతోపాటు సైకాలజిస్ట్ కౌన్సెలింగ్ కూడా అవసరమనే సున్నితమైన విషయాన్ని చెప్పేవాళ్లుండరు. ‘సైకాలజిస్ట్‌ను సంప్రదించడం ఎందుకు? ఏ మానసిక సమస్య ఉందని’ అనే ప్రతిస్పందన కొంచెం ఘాటుగా కూడా వినిపిస్తుంటుంది. ‘నిజానికి పై జాగ్రత్తలన్నింటితోపాటు మానసిక విశ్లేషకుల సలహాలు, సూచనలు కూడా అవసరమే. ఆ సూచనలు గర్భంతో ఉన్న మహిళకు మాత్రమే కాదు భర్తకు కూడా’ అంటున్నారు క్లినికల్ సైకాలజిస్ట్ కాంతి.
ఇద్దరికీ కౌన్సెలింగ్
‘‘ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఉండాలి. తల్లి కావాలనే అందమైన ఆకాంక్ష ప్రతి మహిళకూ ఉంటుంది. అలాగే మాతృత్వం గురించిన మధురోహలతోపాటు అనేకానేక భయాలు కూడా వెంటాడుతుంటాయి. ప్రసారమాధ్యమాల్లో వచ్చే అనేక దుర్వార్తల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తన బిడ్డకు అలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయేమోననే భయం వెంటాడుతూ ఉంటుంది. ఆమె తన భయాలను భర్తతో పంచుకున్నప్పుడు వచ్చే ప్రతిస్పందన చాలా కీలకం. నిర్లక్ష్యంగానో, విసుగ్గానో రెస్పాండ్ అయితే గర్భిణి మనసుకయ్యే గాయం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే గర్భిణిలో తలెత్తే శారీరక, మానసికమైన మార్పుల గురించిన అవగాహన భర్తకు ఉండి తీరాలి. అందుకే కౌన్సెలింగ్‌కి ఇద్దరూ రావాలని చెబుతాం. కొంత మంది భర్తలు ప్రెగ్నెంట్ ఉమన్‌తో వాళ్ల తల్లిని లేదా సోదరిని పంపిస్తుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటి రాజీలు ఉండకూడదని చెబుతుంటాం. భార్య మానసిక స్థితిలోని సున్నితత్వం స్థాయులు భర్తకు అర్థమైనప్పుడే అతడు భార్యకు అన్ని వేళల్లోనూ అండగా నిలబడగలుగుతాడు. మెంటల్ వెల్‌బీయింగ్ గురించిన అవగాహన ఇద్దరిలో ఉన్నప్పుడే పాపాయిని జాగ్రత్తగా చూసుకోవడంలో కూడా పరిణతితో వ్యవహరించగలుగుతారు.
మూడో వ్యక్తికి సాదర స్వాగతం
సాధారణంగా మన ఇళ్లలో గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెను అందరూ అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. డెలివరీ తర్వాత బాధ్యతలన్నీ ఆమె భుజాల మీద మోపుతూ జాగ్రత్తల పేరుతో ఆమెను కట్టడి చేస్తుంటారు. నిజానికి ఈ దశలో భర్త సపోర్టు చాలా అవసరం. పోస్ట్ పార్టమ్ డిజార్డర్ ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. మహిళ తన జీవితం ఒక్కసారిగా స్తంభించి పోయినట్లు భావిస్తుంది. ఒంటరితనం, నెగిటివ్ థాట్స్, ‘అందరూ సంతోషంగా ఉన్నారు... నా జీవితమే ఇలాగైంది, సోషల్ లైఫ్‌కు దూరంగా ఇంట్లో నాలుగ్గోడలకే పరిమితమైపోయింది జీవితం... అని దిగులు పడడం వంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఎందుకంటే చాలామంది మగవాళ్లకు తండ్రి అయిన తర్వాత కూడా లైఫ్‌స్టయిల్ ఏమీ మారదు. ఆడవాళ్ల విషయంలో అందుకు పూర్తిగా భిన్నం. అలాంటప్పుడే భర్త పట్టించుకోవడం లేదనే న్యూనత కూడా మొదలవుతుంది. అందుకే పోస్ట్ డెలివరీ ప్రిపరేషన్ గురించి డెలివరీకి ముందే భార్యాభర్తలిద్దరినీ మానసికంగా సిద్ధం చేయడం జరుగుతుంది. మగవాళ్లు తండ్రి అయిన సంతోషాన్ని బయట స్నేహితులతో సెలబ్రేట్ చేసుకోవడం సరికాదు, ఇంట్లోనే స్నేహితులతో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసి భార్యను కూడా వేడుకలో భాగస్వామ్యం చేయాలి. పెటర్నిటీ లీవ్ సౌకర్యం ఉంటుంది. ఆ సెలవు తీసుకుంటారు, కానీ భార్యకు సహాయంగా ఉండక ఇతర వ్యాపకాలతో గడిపే వాళ్లూ ఉంటారు. కానీ తమ కుటుంబంలో మూడో వ్యక్తికి స్వాగతం పలికే క్రమంలో ప్రతి దశలోనూ భర్తను భాగస్వామ్యం చేయగలిగితే ఇలాంటి పరిణామాలుండవని నా అభిప్రాయం.
డెలివరీ అయిన మహిళలకు దేహాకృతి విషయంలో ఎక్కడ లేని ఆందోళన మొదలవుతుంటుంది. దేహం తిరిగి మామూలు కాదనే భయం వెంటాడుతుంటుంది. మరికొందరు... నా బిడ్డకు నేను చేయాల్సినంత చేయడం లేదేమో, నేను మంచి తల్లిని కాలేనేమో అని బాధపడుతుంటారు. ఒక్కొక్కరైతే తమలో తామే బాధపడుతూ మౌనంగా రోదిస్తుంటారు, పెద్దగా వెక్కి వెక్కి ఏడుస్తారు కూడా. భావోద్వేగ పరమైన అసమతుల్యతకు లోనవుతున్న విషయాన్ని గుర్తించలేకపోతారు. మా కౌన్సెలింగ్‌లో భార్యాభర్తలిద్దరికీ ఇలాంటి విషయాలన్నింటి మీద అవగాహన కల్పిస్తాం. కాబట్టి భార్య మానసికంగా న్యూనతకు లోనయినప్పుడు ఎమోషనల్ సపోర్టు ఇవ్వాలనే విషయం మగవాళ్లకు తెలుస్తుంది.
– ఎమ్. కాంతి, క్లినికల్ సైకాలజిస్ట్ హైదరాబాద్
చర్చ కావాలి... వాదన వద్దు!
ఇక చంటి బిడ్డను చూడడానికి ఇంటికి వచ్చిన వాళ్లు కూడా ‘ఫలానా ఆమె తన బిడ్డను కింద పెట్టకుండా ఒంటి చేత్తో పెంచుకుంటోంది’ వంటి స్టేట్‌మెంట్‌లు అలవోకగా ఇచ్చేస్తుంటారు. ఆ మాటల ప్రభావంతో అన్నీ తనే చూసుకుంటూ సూపర్ మామ్ కావాలనే అవసరం లేని పట్టుదలకు కూడా పోతుంటారు చంటిబిడ్డల తల్లులు. ఇలాంటి కామెంట్‌లకు ప్రభావితం కాకుండా, విపరీత పరిణామాలకు తావివ్వకుండా ఉండాలి. భార్యాభర్తల మధ్య డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇద్దరికీ అవగాహన ఉంటే చంటిబిడ్డను పెంచడంలో భార్యాభర్తలిద్దరూ సమంగా బాధ్యతలు పంచుకోగలుగుతారు. ప్రతి విషయాన్నీ చక్కగా చర్చించుకోవాల్సిన అవసరాన్ని తెలియచేస్తాం. అలాగే ఇద్దరి మధ్య డిస్కషన్ వాదనకు దారి తీయకూడదనే హెచ్చరిక కూడా చేస్తాం. సామరస్యమైన చర్చ ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనిపిస్తాయి. వితండ వాదన వివాదానికి దారి తీస్తుంది. మన సంప్రదాయ పెంపకంలో... మగవాళ్లను అనేక విషయాలకు దూరంగా ఉంచడమే జరిగింది ఇంతవరకు. భార్యకు ఎమోషనల్ సపోర్టు ఇవ్వడం, బిడ్డ పెంపకంలో బాధ్యతను పంచుకుంటూ బాలింతకు విశ్రాంతినివ్వడం వంటివేవీ మగవాళ్లకు తెలియచేయడం ఉండదు. అందుకే ఏ విషయంలోనైనా భర్త తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటే అది అతడికి ఎలా స్పందించాలో తెలియక పోవడం కూడా అయి ఉండవచ్చు. అపోహ పడడానికి ముందు అతడికి తెలియచేసే ప్రయత్నం చేయాలని కూడా మహిళలకు చెబుతుంటాం. భార్యకు ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన బాధ్యతను భర్తకు గుర్తు చేస్తుంటాం’’ అన్నారు కాంతి.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment