నా వయసు 24 సంవత్సరాలు. నాకు ఆరు నెలలుగా వెజైనల్ దురద, పెయిన్, అప్పుడప్పుడు ఫీవర్ వస్తున్నాయి. నాకు ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు. ఏ ట్రీట్‌మెంట్ తీసుకున్నా కంప్లీట్ రిలీఫ్ రావడం లేదు. – అమృత, విజయవాడ
మీరు చెప్పిన లక్షణాలను బట్టి దాన్ని పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్స్. అది వెజైనల్ / యూరిన్‌లో ఉండవచ్చు. భర్త నుంచి వ్యాపించవచ్చు. అందుకే మీరు గైనకాలజిస్ట్‌ను కలసి వెజైనల్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని, బ్యాక్టీరియల్ లేదా యూరిన్ ఇన్‌ఫెక్షన్ ఉందా అని నిర్ధారణ చేసి దానికి తగిన యాంటీబయాటిక్స్ ఇస్తారు. మీ భర్తని కూడా యూరాలజిస్ట్‌ని కలసి యురేటరల్ స్వాబ్ తీసుకోమని చెబుతారు.
ఇద్దరికీ ట్రీట్‌మెంట్ చేసిన తరువాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యమని చెప్తారు. ఇన్‌ఫెక్షన్స్ సరిగ్గా ట్రీట్ చెయ్యనప్పుడు ఫాలోపియన్ ట్యూబ్‌కి ఏ ఇన్‌ఫెక్షన్ వ్యాపించినా ట్యూబ్స్ బ్లాక్ కావచ్చు. అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. వచ్చినా ట్యూబ్‌లోనే ప్రెగ్నెన్సీ రావడం.. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఇది ప్రమాదం. గర్భసంచికి కూడా ఇన్‌ఫెక్షన్ వ్యాపించే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు మొదలైన రెండుమూడు రోజుల్లో వెంటనే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌కి ట్రీట్‌మెంట్ మొదలుపెడితే ఈ లాంగ్‌టర్మ్ రిస్క్స్ ఏమీ ఉండవు.
డాక్టర్ చెప్పిన యాంటీబయాటిక్స్ కూడా సరైన టైమ్‌కి సరైన డోస్, చెప్పినన్ని రోజులు కరెక్ట్‌గా తీసుకోవాలి. వాళ్లకి ఫ్యూచర్‌లో ఇన్‌ఫెక్షన్ రాకుండా ఏడాదికి చెకప్‌కి వెళ్లమని చెప్తారు. ప్రెగ్నెన్సీ ఆలస్యం అవుతుంటే అల్ట్రాసౌండ్ ద్వారా ట్యూబ్స్‌లో బ్లాక్ ఉందా అని చెక్ చేస్తారు. కొన్ని బ్లడ్ టెస్ట్‌ల ద్వారా కూడా ప్రెగ్నెన్సీ ఆలస్యం అవ్వడానికి కారణాలను కనిపెడతారు. సరైన సమయానికి ట్రీట్‌మెంట్ ఇస్తే, మళ్లీ వెజైనల్∙ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment