ముందు ఆర్భాటం.. ఆ తర్వాత సెటిల్మెంట్లు.. | Important Suggestions to Realtors While Taking Up A Highrise Project | Sakshi
Sakshi News home page

ఇకనైనా మేల్కోండి.. లేకపోతే ప్రతికూలతే!

Published Sat, Feb 5 2022 12:12 PM | Last Updated on Sat, Feb 5 2022 12:29 PM

Important Suggestions to Realtors While Taking Up A Highrise Project - Sakshi

‘ఇస్నాపూర్‌లో 40 అంతస్తుల్లో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నామని ఓ నిర్మాణ సంస్థ ప్రచారం చేస్తోంది. ఏ కంపెనీ, ప్రమోటర్లు ఎవరు, గత ప్రాజెక్ట్‌లు ఏంటని శోధిస్తే.. రాత్రికి రాత్రే బోర్డ్‌ ఏర్పాటు చేసిన కంపెనీ అది. పోనీ ప్రమోటర్లకు ప్రాజెక్ట్‌లు నిర్మించిన అనుభవం ఉందా అంటే ప్చ్‌.. అదీ లేదు! హైరైజ్‌ అపార్ట్‌మెంట్‌ అని భూ యజమానికి ఆశ చూపించి ఒప్పందం చేసుకున్నాడు. తక్కువ ధర అని ప్రచారం చేస్తుండటంతో కొనుగోలుదారులూ తొందరపడుతున్నారు. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే ఆర్థిక దమ్ము ఉందా లేదా ఆరా తీశాక ముందు పడితేనే కస్టమర్లకు గృహమస్తు. లేకపోతే శోకమస్తే!’

సాక్షి, హైదరాబాద్‌: చిన్నాచితకా కంపెనీలు, అనుభవం లేని వాళ్లు రియల్టీ రంగంలోకి వచ్చేసి స్థల యజమానితో అగ్రిమెంట్‌ చేసుకోవటం, హైరైజ్‌ ప్రాజెక్ట్‌ నిర్మిస్తామని గొప్పలు చెప్పడం ఎక్కువైపోయింది. అవిభాజ్య స్థలం వాటా (యూడీఎస్‌), ప్రీలాంచ్‌లో విక్రయాలు చేస్తూ.. పారదర్శకంగా ప్రాజెక్ట్‌లు చేపట్టే నిర్మాణ సంస్థలకు, సంఘటిత పరిశ్రమకు విఘాతం కలిగిస్తున్నారు. కొనుగోలుదారులు, భూ యజమానులు, స్టేక్‌ హోల్డర్లు, డెవలపర్ల సంఘాలతో సహా ప్రభుత్వం మేల్కొనకపోతే.. వచ్చే ఏడాది కాలంలో నగర రియల్టీ కుప్పకూలిపోయే ప్రమాదముందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 

గొప్పలకు పోవద్దు
స్వలాభం కోసం 30–40 ఫ్లోర్లలో అపార్ట్‌మెంట్లు కడతామని గొప్పలకు పోవద్దు. భూ యజమానులను ఆశ పెట్టొదు. ఆ ప్రాంతంలో అంత ఎత్తులో నిర్మాణాలు సాధ్యమయ్యే పనేనా? కొనుగోలుదారుల భవిష్యత్తు తరాల మనుగడ ఎలా ఉంటుంది? వంటి సుదీర్ఘ ఆలోచన చేయాలి. అంతే తప్ప అమ్మేశాం.. డబ్బు చేసుకున్నాం.. చేతులు దులుపుకున్నాం అనే రీతిలో ఉండకూడదు. శంకర్‌పల్లి, ఇస్నాపూర్‌లో 30–40 ఫోర్లు కడుతున్నామని కొందరు డెవలపర్లు ఆర్భాటాలు చేస్తున్నారు. అడ్వాన్స్‌లు తీసుకొని.. ప్రాజెక్ట్‌ను నిర్మించలేక ఆఖరికి సెటిల్మెంట్‌ చేసుకునే స్థాయికి దిగజారిపోయారని ప్రణీత్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ నరేంద్ర కుమార్‌ కామరాజు తెలిపారు. 

ఓసీ వచ్చాక ఫర్‌ సేల్‌ ఉందా? 
సొంతిల్లు అనేది మధ్యతరగతికి జీవితాశయం. అలాంటి వారికి ఆశ పెట్టి అందిన కాడికి దోచుకోవటం అన్యాయం. నిర్మాణ అనుమతులు రాకముందే ప్రీలాంచ్, యూడీఎస్‌లో విక్రయాలు చేయడం ఆపైన లీగల్‌ సమస్యలు తలెత్తి, అనుమతులు రాక చేతులెత్తేస్తే మధ్య తరగతి కొనుగోలుదారుల పరిస్థితేంటని ఒక్కసారి పునరాలోచించుకోవాలి. కొనుగోలు చేసే ముందు కస్టమర్లు కూడా ప్రాజెక్ట్‌ పూర్వాపరాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. బిల్డర్‌ చరిత్ర, ఆర్థిక స్థోమత, ప్రమోటర్లు ఎవరనేది తెలుసుకోవాలి. పాత ప్రాజెక్ట్స్‌లో అన్ని ఫ్లాట్లు అమ్ముడుపోయాయా? లేక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) వచ్చాక కూడా ఫర్‌ సేల్‌ బోర్డ్‌ ఉందా గమనించాలి. సొంత డబ్బుతో ప్రాజెక్ట్‌ను ఎవరూ పూర్తి చేయలేరు. ఆర్థిక స్థోమత ఉన్న వాళ్లకే బ్యాంక్‌లు రుణాలు మంజూరు చేస్తాయి. 

డెవలపర్ల సంఘాలు మేల్కోవాలి.. 
పరిశ్రమ వృద్ధిలో డెవలపర్ల సంఘాలది కీలక పాత్ర. కానీ, ఫీజు తీసుకొని సభ్యత్వ నమోదు వరకే పరిమితం అవుతున్నాయే  తప్ప పరిశ్రమ వృద్ధికి ఆలోచన చేయటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా మేల్కొని భజన కార్యక్రమాలు ఆపి, నిర్మాణ రంగంలోని ప్రతికూల నిర్ణయాలపై ఒక్కతాటిపైకి వచ్చి వ్యతిరేకించాలి. నిర్భయంగా, స్పష్టంగా ప్రతికూల ప్రభావమేంటో వివరించాలి. పరిశ్రమ వర్గాలు, నిపుణులు, అనుభవజ్ఞులను కలుపుకొని పోవాలి. దిగువ స్థాయి ఉద్యోగాలు కల్పించే అతిపెద్ద రంగం నిర్మాణ రంగమే. అలాంటి రంగం ఉనికికే ప్రమాదం ఏర్పడితే విక్రయాలకే కాదు ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది.  
 

చదవండి:నిర్మాణంలోని అపార్ట్‌మెంట్‌లో ప్లాట్‌ కొంటున్నారా..! అయితే ఈ విషయాల పట్ల జాగ్రత్త..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement