దేహంలోని రక్తనాళాలు కొన్ని చోట్ల బలహీనంగా ఉండవచ్చు. మెదడులో అలా జరిగినప్పుడు బలహీనమైన చోట రక్తనాళం ఉబ్బి...ఒక్కోసారి ఆ ఉబ్బిన రక్తనాళంలోని లోపలి పొర మీద ఒత్తిడి పెరిగిపోయి, అది మరింత పలచబారి అకస్మాత్తుగాచిట్లిపోవచ్చు. ఈ పరిణామం మెదడులో జరిగితే అక్కడ జరిగే రక్తస్రావంతో మరిన్ని దుష్పరిణామాలు
చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాంతకమూ కావచ్చు. ఇలా మెదడులోని రక్తనాళాల్లో బలహీనమైన చోట రక్తం పేరుకుని, అది బుడగలా మారడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అప్పటివరకూ అంతా బాగున్నట్టే అనిపిస్తూ... అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఈ కండిషన్‌పై అవగాహన కోసం ఈ కథనం.
మెదడు చుట్టూరా ఆవరించుకుని ఉండే స్థలాన్ని సబర్కనాయిడ్ ప్రాంతంగా చెబుతారు. అన్యురిజమ్ కేసుల్లో దాదాపు 90 శాతం మందిలో ఆ ప్రాంతంలో రక్తస్రావం అవుతుంది కాబట్టి దాన్ని ‘సబర్కనాయిడ్ హేమరేజ్’ (ఎస్‌ఏహెచ్) అంటారు. రక్తనాళాలు చిట్లిన ప్రతి ఏడుగురిలోనూ నలుగురిలో ఏదో ఒకరకమైన వైకల్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. రక్తస్రావం కాగానే పక్షవాతం (స్ట్రోక్), కోమాలోకి వెళ్లే అవకాశాలెక్కువ.
అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో మెదడులో రక్తనాళాలు బలహీనంగా ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు వారి జీవితకాలంలో అవి చిట్లకపోవచ్చు. కొందరిలో ఉబ్బు చాలా చిన్నగా ఉండవచ్చు. కానీ మరికొందరిలో ఇది ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ‘జెయింట్ అన్యురిజమ్స్’ అంటారు. ఇలాంటివి అకస్మాత్తుగా చిట్లే అవకాశాలుంటాయి. దాంతో బాధితుల్లో అకస్మాత్తుగా పక్షవాతం కనిపించవచ్చు.
హార్ట్ ఎటాక్స్‌లోలాగే
‘సబర్కనాయిడ్ హ్యామరేజ్’ అకస్మాత్తుగా సంభవిస్తుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో పూడిక చేరడం వల్ల అడ్డంకులతో గుండెపోటు వస్తే... అప్పటికే అన్యురిజమ్స్‌కు గురైన రక్తనాళాలు చిట్లడం వల్ల సబర్కనాయిడ్ హ్యామరేజ్ వస్తుంది.
కారణాలు
►పొగాకు వాడకం, అనియంత్రితమైన రక్తపోటు, డయాబెటిస్ వంటివి
►రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా కలిగే దుష్పరిణామాలు (కాంప్లికేషన్స్)
►చాలావరకు పుట్టుకతో వచ్చే (కంజెనిటల్), అలాగే జన్యుపరమైన కారణాలు. ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉన్నప్పుడు ముప్పు ఎక్కువ ∙క్రమబద్ధంగా / ఆరోగ్యకరంగా లేని ►జీవనశైలి ∙
►ఏదైనా ప్రమాదం కారణంగా రక్తనాళాలు గాయపడటం.
►కొన్ని అరుదైన కేసుల్లో... ఫైబ్రో మస్క్యులార్ డిస్‌ప్లేసియా వంటి కండరాల జబ్బు, మూత్రపిండాల్లో నీటితిత్తుల్లా ఉండే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్... అన్యురిజమ్‌కు దారితీసే అంశాలు.
చిట్లినప్పుడు కనిపించే లక్షణాలు∙
- జీవితంలో ఎప్పుడూ రానంత అత్యంత బాధతో కూడిన తలనొప్పి
- స్పృహ కోల్పోవడం
- పక్షవాతం / ఫిట్స్ కూడా
- మాట్లాడలేకపోవడం,
- మూతి వంకరపోవడం
చికిత్సా ప్రత్యామ్నాయాలు
శస్త్రచికిత్స కాకుండా మందులిస్తూ చేసే చికిత్స (నాన్ సర్జికల్ మెడికల్ థెరపీ) ∙శస్త్రచికిత్స లేదా క్లిప్పింగ్ ∙ఎండోవాస్క్యులార్ థెరపీ లేదా కాయిలింగ్ (అడ్జంక్టివ్ డివైస్ లేకుండా చేసే చికిత్స / వీలునుబట్టి డివైస్ వాడటం). వీటి గురించి వివరంగా...
మెడికల్ థెరపీ: రక్తనాళాలు చిట్లకముందు చేసే చికిత్స ఇది. రక్తపోటును అదుపులో ఉంచేందుకు మందులిస్తూ, కొని ఆహారాలు, వ్యాయామాలు సూచిస్తారు. అన్యురిజమ్స్ సైజు తెలుసుకోడానికి నిర్ణీత వ్యవధుల్లో తరచూ ఎమ్మారై / సీటీ స్కాన్/యాంజియోగ్రఫీ) చేయించడం అవసరం.
శస్త్రచికిత్స / క్లిప్పింగ్: పుర్రె తెరవడం ద్వారా చేసే శస్త్రచికిత్స (క్రేనియాటమీ) ద్వారా ఉబ్బిన రక్తనాళాల్ని నేరుగా పరిశీలిస్తూ, పరిస్థితిని అంచనా వేస్తారు. అన్యురిజమ్‌లను గుర్తించి, శస్త్రచికిత్సతో వాటిని జాగ్రత్తగా వేరుచేస్తారు. ఉబ్బిన చోట క్లిప్పింగ్ జరిపాక మళ్లీ మునపటిలా రక్తప్రసరణ జరిగేలా జాగ్రత్త తీసుకుంటారు.
ఎండోవాస్క్యులార్ కాయిలింగ్ : తొడ ప్రాంతంలోని రక్తనాళం నుంచి ఒక పైప్ (క్యాథెటర్)ను ప్రవేశపెట్టి... అందులోంచి మరింత చిన్నపైప్‌లతో మెదడులోని అన్యురిజమ్స్‌కు చేరి, అక్కడ రక్తనాళాన్ని చుట్టలుచుట్టలుగా చుట్టుకుపోయేలా చేస్తారు. దాంతో ఉబ్బిన ప్రాంతానికి రక్తసరఫరా ఆగుతుంది. ఫలితంగా చిట్లడం నివారితమవుతుంది. ప్రస్తుతం ఉన్నవాటిల్లో దీన్ని మేలైన చికిత్సగా పరిగణిస్తున్నారు. ఇందులోనే బెలూన్ కాయిలింగ్ అనే ప్రక్రియలో అన్యురిజమ్ ఉన్న ప్రాంతానికి దగ్గర్లో బెలూన్ లాంటి దాన్ని ఉబ్బేలా చేసి, అటు తర్వాత కాయిలింగ్ చేస్తారు. ఇలా పెద్ద రక్తనాళాల దగ్గరున్న ఉబ్బును చిట్లకుండా రక్షిస్తారు.
ఇవిగాక... దాదాపు ఏడేళ్ల నుంచి రక్తప్రవాహపు దిశ మళ్లించడానికి ‘ఫ్లో డైవర్టర్ స్టెంట్స్’ ఉపయోగిస్తున్నారు. వీటితో అన్యురిజమ్‌లోని రక్తపు దిశను మళ్లించి క్రమంగా ఉబ్బు తగ్గిపోయేలా చేస్తారు. బాధితుల పరిస్థితిని బట్టి చికిత్సా ప్రత్యామ్నాయాలను డాక్టర్లు ఎంచుకుంటారు.
ముందే తెలిస్తే ముప్పు నివారణకు అవకాశం...
అన్యురిజమ్స్ ప్రాణాంతకమే అయినా ముందే తెలిస్తే బాధితుల్ని రక్షించుకునేందుకు అవకాశాలు పెరుగుతాయి. మెదడు సీటీ స్కాన్, మెదడు ఎమ్మారై పరీక్షల ద్వారా తలలోని రక్తనాళాలను పరిశీలించినప్పుడు ఈ సమస్య బయటపడే అవకాశం ఉంది. అందుకే ఫ్యామిలీ హిస్టరీలో ఈ ముప్పు ఉన్నవారు సీటీ, ఎమ్మారై పరీక్షలు చేయించడం ఒకరకంగా నివారణ చర్యలాంటిదే అనుకోవచ్చు. ఈ పరీక్షల్లో సెరిబ్రల్ అన్యురిజమ్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలితే... గుండెకు చేసినట్టే మెదడుకూ యాంజియోగ్రామ్ చేస్తారు. ‘సెరిబ్రల్ యాంజియో’ అనే ఈ పరీక్షతో అన్యురిజమ్స్‌ను ముందుగానే నిర్ధారణ చేయడం ద్వారా ప్రాణాపాయ ప్రమాదాల్ని చాలావరకు నివారించవచ్చు.
డాక్టర్ పవన్ కుమార్ పెళ్లూరు కన్సల్టెంట్ న్యూరో సర్జన్
(చదవండి: గాయాలే! అని కొట్టిపారేయొద్దు! అదే ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు!)
Comments
Please login to add a commentAdd a comment