![Continued high temperatures in the state - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/19/hs.jpg.webp?itok=N097A8gw)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు, శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యల్పంగా విశాఖపట్నం (గంభీరం)లో 38.9, కోనసీమ అంబేడ్కర్ జిల్లా(అంగర)లో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం, వల్లూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచాయని, మరో 27 మండలాల్లో వడగాడ్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 29 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండనుంది. అనకాపల్లి జిల్లాలో 5, గుంటూరులో ఒకటి, కాకినాడలో ఒకటి, ఎన్టీఆర్ జిల్లాలో 2, పల్నాడులో 2, మన్యంలో 5, విజయనగరంలో 5, వైఎస్సార్ జిల్లాలో 8 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. శనివారమూ 33 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
నేడు 44 నుంచి 45 డిగ్రీల వరకు
శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీలు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు వహించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment