నాకు 5వ నెల. చలికాలంలో తరచుగా జలుబు చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏ మందులు వేసుకోవాలి. డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి? – మాధురి, జగ్గంపేట
జలుబు అనేది గర్భవతిగా ఉన్నప్పుడు చాలా సాధారణం. జలుబు, ఫ్లూ వైరస్ వల్ల వ్యాపిస్తుంది. మాములుగా జలుబుకి ఆవిరి తీసుకోవడం, పై పూతగా ఏమైనా రాసుకోవడం, పారాసిటమాల్ లాంటివి తీసుకోవచ్చు. కానీ జలుబుతో పాటు ఒళ్లునొప్పులు, దగ్గు, జ్వరం ఉంటే మాత్రం ఫ్లూ లక్షణాలు అని అర్థం. అప్పుడు డాక్టర్‌ని వెంటనే సంప్రదించాలి. ఈ ఇన్‌ఫెక్షన్స్ వల్ల కొంతమంది గర్భిణీలకు వాతావరణంలోని మార్పులతో ఇబ్బందులు ఎదురవుతాయి. యాంటీ వైరల్ మాత్రలు కుడా వాడాల్సి వస్తుంది. త్వరగా చికిత్స అందకపోతే కొందరిలో అది న్యూమోనియాగా మారుతుంది. దీనికి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సి ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు హార్మోనల్ మార్పుల వల్ల, ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. అందుకే ఎక్కువమంది ఇబ్బందులు ఎదుర్కొంటారు.
హై యాంటీబయాటిక్స్ ఇవ్వవలసి వస్తుంది. ఫ్లూ కారణంగా ముందస్తు డెలివరీ అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. చలికాలంలో మీరు ఉన్న పరిసరాల్లో ఎవరో ఒకరికి జలుబు, ఫ్లూ ఉంటాయి. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్‌లు కూడా ఉంటాయి. అలాంటప్పుడు నిరోధించడం చాలా కష్టం. అందుకే గర్భిణీలు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఫ్లూ వ్యాక్సినేషన్ ఏ నెలలోనైనా తీసుకోవచ్చు. ఇది తీసుకున్న వారిలో ఫ్లూ తాలూకు ఇబ్బందులు తక్కువగా ఉంటాయని నిరూపణ అయ్యింది. సరైన పోషకాహారం, నిద్ర, రోజుకు కనీసం నాలుగైదు లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్, ముక్కులో వేసుకునే ్రడాప్స్ మంచివి కావు. డీకంజెస్టంట్ (కఫం పోయేలా చేసే) ఉన్న మందులు కూడా వాడకూడదు.
ఫ్లూ వచ్చినప్పుడు చేసే చికిత్సతో కడుపులో ఉన్న బిడ్డ మీద ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. మీకు 5వ నెలలో చేసే టిఫా స్కాన్‌లో బిడ్డ ఎదుగుదల తెలుస్తుంది. ఒక వేళ ఫ్లూ ఎక్కువ ఉండి, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంటే వెల్ బీయింగ్ స్కాన్ అదనంగా చేస్తారు. మీకు జలుబు మాత్రమే ఉంటే ఒకటి రెండువారాల్లో తగ్గుతుంది. ఉప్పు నీటితో పుక్కిలించడం, వేడినీటిలో నిమ్మరసం వేసుకుని తాగడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది. ముక్కు మూసుకుపోయి, తుమ్ములు, గొంతు బొంగురుపోవడం లాంటివి ఉండి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే వెంటనే డాక్టర్‌ని కలవాలి.
మీకు షుగర్, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులున్నా, వాటి తాలూకు ఇబ్బందులు ఎదురైనా డాక్టర్‌ని కలసి, వారి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఒకటి రెండు వారాల వరకూ ఇన్‌ఫెక్షన్ ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా జలుబు ఉంటే వాళ్లు వాడిన వస్తువులు వాడకూడదు. చేతులను ముక్కు, కళ్ల వద్ద పెట్టుకోకూడదు. చేతులను శు్రభంగా కడుక్కోవాలి. మాస్క్ వాడటం కూడా మంచిది. ఫ్లూ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటే తగ్గదు. అందుకే రాకముందే ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫీవర్ ఉంటే డాక్టర్‌ని కలసి మందులు వాడాలి.
హెల్త్ ట్రీట్.. పీసీఓఎస్‌తో తిండి సమస్యలు..?
మహిళల్లో రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే పాలీ సిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) తిండి సమస్యలకు కూడా కారణమవుతుందని తాజా పరిశోధనలో తేలింది. పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు బులీమియా (తిన్న తర్వాత బరువు పెరిగిపోతామన్న ఆందోళనతో బలవంతంగా వాంతి చేసుకోవడం), బింజ్ ఈటింగ్ (నియంత్రణ లేకుండా నిరంతరం తినడం) వంటి సమస్యలకు కూడా లోనవుతారని ఒక అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. తొమ్మిది దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పీసీఓఎస్‌తో బాధపడే 28,922 మంది మహిళలపైన, ఈ సమస్య లేని 2,58,619 మంది మహిళలపై జరిపిన విస్తృత పరిశోధనలో ఈ అంశమై శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.
ఈ పరిశోధన సారాంశాన్ని ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం’ సంచికలో ప్రచురించారు. ఆహారం తినడంలో సమస్యలకు లోనయ్యే పీసీఓఎస్ మహిళలపై జరిపిన పరిశోధనల్లో మరికొన్ని అంశాలూ బయటపడ్డాయి. వీరిలో నెలసరి సక్రమంగా రాకపోవడం, ఒక్కోసారి అసలే రాకపోవడం, అండాశయం పైపొరపై పూర్తిగా పరిపక్వం కాని అండాలు ఏర్పడటం, పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ మోతాదు ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. పీసీఓఎస్ లేని మహిళలతో పోలిస్తే, పీసీఓఎస్‌తో బాధపడే మహిళల్లోనే ఆహారం తినే అంశంలో రకరకాల సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌లోని కేలీ గయోర్ఫీ, అవా సానెత్‌ల ఆధ్వర్యంలో ఈ పరిశోధన నిర్వహించారు. – డా. భావన కాసు
Comments
Please login to add a commentAdd a comment