ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పీజీ)తో వంట చేయడమే కనిపిస్తోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన వంట గ్యాస్ వినియోగం నేడు గ్రామాల్లోనూ విస్తరించింది. ఎంతో ప్రాముఖ్యమున్న వంట గ్యాస్ వినియోగంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు. గ్యాస్‌తో ఆటలాడుకోవద్దనే వాదనను అందరూ వినిపిస్తుంటారు. ఎందుకంటే అది ప్రమాదవశాత్తు పేలితే ప్రాణ, ఆస్తి నష్టాలు తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో వంట గ్యాస్ వాడకంపై వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.
మహారాణిపేట(విశాఖ దక్షిణ): గ్యాస్ సిలిండర్ పేలుడు.. సిలిండర్ లీకై అగ్ని ప్రమాదం వంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉన్నాయి. ఏదో మూల.. ఏదో ఒక ప్రాంతంలో గ్యాస్ ప్రమాదాల వార్తలు వింటూ ఉన్నాం. కేవలం అవగాహన లోపం... నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న గ్యాస్ సిలిండర్‌తో ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. చిన్న చిన్న జాగ్రత్తలు, గ్యాస్ వినియోగంలో అప్రమత్తంగా వ్యవహరించడం వంటి వాటితో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు.
చదవండి: హజ్ అరుదైన భాగ్యం.. ఈ నెల 31తో ముగియనున్న గడువు
తూకాల్లో మోసాలు..
వంట గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే బాయ్స్ వెంట తప్పని సరిగా స్ప్రింగ్ త్రాసు ఉండాలనే నిబంధన ఉంది. గృహవసర సిలిండర్ లో నికరంగా గ్యాస్ 14.200 కేజీలు, సిలిండర్ బరువు 15.300 కేజీలు కలుపుకుని మొత్తంగా 29.500 కేజీలు ఉండాలి. మీకు సరఫరా చేస్తున్న సిలిండర్ బరువు తక్కువగా ఉన్నట్లు అనుమానం వస్తే తక్షణమే తూకం వేయించాలి. తూకం వేసేందుకు డెలివరీ బాయ్స్ నిరాకరిస్తే వెంటనే జిల్లా సరఫరా అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.
మూడు దశల్లో రీ–క్యాలిబ్రేషన్ పరీక్ష
గ్యాస్ సిలిండర్ల నాణ్యతకు సంబంధించి నిర్వహించే రీ–క్యాలిబ్రేషన్ పరీక్ష మూడు దశల్లో ఉంటుంది. ముందుగా విజువల్ ఇన్‌స్పెక్షన్ చేస్తారు. ఇందులో సిలిండర్ పనికి రాదని తేలితే దాన్ని ధ్వంసం చేయాల్సి ఉంటుంది. లేకపోతే హైడ్రాలిక్ పరీక్షలకు పంపుతారు. అక్కడ సిలిండర్లలో నీటిని నింపి 5 సార్లు ఫ్రెషర్ ద్వారా లీకేజీలను గుర్తిస్తారు. ఆ తర్వాత వాలు పరిస్థితిని గమనించి నిమాటి ఫ్రెషర్ పరీక్ష చేస్తారు. సిలిండర్లలో గాలి నింపి ఒత్తిడిని పెంచుతారు. అన్ని పరీక్షల్లో సిలిండర్ మంచిదని తేలితే దానిని ప్రజా వినియోగానికి అనుమతిస్తారు. ఈ పరీక్షను ఏడాదిలో 4 సార్లు నిర్వహించాలి.
వంటగదిలో పాటించాల్సిన జాగ్రత్తలు..
►వంటగదిలో తగినంత గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు ఏర్పాటు చేయాలి.
►గ్యాస్ స్టౌకు ఎదురుగా మాత్రం కిటికీ ఉండకూడదు.
►వంట గదిలో గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉండాలి. కిరోసిన్, ఇతర మండే స్వభావం ఉన్న పదార్థాలు ఉంచకూడదు.
►అత్యవసర పరిస్థితుల్లో సిలిండర్‌ను తొలగించడానికి వీలైనంత స్థలముండాలి.
►స్టౌవ్ పైభాగంలో అలమరాలు ఉండరాదు.
►మీ గ్యాస్ సిలిండర్‌ను ఇతరులకు ఇవ్వడం శ్రేయస్కారం కాదు.
►గ్యాస్ స్టౌకు సంబంధించిన మరమ్మతులను డీలర్ వద్దగానీ, అనుభవం కలిగిన మెకానిక్ వద్దగానీ చేయించాలి. అంతే కానీ వ్యక్తిగత ప్రయోగాలు చేయరాదు.
► వంట చేసే సమయంలో పిల్లలను దగ్గరకు రానీయకూడదు. వంట చేసే సమయంలోనూ, స్టౌవ్ వాడకంలో ఉన్నప్పుడు వంట గదిలోనే ఉండాలి.
కంపెనీల నిర్లక్ష్యం
ఎల్పీజీ సిలిండర్ల వాడకంలో వినియోగదారుల మాట అటుంచితే కొన్ని చమురు సంస్థలు తమ కేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. కాలం చెల్లిన సిలిండర్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వినియోగంలో దెబ్బతిన్న సిలిండర్లను మార్చడం లేదా, వాటికి మరమ్మతు లు చేయడంలో కంపెనీలు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయి. వాస్తవానికి గ్యాస్ సిలిండర్లకు 7 సంవత్సరాల జీవిత కాలం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇది పూర్తయితే వాటిని రీ–క్యాలీబ్రెషన్ పరీక్షకు పంపాల్సి ఉంటుంది. అంతా ఓకే అనుకుంటేనే దానిని మరో 5 సంవత్సరాల పాటు వినియోగించుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
గ్యాస్ వాసన వస్తుంటే...
♦ గ్యాస్ వాసన వస్తున్నట్టు అనిపిస్తే తక్షణమే రెగ్యులేటర్, తర్వాత స్టౌవ్ ఓపెన్‌ను ఆఫ్ చేయాలి.
♦ విద్యుత్ బోర్డులో స్విచ్‌లు వేయడం, తాకడం వంటివి చేయకూడదు.
♦ అన్ని కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి.
♦ రెగ్యులేటర్‌ను వేరుచేసి సిలిండర్‌పైన సేఫ్టీ కప్ పెట్టి సురక్షిత ప్రదేశంలో ఉంచాలి.
♦ గ్యాస్ లీకవుతున్నట్టు భావిస్తే ప్రమాదాల నివారణకు దగ్గరలోని అగి్నమాపక కేంద్రాలు, డీలర్లకు ఫోన్ చేయాలి.
వినియోగంలో ఇవి తప్పనిసరి..
♦ గ్యాస్ సిలిండర్ నాబ్‌కి కంపెనీ సీల్ వేసి పంపుతుంది. అలా సీల్ వేసినవే తీసుకోవాలి. సీల్ బిగుతా లేకుండా ఊడిపోయినట్లు ఉంటే తిరస్కరించాలి.
♦ సిలిండర్‌ను ఎప్పుడూ నిలువుగానే ఉంచాలి. పడుకోబెట్టడం.. పక్కకు వంచి ఉంచడం చేయరాదు.
♦ గ్యాస్ సిలిండర్‌ను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి.
♦ వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ కట్టేయాలి. లీకేజీ సమస్య రాకూడదంటే రెగ్యులేటర్ కట్టేసిన తర్వాత స్టౌపై మంటను అలాగే ఉంచి పరిశీలించాలి. దీని వల్ల ట్యూబులో ఉండే గ్యాస్ పూర్తిగా బయటకు వచ్చి మండిపోతుంది.
♦ సిలిండర్ వినియోగించని సందర్భంలో ప్లాస్టిక్ మూత పెట్టేయాలి. ఖాళీదైనా ఇలాగే చేయాలి.
♦ గ్యాస్ స్టౌని ఎప్పుడూ సిలిండర్ కన్నా ఎత్తులోనే ఉంచాలి.
♦ రెగ్యులేటర్‌కు మరో ట్యూబ్‌ను కలిపి మరో స్టౌకు జత చేయరాదు.
♦ రబ్బరు ట్యూబ్‌కు ఏ విధమైన కవర్‌ని తొడగరాదు.
♦ సిలిండర్‌ను గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలోనే ఉంచాలి.
♦ గ్యాస్ సిలిండర్ కాలపరిమితిని సూచించే నంబర్‌ను పరిశీలించాలి. సిలిండరుకు అతికి ఉన్న ఊచల వెనుక వైపు ఈ నంబర్ ఉంటుంది.
♦ గ్యాస్ పరికరాలను ప్రతి రెండేళ్లకోసారి పరీక్షిస్తూ ఉండాలి.
♦ నాణ్యమైన స్టౌలు వాడాలి. వీటి వాడకం వల్ల ఏడాదికి రెండు సిలిండర్లు వరకు ఆదా చేయవచ్చు.
♦సిలిండర్‌కు రెగ్యులేటర్ బిగించే చోట ఒక రబ్బర్ వాచర్ ఉంటుంది. వాచర్ సరిగ్గా లేకపోతే రెగ్యులేటర్ బిగించిన తరువాత గ్యాస్ లీకవుతుంది. కాబట్టి డెలివరీ బాయ్స్ సిలిండర్ ఇచ్చినప్పుడు దానిపైన ఉన్న సీల్‌ను అతని ముందే తొలగించండి. వాచర్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయాలని కోరండి. వారి వద్ద రెగ్యులేటర్ ఉంటుంది. దానిని సిలిండర్‌కు బిగించి పరిశీలిస్తారు. గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తిస్తే వెంటనే రబ్బర్ వాచర్ మార్చి మరోసారి చెక్ చేస్తారు.
సిలిండర్‌పై నంబర్లు పరిశీలించండి..
రీ–క్యాలీబ్రెషన్ పరీక్షకు సంబంధించి ప్రతి సిలిండర్‌పై భాగాన ఉన్న సపోర్టుల్లో ఏదో ఒక దానిపై లోపలి వైపున ఎబీసీడీల అక్షరాలతో ఒక కోడ్‌తో పాటు రెండు నంబర్లు సంవత్సరానికి సంబంధింనవి సూచిస్తారు. నాలుగు అక్షరాలు సిలిండర్‌కు పరీక్ష నిర్వహించాల్సిన నెల కోడ్‌ను సూచిస్తాయి. జనవరి నుంచి మార్చి వరకు–ఎ, ఏప్రిల్ నుంచి జూన్ వరకు–బి, జూలై నుంచి సెపె్టంబర్ వరకు–సి, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు –డి కోడ్‌ను కేటాయించారు. ఉదాహరణకు సిలిండర్‌పై డి–20 అని ఉంటే డిసెంబర్ 2020లో ఆ సిలిండర్ జీవిత కాలం పూర్తవుతుందని అర్థం. ఈ విషయంలో గృహిణులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
సీల్ లేకుండా డెలివరీ వద్దు
గ్యాస్ సిలిండర్ డెలివరీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి సిలిండర్‌కు తప్పని సరిగా సీల్ ఉంటుంది. సీల్ లేకుండా ఇచ్చే సిలిండర్లను ఎవరూ తీసుకోవద్దు. సీల్ లేకుండా డెలివరీ చేస్తే డెలివరీ బాయ్స్‌పై, గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకుంటాం. డెలివరీ బాయ్స్ అంతా తమ వెంట తూనిక యంత్రం అందుబాటులో ఉంచుకోవాలి. వినియోగదారులు ఎవరైనా అడిగితే సిలిండర్ తూకం వేసి చూపించాలి. వినియోగదారుడి సమక్షంలో గ్యాస్ బాయ్‌లు సీల్ తీసి వాల్వు తనిఖీ చేయాలి.
– రొంగలి శివప్రసాద్, రూరల్ డీఎస్‌వో, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment