ప్రీ–హైపర్‌టెన్షన్
రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్ అంటే అందరికీ తెలిసిందే. కానీ... వాస్తవానికి రక్తపోటు వచ్చేందుకు ముందు కొన్ని సూచనల ద్వారా శరీరం హెచ్చరికలు పంపుతుంటుంది. అవేమిటో జాగ్రత్తగా గ్రహిస్తే అసలు రక్తపోటు రాకుండానే చాలాకాలం పాటు ఆలస్యం చేయడమో, అదే క్రమశిక్షణ పాటిస్తే దాదాపుగా నివారించడమో సాధ్యమవుతుంది. దేహం అలా హెచ్చరికలు పంపే దశను ‘ప్రీ–హైపర్‌టెన్షన్’ దశగా పేర్కొంటారు. నిజానికి ప్రీ హైపర్‌టెన్షన్ దశలోనే జాగరూకతతో వ్యవహరిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలూ, మూత్రపిండాలు, మెదడు లాంటి కీలకమైన ఎండ్ ఆర్గాన్స్ దెబ్బతినకుండా నివారించుకుకోవచ్చు.
ఆ ‘ప్రీ–హైపర్‌టెన్షన్’ ఏమిటో చూద్దాం.
రక్తనాళాల్లో రక్తం నిర్దిష్టమైన వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. ఓ వ్యక్తి తాలూకు రక్తపోటు 120/80 ఉంటే అది పూర్తిగా నార్మల్ కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొందరిలో ఈ నార్మల్ కొలత ఖచ్చితంగా ఉండక కొంత అటు ఇటుగా మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు సిస్టోలిక్ రక్తపోటు విలువ 120కి బదులుగా 121 నుంచి 139 ఉండవచ్చు. అలాగే డయాస్టోలిక్ విలువ 80కి బదులుగా 81 నుంచి 89 వరకు ఉండవచ్చు. 120 /80 కి బదులుగా పైన పేర్కొన్న ఆ కొలతలు ఉంటే ఆ దశను రక్తపోటు ఉన్న దశగా చెప్పడం కుదరదు. అలాగని అది నార్మల్ విలువ కూడా కాదు. అందుకే డాక్టర్లు ఆ దశను ‘ప్రీహైపర్‌టెన్షన్’ (రక్తపోటు రాబోయే ముందు దశ)గా పేర్కొంటారు. ఈ ‘ప్రీహైపర్‌టెన్షన్’ దశను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు ‘హైబీపీ’ రావచ్చు. అయితే హైబీపీ నిశ్శబ్దంగా ఎన్నో ఆరోగ్య సమస్యలనూ, అనర్థాలను తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గమనంలో ఉంచుకుని, కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రీ–హైపర్‌టెన్షన్‌లో బాధితులు వెంటనే మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఆ హెచ్చరికలతో అప్రమత్తమై కొన్ని ముందుజాగ్రత్త చర్యలకు పూనుకోవాలి. ప్రీ–హైపర్‌టెన్షన్ దశలోనే తమ తమ వ్యక్తిగత జీవనశైలిలోని అలవాట్లను చక్కబరచుకోవడం ద్వారా రక్తపోటును అదుపులోకి తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది.
హైబీపీ ఓ సైలెంట్ కిల్లర్...
అధిక రక్తపోటును (హైబీపీని) సైలెంట్ కిల్లర్‌గా పేర్కొంటారు. ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యానికి కలిగే అనర్థాలు, నష్టాలు వెంటనే బయటకు కనిపించవు. పైగా రక్తపోటు పెరిగి ఉందన్న విషయం బాధితుడికి మొదట్లో తెలియనే తెలియకపోవచ్చు కూడా. అందువల్ల నష్టం జరుగుతూపోతూ... దీర్ఘకాలంలో ఏవైనా అవయవాలు దెబ్బతినప్పుడు, వాటికి సంబంధించిన లక్షణాలు బయటపడేవరకు జరిగిన నష్టం తెలియరాదు. కొన్నిసార్లు నష్టం జరిగిపోయాక మాత్రమే అప్పుడది హైబీపీ వల్ల జరిగిన అనర్థమని తెలుస్తుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు.
హైబీపీకి కారణాలు..
హైబీపీకి నివారించలేనివీ, నివారించదగినవనే రెండు రకాల కారణాలుంటాయి.
నివారించలేని కారణాలు:
పెరుగుతున్న వయసు, కుటుంబంలో వంశపారంపర్యంగా హైబీపీ ఉన్న మెడికల్ హిస్టరీ వంటివి నివారించలేని కారణాలని చెప్పవచ్చు.
నివారించదగిన కారణాలు:
ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉండటం (స్థూలకాయం), ఒకే చోట కూర్చుని పనిచేసే జీవనశైలి, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పొగతాగడం, పొగాకు నమలడం, మద్యం తీసుకోవడం వంటి అలవాట్లు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అనేక అంశాలు నివారించదగిన కారణాలు.
ఈ సూచనలు పాటించండి...
– కేవలం ప్రీహైపర్‌టెన్షన్ మాత్రమే ఉన్నప్పుడు నివారించదగిన కారణాలను తెలుసుకుని అవి ప్రమాదకరం కాదని నిర్లక్ష్యం చేయకుండా ఈ సూచనలు పాటించాలి.
– జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం. అంటే సోడియమ్ మోతాదులు పెరగకుండా ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవడం.
– ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, చిప్స్, బేకరీ ఐటమ్స్ వంటి వాటికి దూరంగా ఉండటం ∙కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం కంటే ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం.
– మాంసాహారంలో వేట మాంసం కంటే వైట్ మీట్ అయిన చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవడం.
– అదనపు బరువును ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా నియంత్రించుకోవడం.
– ఎప్పుడూ కూర్చుని ఉండే పనుల్లో ఉండేవారు వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రీ–హైపర్‌టెన్షన్ దశలోనే జాగ్రత్తవహిస్తే అధిక రక్తపోటును చాలాకాలం పాటు నివారించుకోవచ్చు. దాంతో గుండెపోటు, పక్షవాతం, మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి అనేక రకాల ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment