ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. సెకండ్ టైమ్. తొలికాన్పు సిజేరియన్. అయితే కుట్లు సరిగా మానలేదు. ఇప్పుడూ సిజేరియన్ అయితే అలాంటి పరిస్థితే వస్తుందేమోనని భయంగా ఉంది. కుట్లు త్వరగా మానేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. ప్రణిత, శ్రీరాంపూర్
సిజేరియన్‌లో కరిగిపోయే కుట్లు వేస్తారు. లేదంటే ఎన్‌సేషన్ గ్లూతో క్లోజ్ చేస్తారు. మామూలుగా అయితే ఇవి మానడానికి ఒకటి నుంచి రెండు వారాలు పడుతుంది. కానీ శరీరతత్వాన్ని బట్టి మనిషికి మనిషికి తేడా ఉంటుంది. బరువు ఎక్కువున్నవాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువున్న వాళ్లు, ఇన్‌ఫెక్షన్స్ ఉన్నవారిలో కుట్లు మానడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. సాధారణంగా .. స్కిన్ వూండ్‌ని క్లోజ్‌చేసి డ్రెస్సింగ్ చేస్తారు. ఈ డ్రెస్సింగ్ వల్ల గాయం నుంచి ఏదైనా లీకేజ్ వచ్చినా.. అబ్సార్బ్ అయిపోతుంది.
గాయం మానడానికి కావల్సిన కండిషన్‌ను క్రియేట్ చేస్తుంది. గాయానికి మనం వేసుకున్న దుస్తులు తగలకుండా చేస్తుంది. అయితే కుట్లు సరిగా మానకపోతే అక్కడ ఇన్‌ఫెక్షన్ అవుతుంది. అంటే కుట్ల దగ్గర క్రిములు పెరిగి.. చీము పడుతుంది. ఇలా ఇన్‌ఫెక్షన్ అయితే కుట్లలో పెయిన్ వస్తుంది. ఎర్రగా మారి వాపూ ఉంటుంది. నీరు, బ్లడ్ వంటి ద్రవాలు లీక్ అవుతుంటాయి. దుర్వాసన వేస్తుంది. హై టెంపరేచర్‌తో జ్వరం వస్తుంది.
ఇలాంటి మార్పులు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. త్వరగా డాక్టర్ దగ్గరకు వెళితే ట్రీట్‌మెంట్ ఈజీగా అయిపోతుంది. ఆసుపత్రిలో చేసిన డ్రెస్సింగ్ డ్రైగానే ఉంటే మూడు రోజుల తర్వాత ఆ డ్రెస్సింగ్‌ని తీసేసి.. ఇంట్లోనే మీరు డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఒకవేళ డ్రెసింగ్ తడిగా ఉంటే మాత్రం డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. ఇంట్లో డ్రెసింగ్ చేసుకునే ముందు సబ్బు నీటితో చేతులు శుభ్రంగా కడుక్కొని .. తడి లేకుండా తుడుచుకోవాలి.
గ్లోవ్ హ్యాండ్‌తోనే డ్రెస్సింగ్‌ని తీసేసి.. మళ్లీ ఫ్రెష్‌గా డ్రెసింగ్ చేసుకోవాలి. కరిగిపోయే కుట్లయితే సాధారణంగా 7–10 రోజుల్లో కరిగిపోతాయి. విప్పే కుట్లయితే 14 రోజుల తర్వాత డాక్టర్ తీసేస్తారు. అప్పటి వరకు కుట్లకు మీరు వేసుకున్న దుస్తులు తగలకుండా కుట్ల దగ్గర కట్టు ఉండటం మంచిది. స్నానం చేసేటప్పుడు తడవకుండా చూసుకోవాలి. కుట్లు విప్పాకే పూర్తిగా షవర్ బాత్ చేయడం మంచిది. కుట్ల మీద స్ట్రాంగ్ సోప్‌ని వాడకూడదు. అలాగే జెల్స్, లోషన్స్ రాసుకోవద్దు.
టాల్కం పౌడర్ కూడా వేయొద్దు. ఆపరేషన్ అయిన రెండు వారాలకు కుట్లు పూర్తిగా మానిపోతాయి. అప్పటి నుంచి నడుముకి బెల్ట్ పెట్టుకోవాలి.. నడుము నొప్పి రాకుండా! ఒకవేళ కుట్ల దగ్గర ఇన్‌ఫెక్షన్ ఉంటే డాక్టర్ చెక్ చేసి.. కుట్ల దగ్గర స్వాబ్ టెస్ట్ చేసి.. ఏ బ్యాక్టీరియా పెరుగుతోంది.. దానికి ఏ యాంటీబయాటిక్స్ ఇవ్వాలో చూసి.. ట్రీట్‌మెంట్ ఇస్తారు.
– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & అబ్‌స్టేట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment