లోపాన్ని సరిచేసేందుకే దిగ్గజ కంపెనీ కార్ల రీకాల్‌ | Tesla recalls nearly all vehicles sold in US | Sakshi
Sakshi News home page

లోపాన్ని సరిచేసేందుకే దిగ్గజ కంపెనీ కార్ల రీకాల్‌

Published Thu, Dec 14 2023 5:52 AM | Last Updated on Thu, Dec 14 2023 12:30 PM

Tesla recalls nearly all vehicles sold in US - Sakshi

డెట్రాయిట్‌: ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అమెరికాలో విక్రయించిన దాదాపు అన్ని కార్లను రీకాల్‌ చేసింది. ఇవి సుమారు 20 లక్షల పైచిలుకు ఉంటాయి. 2012 అక్టోబర్‌ 5 మొదలు ఈ ఏడాది డిసెంబర్‌ వరకు ఉత్పత్తి చేసిన వై, ఎస్, 3, ఎక్స్‌ మోడల్స్‌ వీటిలో ఉన్నాయి. ఆటోపైలట్‌ విధానాన్ని ఉపయోగించేటప్పుడు డ్రైవర్ల అప్రమత్తతను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన సిస్టమ్‌లో తలెత్తిన లోపాన్ని సరి చేసేందుకు, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

డ్రైవర్లకు జారీ చేసే హెచ్చరికలు, అలర్ట్‌లను సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ మరింతగా పెంచుతుందని, అలాగే ఆటోపైలట్‌ బేసిక్‌ వెర్షన్లు పని చేయగలిగే పరిధిని కూడా నియంత్రిస్తుందని పేర్కొంది. ఆటోపైలట్‌ పాక్షికంగా వినియోగంలో ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాలపై జాతీయ రహదారి ట్రాఫిక్‌ భద్రత ఏజెన్సీ రెండేళ్ల పాటు దర్యాప్తు నిర్వహించిన మీదట టెస్లా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆటోపైలట్‌ మోడ్‌లో ఉన్నప్పుడు డ్రైవర్లను అప్రమత్తంగా ఉంచేందుకు టెస్లా కార్లలో తీసుకున్న జాగ్రత్త చర్యలు తగినంత స్థాయిలో లేవని దర్యాప్తులో ఏజెన్సీ అభిప్రాయపడింది. పేరుకు ఆటోపైలట్‌ సిస్టమ్‌ అయినప్పటికీ ఇది డ్రైవర్‌కు కొంత అసిస్టెంట్‌గా మాత్రమే పని చేయగలదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే (తన లేన్‌లో) వాహనాన్ని నడపడం, యాక్సిలరేట్‌ చేయడం, బ్రేక్‌లు వేయడం మొదలైన పనులు చేస్తుంది. మిగతా అన్ని సందర్భాల్లో డ్రైవరు అప్రమత్తంగా ఉండి అవసరమైతే తనే డ్రైవింగ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు ఈ జాగ్రత్తలను పక్కన పెట్టి ఆటోపైలట్‌ను ఆన్‌ చేసి వెనక సీట్లో కూర్చోవడం లేదా తాగేసి కూర్చోవడం వంటివి చేస్తుండటమే ప్రమాదాలకు దారి తీస్తున్నాయనే అభిప్రాయం నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement