అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా USAలో దాదాపు 2,00,000 వాహనాలకు రీకాల్ ప్రకటించింది. కారు రివర్స్‌లో ఉన్నప్పుడు బ్యాకప్ కెమెరా పనిచేయకపోవచ్చనే కారణంతో కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
టెస్లా రీకాల్ అనేది 2023 మోడల్ ఎస్, ఎక్స్, వై వాహనాలకు వర్తిస్తుంది. ఇవన్నీ కూడా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కంప్యూటర్ 4.0ని కలిగి ఉన్నాయి. ఇది 2023.44.30 సాఫ్ట్‌వేర్ వెర్షన్‌పై పనిచేస్తుంది. ప్రస్తుతానికి టెస్లా కార్లలో ఈ లోపాలకు సంబంధించిన ఎలాంటి ప్రమాదం జరగలేదని టెస్లా యూఎస్ నేషనల్ హైవేస్ ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు తెలిపింది.
భవిష్యత్తులో కూడా టెస్లా కార్లలో ఎలాంటి సమస్య తలెత్తకూడదనే భావనతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం కంపెనీ జనవరి 12 నుంచి రీకాల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
నష్టాల్లో టెస్లా..
ఇదిలా ఉండగా టెస్లా కంపెనీ షేర్లు ఒక్కరోజులోనే ఏకంగా 12 శాతానికిపైగా నష్టపోయినట్లు తెలిసింది. టెస్లా ధరలను తగ్గిస్తున్నా.. సేల్స్ మాత్రం తగ్గుముఖం పడుతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మకాలు తగ్గడం మాత్రమే కాకుండా జనవరి 15న స్టాక్ విలువ 12.13 శాతం పడిపోయి 182.63 డాలర్ల వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్ విలువ బాగా తగ్గడం వల్ల టెస్లా మార్కెట్ వ్యాల్యూ ఒక్కరోజే 80 బిలియన్ డాలర్ల వరకు తగ్గింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 6.64 లక్షల కోట్లకు పైనే అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment