
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'టయోటా' (Toyota) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 11.2 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇన్ని కార్లకు కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, ఈ కార్లలో ఉన్న లోపాలు ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2020 నుంచి 2022 మధ్యలో తయారైన అవలాన్, కామ్రీ, కరోలా, ఆర్ఏవీ4, లెక్సస్ ఈఎస్ 250, ఈఎస్300హెచ్, ఈఎస్350, ఆర్ఎక్స్350 హైల్యాండర్, సియన్నా హైబ్రిడ్ వెహికిల్స్ వంటి వాటికి రీకాల్ ప్రకటించింది.
సమస్య ఏంటంటే?
2020 నుంచి 2022 మధ్యలో తయారైన ఈ కార్లలో ఎయిర్ బ్యాగులో ఏర్పడే లోపం కారణంగా ఆక్యుపెంట్ క్లాసిఫికేషన్ సిస్టమ్ (OCS) సెన్సార్‌లకు సంబంధిచిన సమస్యలు తలెత్తవచ్చని సంస్థ భావించి, దీనిని భర్తీ చేయడానికి ఈ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఒక్క అమెరికాలో మాత్రమే సుమారు 10 లక్షల కార్లలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. రీకాల్ సమయంలో సదరు వినియోదారుడు తన కారుని కంపెనీ అధికారిక డీలర్షిప్ వద్ద సమస్యను పరిష్కరించుకోవచ్చు. ప్రస్తుతానికి కంపెనీ కార్ ఓనర్లకు సమాచారం అందించలేదని, 2024 ఫిబ్రవరి సమయంలో అందరికి సమాచారం అందించే అవకాశం ఉందని సమాచారం.
ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే!
కార్లలోని లోపాలకు పరిష్కరించడానికి రీకాల్ ప్రకటించడం ఇదే మొదటి సారి కాదు, గతంలో చాలా కంపెనీలు ఇలా రీకాల్ ప్రకటించి సమస్యలను పరిష్కరించాయి. ఇటీవల టెస్లా కూడా ఆటోపైలట్ సిస్టమ్‌లోని లోపాన్ని సరి చేయడానికి 20 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది.