ఎండలు@ 44
మంచిర్యాలలో అత్యధిక ఉష్ణోగ్రత
హాజిపూర్ (మంచిర్యాల), హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. సోమవారం మంచిర్యాల జిల్లాలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వారం రోజులుగా 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం గమనార్హం. సోమవారం ఏకంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పలు వాతావరణ వెబ్‌సైట్లు పేర్కొనగా.. అధికారులు మాత్రం 41 డిగ్రీల మేర నమోదైనట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు కాస్త అటూఇటుగా నమోదవుతున్నాయి.
ఇంకా మే రాక ముందే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. అక్కడక్కడా వడగాడ్పులు వీస్తున్నాయి. దాంతో పగటిపూట బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. చాలా చోట్ల మధ్యాహ్నం పూట కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపిస్తోంది. వాతావరణంలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుండటంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
మరోవైపు వడదెబ్బకు సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరి మారుపాక కృష్ణయ్య(55), యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీదేవిగూడెంకు చెందిన ఉల్లెంతల బిచ్చయ్య(70), సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగకు చెందిన పండపాక రాజేందర్, కవిత దంపతుల కూతురు భానుజ (16 నెలలు)లు మృతి చెందారు.