
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి ఒడిశా వైపు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణాంధ్రప్రదేశ్ తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల మధ్య విస్తరించి కొనసాగుతోంది.
దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.