‘సాక్షి’తో ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర
తుపాను సూచనల ఖచ్చితత్వం దాదాపు 86%
సాక్షి, విశాఖపట్నం: వాతావరణ అంచనాలను కచ్చితత్వంతో మెరుగ్గా అందిస్తున్న దేశాల సరసన భారత్ నిలిచిందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ డా.మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. మిషన్ మౌసమ్‌లో భాగంగా అన్ని రాష్ట్రాల్లో రాడార్ల ఆధునికీకరణతోపాటు ప్రజలకు వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసేలా సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నట్లు చెప్పారు.
రెండేళ్లలో దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో కొత్త రాడార్ స్టేషన్లు ఏర్పాటు కానున్నట్లు వెల్లడించారు. విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఖచ్చితత్వాన్ని మెరుగుపరచుకున్నాం
వాతావరణ పరిస్థితుల అంచనాలో లోపాల్ని అధిగమించి ఖచ్చితత్వాన్ని మెరుగుపరచుకున్నాం. ప్రస్తుతం 40–50 శాతం ఫోర్ కాస్ట్‌ని ఖచ్చితత్వంతో అందిస్తున్నాం. 2030 నాటికి ఇది 15 శాతం పెరిగి 60–70 శాతం కచ్చితమైన సమాచారం అందించేలా కృషి చేస్తున్నాం. తుపానులపై మా అంచనాల ఖచ్చితత్వం అన్ని దేశాల కంటే మెరుగ్గా ఉంది. తుపాను సూచనల ఖచ్చితత్వం దాదాపు 86% వరకు ఉంది. హీట్‌వేవ్, కోల్డ్‌వేవ్ ఖచ్చితత్వం 92%గా ఉంది.
విశాఖ, మచిలీపట్నం రాడార్ స్టేషన్ల ఆధునికీకరణ..
వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 50 కొత్త రాడార్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం 1,000 కంటే ఎక్కువ ఆటోమేటిక్ వాతావరణ స్టేషన్లు, 6,000 రెయిన్ గేజ్‌లు, 550 డిపార్ట్‌మెంటల్ అబ్జర్వేటరీలు ఉన్నాయి. 25 విండ్ ప్రొఫైలర్స్, మైక్రో రేడియో మీటర్లు కొత్తగా ఏర్పాటు చేశాం. 60 రేడియో వన్ స్టేషన్లు జనరేట్ చేశాం. విశాఖపట్నం, మచిలీపట్నం, చెన్నై, కోల్‌కతా రాడార్ స్టేషన్లని ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
పిన్‌కోడ్‌తో సమాచారం మీ చేతుల్లో
2024–25 నాటికి బ్లాక్ లెవల్, పంచాయతీ లెవల్ ఫోర్‌కాస్ట్‌ని అందుబాటులోకి తీసుకొస్తాం. సాధారణ ప్రజలు సమాచారం తెలుసుకునేలా మౌసమ్ మొబైల్ యాప్ తీసుకొచ్చాం. జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో స్పెషల్ ప్లాట్‌ఫామ్ ద్వారా మీ ఊరి సమాచారం కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
మీ ప్రాంతం పిన్‌కోడ్ ఎంటర్ చేస్తే అక్కడికి సంబంధించిన వాతావరణ సమాచారం తెలుసుకునే విధానం రాబోతుంది. ఇందులో భాగంగా ప్రతి బ్లాక్‌కి ఒక ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. మొత్తంగా దేశంలో 1.30 లక్షల ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
అర్బన్ మోడలింగ్ సిస్టమ్..
వయనాడ్, విజయవాడల్లో వరదల ప్రభావం దృష్ట్యా అర్బన్ మోడలింగ్ సిస్టమ్‌ని అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఈ పనులు ప్రారంభించాం. మిగిలిన నగరాలకూ విస్తరించనున్నాం. దేశంలో 1,200 నగరాల్లో అర్బన్ సర్వీస్ అందిస్తున్నాం. 150 సిటీల్లో జియోస్పేషియల్ సర్వీస్ అందుబాటులో ఉంది. 2019 నుంచి పిడుగులు, ఉరుముల సమాచారం ఇస్తున్నాం. ఈ సమాచారం అందిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి.
3 కోట్ల మంది రైతులకు చేరువ
వాతావరణ సేవల ద్వారా ప్రతి గ్రామంలో కనీసం ఐదుగురు రైతులతో అనుసంధానం కావాలనేది మా లక్ష్యం. తీవ్రమైన వాతావరణ హెచ్చరికలతోపాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం, గాలుల వేగం వంటి వివరాలను ‘పంచాయతీ వాతావరణ సేవ’ ద్వారా పొందవవచ్చు.
దీన్ని వినియోగించుకుంటే చిన్న రైతులు రూ.12,500 వరకు లబ్ధి పొందవచ్చు. ఇప్పటివరకు 3 కోట్ల మంది రైతులకు చేరువయ్యాం. వీరికి రూ.13,300 కోట్ల మేర లబ్ధి కలిగింది. దేశంలో 10 కోట్ల మంది రైతులకు చేరువ కాగలిగితే స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరుగుతుంది. అదే మా ముందున్న లక్ష్యం.
ఘనంగా విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం స్వర్ణోత్సవాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం (సీడబ్ల్యూసీ) స్వర్ణోత్సవాలను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) డైరెక్టర్ డాక్టర్ మహాపాత్ర హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అమృత్ కాల్ విజన్‌కు అనుగుణంగా ఐఎండీ అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా స్వరో్ణత్సవ వేడుకల సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఐఎండీ మాజీ డీజీ అజిత్ త్యాగి, చెన్నై ఆర్‌ఎంసీ హెడ్ డా.బాలచంద్రన్, సీడబ్ల్యూసీ విశాఖపట్నం హెడ్ భారతి ఎస్. సబడే, కలెక్టర్ హరేందిర ప్రసాద్, ఏయూ వీసీ ఆచార్య శశిభూషణరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment