
‘సీవర్ క్రోక్’ పనితీరు పరిశీలన
సాక్షి, సిటీబ్యూరో: మురుగు నీటి పైపు లైన్లలో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన సీవర్ క్రోక్ రోబోటిక్ యంత్రం పనితీరును హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్, ఇలంబర్తి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోబోటిక్, వాటర్–జెట్ శక్తితో నడిచే ఈ యంత్రం సిల్ట్‌ను తొలగించే విధానాన్ని గమనించారు. సచివాలయం ముందు ఉన్న డైన్లలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. మురుగు, వరద నీరు పొంగి రహదారులను ముంచెత్తిత్తడం నగరంలో సర్వ సాధారణం. ఈ పరిస్థితుల్లో సీవర్ క్రోక్ ఎంత వరకు ఉపకరిస్తుందనేది అధ్యయనం చేశారు. వాటర్ జెట్‌తో టర్బైన్ తిప్పడంతో ముందుకు వెళ్లి ఈ యంత్రం బ్లేడ్ల సాయంతో చెత్తను తొలగిస్తుంది. మురుగునీటి లైన్లను శుభ్రం చేయడానికి సీవర్ క్రోక్‌ను గతంలో వాటర్ బోర్డు వినియోగించిందని తయారీ సంస్థ అజంతా టెక్నో సొల్యూషన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ జర్మయ్య తెలిపారు.