
జలమండలికి ‘ఉత్తమ యాజమాన్యం’ అవార్డు
సాక్షి, సిటీబ్యూరో: జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరల్డ్ వాటర్ అవార్డు, ఉత్తమ ఎస్టీపీ పురస్కారాన్ని అందుకోగా.. తాజాగా మరో అవార్డును తన ఖాతాలో వేసుకుంది. తమ సంస్థలో పని చేస్తున్న కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకుంటున్న చర్యలు, స్నేహ పూర్వక సంబంధాలకు గానూ ఉత్తమ యాజమాన్యం పురస్కారాన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం రవీంద్ర భారతిలో జరిగిన కార్మిక దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అందుకున్నారు. ప్రభుత్వ విభాగాల్లో జలమండలికి మాత్రమే ఈ అవార్డు దక్కడం విశేషం. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో బోర్డు డైరెక్టర్ (పర్సనల్) మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.